logo

బస్తాకు అర కిలో.. ఎకరాకు రూ.250

రైతులు నిద్రాహారాలు మాని శ్రమించి పండించిన వరి ధాన్యం దళారులపాలు అవుతోంది. ఐకేపీ, పీఏసీఎస్‌ కొనుగోలు కేంద్రాల వద్ద గోల్‌మాల్‌ చేస్తూ రైతులకు తీవ్ర అన్యాయం చేస్తున్నారు.

Published : 07 May 2024 07:00 IST

ధాన్యం తూకంలో రైతులకు అన్యాయం
న్యూస్‌టుడే, బాలసముద్రం

కోమటిపల్లి ప్రాంతం కపురతండా శివారులో ధాన్యం తూకం వేస్తున్న హమాలీలు

రైతులు నిద్రాహారాలు మాని శ్రమించి పండించిన వరి ధాన్యం దళారులపాలు అవుతోంది. ఐకేపీ, పీఏసీఎస్‌ కొనుగోలు కేంద్రాల వద్ద గోల్‌మాల్‌ చేస్తూ రైతులకు తీవ్ర అన్యాయం చేస్తున్నారు. జిల్లాలోని పలు గ్రామాల్లో ధాన్యం తూకంలో జరుగుతున్న మాయాజాలంతో రైతులు నష్టపోతున్నారు. గ్రేటర్‌ వరంగల్‌ పరిధిలోని 65వ డివిజన్‌ కోమటిపల్లి, కపురతండా, దేవన్నపేట, ఉనికిచెర్ల గ్రామాల్లో అదనంగా తూకం వేస్తూ రైతులను దగా చేస్తున్నారు. రైతుల ఫిర్యాదు మేరకు క్షేత్ర స్థాయిలో పరిశీలన చేస్తే ఈ విషయం తెలిసింది. వివరాలు ఇలా ఉన్నాయి.


500 గ్రాములు అదనం

గతంలో 70 కిలోలు నింపే ధాన్యం సంచి బరువు 900 గ్రాములు ఉండేది. బస్తా బరువు మోయలేమని హమాలీలు కోరడంతో దాన్ని 40 కిలోలకు కుదించారు. 40 కిలోల ధాన్యం సంచి 540 గ్రాముల బరువు ఉంటుంది. రైతుల కల్లాల్లో 40 కిలోల ధాన్యంతో పాటు అదనంగా మరో కిలో తూకం వేస్తున్నారు. వాస్తవంగా 40 కిలోల ధాన్యంతో పాటు 540 గ్రాములు సంచి బరువుతో తూకం వేయాలి. కొనుగోలు కేంద్రాల సిబ్బంది 41 కిలోలు తూకం వేస్తూ రైతులను మోసం చేస్తున్నారు.


తాలు పేరుతో అదనపు తూకం

ఈసారి భూగర్భ జలాలు అడుగంటడంతో సకాలంలో పంటలకు సాగునీరు అందలేదు. దీంతో వరి ధాన్యం కొంత మేరకు తాలు ఏర్పడింది. వరికోత యంత్రాలతో ధాన్యం కుప్పలు వేసే క్రమంలో తాలు బయటకు వెళ్లి మేలురకం వచ్చింది. కొందరు రైతులకు తాలు కలవడంతో తూర్పార పట్టి కుప్పలు పోశారు. మరికొందరు ఎండల తీవ్రత కారణంగా తూర్పార పట్టలేకపోయారు. ఇదే అదనుగా తాలు కలిసిందనే కారణంతో 1.500 గ్రాముల ధాన్యం అదనంగా తూకం వేస్తున్నారు.

20 రోజలుగా నిరీక్షణ..

గత నెల మొదటి వారం నుంచే వరి కోతలు మొదలు పెట్టారు. కోమటిపల్లి, దేవన్నపేట, ఉనికిచెర్ల, కపురతండా తదితర పుర విలీన గ్రామాల్లో నెల రోజుల నుంచి వరిధాన్యం కోసి కుప్పలు పోసి ఉంచారు. కొనుగోలు కేంద్రాల సిబ్బంది సకాలంలో ప్రణాళిక చేసుకోకపోవడంతో రైతులకు ఆలస్యంగా టోకెన్లు జారీ చేశారు. మిల్లర్ల కేటాయింపు, సంచులు అందని కారణంగా కొనుగోలు కోసం రైతులు 20 రోజులుగా నిరీక్షించారు. ఇటీవల అకాల వర్షాలు కురిస్తే ఒక్కో రైతు రూ.10 వేలు వెచ్చించి పరదాలు కొనుగోలు చేసి ధాన్యం తడవకుండా కాపాడుకున్నారు. రైతులు ఆందోళన చేస్తే ఐదు రోజుల కిందట కొనుగోళ్లు ప్రారంభించారు.

  • ప్రభుత్వ నిబంధనల మేరకు 40 కిలోల 700 గ్రాముల ధాన్యం తూకం వేయాలి.. అంతకు మించి ఎక్కడైనా అధిక తూకం వేసినట్లు సమాచారం అందిస్తే తగిన చర్యలు తీసుకుంటామని జిల్లా సహకార అధికారి నాగేశ్వర్‌రావు చెప్పారు.

దిగుబడి తగ్గింది.. నష్టం పెరిగింది

గతంలో ఎకరాకు 30 క్వింటాళ్లకు పైగా ధాన్యం దిగుబడి వచ్చేది. ప్రస్తుతం సకాలంలో నీరు అందక దిగుబడి తగ్గి 21 క్వింటాళ్ల ధాన్యం మాత్రమే వచ్చింది. 40 కిలోల సంచులతో సరి చూస్తే 56 నుంచి 60 బస్తాలు చేతికొచ్చాయి. ఒక్కో బస్తాకు 500 గ్రాముల ధాన్యం అదనంగా తూకం వేస్తే ఎకరాకు రూ.250 మేర రైతులకు నష్టం కలుగుతుంది. తాలు పేరుతో అదనంగా కిలో తూకం వేస్తే ఎకరాకు మరో రూ.693 వరకు నష్టం వస్తుంది. ప్రస్తుతం క్వింటాలు ధాన్యం రూ.2203 చొప్పున ప్రభుత్వం కొనుగోలు చేస్తోంది.

గన్ని సంచి బరువు 540 గ్రాములు ఉంటే.. అదనంగా కిలో తూకం వేస్తున్నారు. ఎలక్ట్రానిక్‌ కాంటాలో గన్ని సంచి సరి చూస్తే 540 గ్రాములు చూపిస్తున్న చిత్రం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని