logo

పురపాలిక స్థలాలు.. ఆక్రమణల పర్వం

పాలకవర్గం పట్టింపు లేమి, అధికారుల ఉదాసీనత, అక్రమాలకు అండగా నిలుస్తున్న కొందరు ప్రజాప్రతినిధుల కారణంగా జనగామ పురపాలికకు చెందిన విలువైన ఆస్తులు, ఖాళీ స్థలాలు చేజారుతున్నాయి.

Published : 05 May 2024 05:26 IST

మున్సిపల్‌ కార్యాలయం ఎదురుగా కూల్చిన ప్రహరీ

జనగామ, న్యూస్‌టుడే: పాలకవర్గం పట్టింపు లేమి, అధికారుల ఉదాసీనత, అక్రమాలకు అండగా నిలుస్తున్న కొందరు ప్రజాప్రతినిధుల కారణంగా జనగామ పురపాలికకు చెందిన విలువైన ఆస్తులు, ఖాళీ స్థలాలు చేజారుతున్నాయి. చివరకు కార్యాలయ ఆవరణలోని స్థలం కబ్జా అవుతున్నా పట్టించుకోని దుస్థితి ఏర్పడింది. జనగామ పట్టణంలో రహదారులు, ఫుట్‌పాత్‌లు, మున్సిపల్‌ లే ఔట్‌ స్థలాలు, గ్రీన్‌ బెల్టు స్థలాలు, కుంటలు, చెరువులు కావేవి ఆక్రమణకు అనర్హం అన్నట్లుంది పరిస్థితి. ఎన్నికల హడావిడిలో అధికారులు తలమునకలైన తరుణంలో ఇదే అదనుగా ఆక్రమణలకు, అక్రమ నిర్మాణాలకు తెగబడుతున్నారు.

నాయకుల అండ ఉందని

స్థానిక వీవర్స్‌కాలనీలో 1000 గజాల లే ఔట్‌ స్థలంలో రూ.కోటి వ్యయంతో దోబీ ఘాట్‌ కోసం శంకుస్థాపన చేశారు. అక్కడ దోబీఘాట్‌ నిర్మాణంపై వివాదం ఏర్పడగా పనులు ప్రారంభించలేదు. ఇదే అదనుగా కొందరు 1000 గజాల స్థలం మధ్యలో అనుమతి లేని నిర్మాణాలకు తెరతీశారు. దీనిపై కొందరు పోలీసులకు ఫిర్యాదు చేయగా, ఆక్రమణ దారులకు నోటీసులు అందజేశారు. కొన్నాళ్ల పాటు వెనకడుగు వేసి మళ్లీ నిర్మాణ పనులు ప్రారంభించారు. ఇప్పటికీ స్థలాన్ని మున్సిపల్‌ ఆధీనంలోకి తీసుకోలేదు. అధికార పార్టీ నాయకుడొకరి మద్దతు పేరిట ఆక్రమణకు ప్రయత్నిస్తున్నారని సమాచారం.

  • మున్సిపల్‌ స్థలంలో కబ్జా జరిగిందని శనివారం ‘ఈనాడు’లో ‘మున్సిపల్‌ కార్యాలయ ఖాళీ స్థలం కబ్జా’ శీర్షికన ప్రచురితమైన కథనానికి జిల్లా అదనపు కలెక్టర్‌ పింకేశ్‌కుమార్‌ స్పందించారు. ఈ విషయమై కొలతలు వేయించి చర్యలు తీసుకోవాల్సి ఉంది.

కనుమరుగు: వీవర్స్‌కాలనీ లేఔట్‌ స్థలంలో ప్రైవేటు, ప్రభుత్వ నిర్మాణాలున్నాయి. టీఎన్జీవోస్‌ కాలనీలో మిగులు స్థలానికి ముప్పు ఉంది. గాంధీనగర్లో కమ్యునిటీ భవనం, ఖాళీ స్థలానికి రక్షణ కరవైంది. అంబేడ్కర్‌నగర్‌, సంజయ్‌నగర్లో గ్రీన్‌బెల్టు స్థలాల్లో ఆక్రమణలున్నాయి. పట్టణంలో మున్సిపల్‌కు 10 చోట్ల లే ఔట్‌ మిగులు స్థలాలున్నాయి. వీటికి రక్షణ కరవైంది.

నాగార్జున టీచర్స్‌కాలనీలో

ఈ కాలనీ లేఔట్‌ మ్యాప్‌ వివరాలను అనుసరించి 3569.78, 1016.48 చ.గజాల స్థలం, రెండు విభాగాలుగా ఉండాలి. ఇందులో ఓ చోట మందిరం వెలిసింది. మరి కొంత స్థలంలో ప్రకృతి వనం ఏర్పాటు చేశారు. రూ.25 వేలకు గజం విలువ ఉన్న ఈ ప్రాంతంలో తాజాగా మిగులు స్థలాన్ని ఆక్రమించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. హైదరాబాద్‌ రోడ్డు పక్కనే ఉన్న ఈ స్థలం రికార్డుల ప్రకారం మున్సిపాల్టీదే. కానీ ఓ సంస్థ స్థలం వద్ద బోర్డు నాటినా, అధికారులు లెక్కలు తేల్చలేదు.

  • గణేశ్‌వాడ, పాత ఆంధ్రాబ్యాంకు చౌరస్తా, బంజరు దొడ్డి, ఈసేవ సమీపంలోని ఖాళీ స్థలాలు పరాధీనమయ్యాయి. ఇప్పటికే మున్సిపల్‌ అల్పాదాయ వర్గాల వసతి గృహాలు చేజారాయి. కార్యాలయం పక్కన రాత్రి బస ప్రతిపాదిత స్థలంలో కొంత రేడియాలజీ ల్యాబ్‌ నిర్మించారు.
  • చంపక్‌హిల్స్‌లోని 10 ఎకరాల డంపుయార్డు స్థలానికి ఆక్రమణల బెడద ఉంది. వెనకవైపు ప్రహరీ నిర్మిస్తున్నారు. అక్రమంగా మొరం, మట్టి తవ్వకాలు జరుగుతున్నాయి.
  • పట్టణంలో మున్సిపల్‌ ఆస్తులపై సమగ్ర వివరాలను సేకరించి, రక్షణకు చర్యల కోసం జిల్లా అధికారుల దృష్టికి తీసుకువెళ్తానని మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ జమున అన్నారు.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని