logo

అయిదేళ్లలో.. గుప్పెడు మట్టీ తీయలే!

పశ్చిమ డెల్టాలో మురుగు పారుదల వ్యవస్థ నానాటికీ తీసికట్టుగా మారతోంది. ప్రధాన డ్రెయిన్లలో ఒకటైన చినకావరం కాలువ ఆక్రమణలు, పూడికతో ప్రవాహ సామర్థ్యాన్ని కోల్పోతోంది.

Updated : 28 Mar 2024 06:33 IST

ఆక్రమణలు.. ఆపై పూడిక
సామర్థ్యం కోల్పోయిన చినకాపవరం డ్రెయిన్‌

తరటావ- కోళ్లపర్రు మధ్య డ్రెయిన్‌ గట్టు వెంబడి పూడ్చిన ప్రాంతం

ఆకివీడు, న్యూస్‌టుడే: పశ్చిమ డెల్టాలో మురుగు పారుదల వ్యవస్థ నానాటికీ తీసికట్టుగా మారతోంది. ప్రధాన డ్రెయిన్లలో ఒకటైన చినకావరం కాలువ ఆక్రమణలు, పూడికతో ప్రవాహ సామర్థ్యాన్ని కోల్పోతోంది. ఆకివీడు మండలం పరిధిలో గుమ్ములూరు నుంచి దుంపగడప శివారు వరకు 12 కిలోమీటర్ల మేర విస్తరించిన ఈ కాలువ ప్రవాహ సామర్థ్యం 1800 క్యూసెక్కులు. ఎగువన 1.20 లక్షల ఎకరాల నుంచి వచ్చే మురుగును ఈ డ్రెయిన్‌ ద్వారా మళ్లిస్తారు. పూడిక, ఆక్రమణలతో కారణంగా ఇది రూపు కోల్పోయింది. భారీ వర్షాలు, తుపాన్ల సమయంలో డ్రెయిన్‌ పొంగి పలు గ్రామాల్లో నివాస ప్రాంతాలు, వేలాది ఎకరాల వరిచేలు ముంపుబారిన పడుతున్నాయి. గత అయిదేళ్లలో ఒక్కసారి కూడా దీనిలో పూడికతీత పనులు చేసిన దాఖలాలు లేవు.

దర్జాగా కబ్జా.. ఈ డ్రెయిన్‌ వెంబడి కొన్నేళ్లుగా ఆక్రమణ పర్వం కొనసాగుతోంది. ప్రారంభం నుంచి శివారులో దుంపగడప వరకు కాలువకు ఇరువైపులా డ్రెయిన్‌ గట్లను ఆక్రమించుకుని తాత్కాలిక నివాసాలు, గోదాములు, ఇతర కట్టడాలు నిర్మిస్తున్నారు. గుమ్ములూరు, తరటావ, కోళ్లపర్రు గ్రామాల పరిధిలో ఏకంగా డ్రెయిన్‌ లోపలే వరి, అరటి తదితర పంటలు సాగు చేస్తున్నారు. రైతులు ఫిర్యాదు చేసినా అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవడం లేదు. కొందరు ఆక్రమించిన స్థలాన్ని దర్జాగా అమ్మేస్తున్నారు. ఇలాంటి లావాదేవీలకు ప్రజాప్రతినిధులు, నాయకులు మధ్యవర్తులుగా వ్యవహరిస్తున్నారు.


పచ్చగా.. చూడముచ్చటగా ఉన్న వరి పైరు చక్కటి వ్యవసాయ క్షేత్రాన్ని తలపిస్తోంది కదూ. ఇది వ్యవసాయ క్షేత్రం కాదు.. డెల్టాలో కీలకమైన చినకాపవరం డ్రెయిన్‌ గర్భం. ఆకివీడు మండలం గుమ్ములూరు గ్రామ పరిధిలో ఈ డ్రెయిన్‌ పొడవునా కొన్ని ప్రాంతాల్లో ఇలాంటి దృశ్యాలు కనిపిస్తాయి.


సర్వే చేయిస్తాం..

చినకాపవరం డ్రెయిన్‌ పరిధిలో సర్వే చేయించి ఆక్రమణలు తొలగించడంతో పాటు పూడికతీత పనులు చేపట్టేలా చర్యలు తీసుకుంటాం. డ్రెయిన్‌ ప్రక్షాళనకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తాం.

వెంకటేశ్వరరావు, డ్రెయిన్ల శాఖ ఏఈ

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని