logo

తపాలా ఓటు వేయనిస్తారా.. లేదా?

ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులకు తపాలా బ్యాలెట్‌ సదుపాయాన్ని ఎన్నికల సంఘం కల్పించింది.

Published : 04 May 2024 04:07 IST

అంగన్‌వాడీ సిబ్బందికి ఫారం-12 ఇవ్వకుండానే ముగిసిన గడువు

ఏలూరు కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులకు తపాలా బ్యాలెట్‌ సదుపాయాన్ని ఎన్నికల సంఘం కల్పించింది. ఇందుకు ఫారం-12 సమర్పించాల్సి ఉంటుంది. ఈ గడువు ఇప్పటికే ముగియడంతో తపాలా బ్యాలెట్‌ వినియోగానికి అవసరమైన ఏర్పాట్లను అధికారులు చేశారు. ఎన్నికల విధులకు నియమితులైన అంగన్‌వాడీ కార్యకర్తలు, సహాయకులు, ఒప్పంద ఉద్యోగులకు తపాలా బ్యాలెట్‌ వినియోగించుకునే అవకాశం లేకుండా చేశారు.

ఎన్నికల విధులను తొలుత కొన్ని శాఖల ఉద్యోగులకు మాత్రమే కేటాయించారు. సిబ్బంది కొరత ఏర్పడటంతో అనంతరం అంగన్‌వాడీ కార్యకర్తలు, సహాయకులు, ఒప్పంద ఉద్యోగులనూ నియమించారు. తపాలా బ్యాలెట్‌కు దరఖాస్తు గడువుకు  మూడురోజుల ముందే వీరికి విధులు కేటాయించారు. ఫారం-12 దరఖాస్తులు వీరికి ఇవ్వలేదు. ఈలోగా తపాలా బ్యాలెట్‌కు దరఖాస్తు చేసుకునే గడువు ముగిసింది. ఇలాంటి పరిస్థితుల్లో తాము ఓటు హక్కు వినియోగానికి దూరం అవుతున్నామని వారు ఆందోళన చెందుతున్నారు. ఉద్యోగులు అనేక మంది ప్రభుత్వంపై వ్యతిరేకతతో ఉన్నందున వారి ఓట్లకు గండి కొట్టాలనే ఉద్దేశంతోనే ఇటువంటి విధానాలకు పాల్పడుతున్నారనే విమర్శ వినిపిస్తోంది.

ఓటు వినియోగించుకునే రోజుల్లోనే శిక్షణ

ఎన్నికల విధులకు నియమితులైన ఉద్యోగులు ఓటు హక్కు వినియోగించుకునే రోజుల్లోనే శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. పీవోలకు ఈ నెల 4న, ఏపీవోలకు  5న తరగతులు ఏర్పాటుచేశారు. దీంతో ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఉండదు. అందుకే తపాలా బ్యాలెట్‌ వినియోగానికి గడువు తేదీని పెంచాలని వారు కోరుతున్నారు.  ‘ఎన్నికల విధులు కేటాయించిన ఉద్యోగులు ఫారం-12 దరఖాస్తు చేసినా చాలామందికి ఓటు వినియోగించుకునే పరిస్థితులు ఉండటం లేదు. అందుకే దరఖాస్తు చేసుకోని ఉద్యోగులకు కూడా ఫెసిలిటేషన్‌ కేంద్రంలో వినియోగించుకునే అవకాశం కల్పించాలి’ అని ఏపీ వీఆర్వోల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు భూపతిరాజు రవీంద్రరాజు కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని