logo

జగన్‌... నిన్ను నమ్ముకుంటే కొంప కొల్లేరు

 ‘మనందరి ప్రభుత్వం అధికారంలోకి రాగానే కొల్లేరు, ఉప్పుటేరు పరిరక్షణకు చర్యలు చేపడతాం. ఉప్పుటేరు ముఖద్వారం దగ్గర యుద్ధ ప్రాతిపదికన రెగ్యులేటర్లు నిర్మించి కొల్లేరుకు పూర్వ వైభవం తీసుకొస్తాం’

Updated : 18 Apr 2024 05:21 IST

 రెగ్యులేటర్ల హామీ గాలికొదిలేసిన సీఎం

 3 లక్షల మంది ఉపాధికి దెబ్బకొట్టిన వైనం

 మరో పక్క అనుచర గణంతో వేలాది ఎకరాల్లో చెరువుల తవ్వకాలు

కొవ్వాడలంక వద్ద నీరు లేక నెర్రెలు తీసిన కొల్లేరు

 ‘మనందరి ప్రభుత్వం అధికారంలోకి రాగానే కొల్లేరు, ఉప్పుటేరు పరిరక్షణకు చర్యలు చేపడతాం. ఉప్పుటేరు ముఖద్వారం దగ్గర యుద్ధ ప్రాతిపదికన రెగ్యులేటర్లు నిర్మించి కొల్లేరుకు పూర్వ వైభవం తీసుకొస్తాం’

 - 2018 మే 12న కైకలూరులో నిర్వహించిన ప్రజా సంకల్ప యాత్రలో వైఎస్‌ జగన్‌ ఇచ్చిన హామీ  .


ఈనాడు ఏలూరు, న్యూస్‌టుడే, మండవల్లి, కైకలూరు: ‘జగన్‌.. నిన్ను నమ్ముకుంటే మా కొంప కొల్లేరే’ అంటూ ఏలూరు జిల్లా ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మాట తప్పను మడమ తిప్పను అంటూ ప్రసంగాల్లో వినిపిస్తున్న మాటలు ఆచరణలో కనిపించటం లేదు. ఆరేళ్ల క్రితం రెగ్యులేటర్లు నిర్మిస్తానంటూ హామీ ఇచ్చి అయిదేళ్లయినా ఒక్క అడుగు వేయకుండా..ఏ మొహం పెట్టుకుని ఓట్లు అడుగుతారంటూ ప్రశ్నిస్తున్నారు.

కొల్లేరుకు పూర్వ వైభవం తీసుకొస్తానని హామీ ఇచ్చిన జగన్‌ మాత్రం కొల్లేరును కొల్లగొట్టిస్తున్నారు. అయిదేళ్ల వైకాపా పాలనలో ప్రజాప్రతినిధుల అండతో 5వ కాంటూరులో వేలాది ఎకరాల్లో చెరువులు తవ్వేశారు. విశాఖ, కృష్ణా జిల్లాల వైకాపా నాయకులు సైతం చెరువులు సాగు చేస్తున్నారు. జిల్లాకు చెందిన ముగ్గురు ప్రజాప్రతినిధులు అడ్డగోలుగా చెరువులు తవ్వించుకుని చేపల సాగు చేస్తున్నారు.  అక్కడితో అగకుండా       తవ్వకందారుల నుంచి ఎకరానికి రూ.20 వేల నుంచి  30 వేల వరకు వసూలు చేసి రూ.కోట్లు దోచుకున్నారు.

ఉమ్మడి జిల్లాలో 67 డ్రెయిన్ల ద్వారా ఏటా లక్ష క్యూసెక్కుల నీరు కొల్లేరులోకి చేరుతోంది. అలా చేరిన నీటిలో దాదాపు 20 వేల క్యూసెక్కులు ఉప్పుటేరు ద్వారా వృథాగా సముద్రంలో కలుస్తోంది. సముద్రపు నీరు సైతం ఉప్పుటేరులోకి రావటంతో కొల్లేరు ఉప్పుమయంగా మారుతోంది. మంచి నీరు వృథాగా సముద్రంలో కలవకుండా..సముద్రపు నీరు కొల్లేరులోకి చొరబడకుండా సమతౌల్యం ఉండాలంటే రెగ్యులేటర్ల నిర్మాణం అనివార్యం. జగన్‌ అయిదేళ్ల తాత్సారంతో రెగ్యులేటర్ల నిర్మాణానికి అడుగులు పడలేదు. రూ.412 కోట్ల అంచనా వ్యయంతో నిర్మాణానికి ఒకటి, రెండు సార్లు టెండర్లు పిలిచినా జగన్‌ ప్రభుత్వ అసమర్థతతో గుత్తేదారులు ఎవరూ ముందుకు రాలేదు. వైకాపా పాలనలో పనులు చేసినా బిల్లులు రావని టెండర్లు కూడా వేయలేదు.
వరద నీరు కొల్లేరులోకి వచ్చాక కనీసం ఆరు నెలలు నీరు నిల్వ ఉంటేనే మత్స్య సంపద అభివృద్ధి చెందుతుంది. ఈ సారి నాలుగు నెలలకే (ఫిబ్రవరి)చేపల జాడలేదు. దీంతో వారి కుటుంబాలకు పూట గడవటం కూడా కష్టమవుతోంది. మళ్లీ వరద వచ్చే వరకు పస్తులుండలేక ఇతర రాష్ట్రాలకు వలస పోతున్నారు.
నాలుగేళ్లుగా కొల్లేరులో డ్రెయిన్ల మళ్లింపు, ఆధునికీకరణ పనులు చేయడంతో నీటినిల్వ సామర్థ్యం తగ్గిపోతోంది. కొల్లేరులో ప్రధానమైన బుడమేరు, రామిలేరు, తమ్మిలేరు డ్రెయిన్లను వెలగలేరు వద్ద పోలవరం కుడికాలువలో కలపడంతో  నీరు కొల్లేరుకు రావటం లేదు.
ఇతర దేశాలు సుదూర ప్రాంతాల నుంచి సంతానోత్పత్తి కోసం వచ్చే వేలాది రకాల పక్షలకు సైతం నీరు, ఆహారం దొరకడం లేదు. నీటి జాడ లేక అనేక రకాల మత్స్య, ఇతర జాతుల సంఖ్య తగ్గిపోతోంది.


లక్షల మంది జీవనం అస్తవ్యస్తం..

రెగ్యులేటర్లు లేకపోవటంతో మంచి నీరు కడలిపాలవుతోంది. లేదా ఉప్పునీటిమయమవుతోంది. దీంతో కొల్లేరుపై ఆధారపడిన దాదాపు 3 లక్షల మంది మత్స్యకారులకు జీవనం ప్రశ్నార్థకంగా మారింది.


రెగ్యులేటర్‌తో నీటిని స్థిరీకరించాలి..

కొల్లేరులో నీటిని స్థిరీకరిస్తేనే ఇక్కడ జీవిస్తున్న ప్రజలకు ఉపాధి, పక్షులకు, నల్లజాతి చేపలకు మనుగడ ఉంటుంది. లేకుంటే ఎడారిగా మారే సమయం ఎంతో దూరంలో లేదు. కొల్లేరులో అయిదడుగుల నీటిని నిల్వ చేసేందుకు రెగ్యులేటర్‌ నిర్మించాలి. కొల్లేరు ప్రజలకు ఉపాధి పెంపొందించేందుకు పర్యాటకంగా అభివృద్ధిచేయాలి.
- ఘంటసాల వెంకటేశ్వరరావు, బీఎంఎస్‌ మత్స్యశాఖ రాష్ట్ర ఉపాధ్యక్షుడు


నెరవేర్చలేని హామీలెందుకు..

జగన్‌ రెగ్యులేటర్లు నిర్మాణం చేస్తానని కొల్లేరుపై ఆధారపడిన  ప్రజలను మోసం చేశారు. నెరవేర్చలేనప్పుడు హామీలు ఇవ్వటం ఎందుకు. వైకాపా నాయకులే అక్రమంగా చెరువులు తవ్విస్తున్నారు. దీంతో కొల్లేరు కాలుష్యమవుతోంది.

- జయ మంగళ సుబ్బరాజు, పెంచికలమర్రు కైకలూరు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని