logo

పథకాల ఊకదంపుడే.. ప్రగతి ఊసేలేదు

ఇరవై నిమిషాల ప్రసంగంలో జిల్లా ప్రగతి గురించి.. అయిదేళ్లలో చేసిన అభివృద్ధిపై..ఒక్క మాట కూడా మాట్లాడలేదు.

Published : 04 May 2024 04:09 IST

జిల్లా సమస్యలపై నోరు విప్పని సీఎం
జగన్‌ వస్తేనే పథకాలుంటాయని పరోక్ష బెదిరింపులు

ఈనాడు, భీమవరం, న్యూస్‌టుడే, నరసాపురం: ఇరవై నిమిషాల ప్రసంగంలో జిల్లా ప్రగతి గురించి.. అయిదేళ్లలో చేసిన అభివృద్ధిపై..ఒక్క మాట కూడా మాట్లాడలేదు. నియోజకవర్గ ప్రజలకు  ఒక్క భరోసా ఇవ్వలేదు. ప్రసంగం చివరి వరకు పథకాలపై బాకాలూదటంతోనే సరిపెట్టారు. శుక్రవారం నరసాపురంలో  నిర్వహించిన సిద్ధం సభలో సీఎం జగన్‌ మోహన్‌రెడ్డి ప్రసంగం పేలవంగా సాగింది. ఉదయం 8 గంటల నుంచి మిట్ట మధ్యాహ్నం వరకు ప్రజలను నిలబెట్టి 20 నిమిషాల్లో అంతా ముగించి ముసిముసినవ్వులు నవ్వుతూ వెళ్లిపోయారు.   అసలు సంక్షేమ పథకాలను ఆయనే ప్రవేశపెట్టినట్లు మళ్లీ గెలిస్తేనే పథకాలు కొనసాగుతాయి.. లేదంటే ఆగిపోతాయని జనాలను పరోక్షంగా బెదిరించారు.

పర్యటనతో ఒరిగిందేమిటి: ‘జగన్‌ పర్యటనతో జిల్లాకు..నరసాపురం నియోజకవర్గానికి ఒరిగిందేంటి’.. ఇదే సభ అనంతరం జిల్లా ప్రజలు వైకాపా నాయకులకు వేస్తున్న ప్రశ్న.వారు సమాధానం చెప్పుకోలేని విధంగా జగన్‌ సభ సాగింది. కొత్తగా ఏర్పడిన జిల్లాలో పరిపాలన భవనాల మొదలు సచివాలయ భవనాల వరకు అన్నింటా ఇబ్బందులున్నాయి. వాటి గురించి జగన్‌ కనీసం ప్రస్తావించలేదు. 2022 నవంబరులో నరసాపురం పర్యటనకు వచ్చిన సీఎం జగన్‌ రూ.3,300 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. పనులు శరవేగంగా జరుగుతున్నాయని ఇటీవల భీమవరం సభకొచ్చినప్పుడు కూడా చెప్పుకొచ్చారు. ఆక్వా విశ్వవిద్యాలయం, ఫిషింగ్‌ హార్బర్‌, వశిష్ఠ వారధి, విద్యుత్తు ఉపకేంద్రం, పట్టణంలో భూగర్భ డ్రెయినేజీ.. ఇలా ఏ ఒక్క పనీ పురోగతిలో లేదు. అయినా వాటి నిర్మాణంపై కనీసం నోరు విప్పలేదు. వైకాపా అసమర్థతతో నిలిచిన వైద్యకళాశాల పనులపై పెదవి విప్పలేదు. వైకాపా నాయకుల అక్రమాలతో ఇప్పటికే నాలుగు సార్లు జారిన నరసాపురం ఏటిగట్టుతో ప్రమాదపు ఒడిలో ఉన్న ప్రజలకు కనీస భరోసా ఇచ్చే ప్రయత్నం చేయలేదు. చినుకు పడితే మునిగిపోయే నరసాపురానికి భూగర్భ డ్రెయినేజీ నిర్మిస్తామని ఇచ్చిన హామీ ఊసే ఎత్తలేదు. అధ్వానంగా ఉన్న రహదారులు, డంపింగ్‌ యార్డు సమస్య, మత్య్సకారుల ఇబ్బందులు, ఆక్వా రైతుల కష్టాలు.. ఇలా జిల్లాను పట్టిపీడిస్తున్న సమస్యలపై గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల గురించి నోరెత్తలేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని