logo

జగన్‌.. మేమేం చేశాం పాపం?

జగన్‌ సర్కారు అక్కసుతో  పింఛనుదారుల ఇక్కట్లు అన్నీ ఇన్నీ కావు. అగ్నిగుండంలాంటి ఎండలో పింఛను కోసం వారు పడిన వేదన వర్ణనాతీతం.

Published : 04 May 2024 04:26 IST

అవ్వాతాతల వేదన.. అరణ్యరోదన
మండే ఎండలో బ్యాంకుల వద్ద బారులు
ఊరూరా పింఛనుదార్ల అవస్థలు

బుట్టాయగూడెంలో బ్యాంకులో బారులు తీరిన పింఛనుదారులు

జగన్‌ సర్కారు అక్కసుతో  పింఛనుదారుల ఇక్కట్లు అన్నీ ఇన్నీ కావు. అగ్నిగుండంలాంటి ఎండలో పింఛను కోసం వారు పడిన వేదన వర్ణనాతీతం. ఆధార్‌ అనుసంధానం కాకపోవడం, ఖాతాలు మనుగడలో లేకపోవటం, సచివాలయాలు, బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణలు తదితర సమస్యలు శుక్రవారం కూడా కనిపించాయి.

ఈనాడు, భీమవరం, న్యూస్‌టుడే, తణుకు గ్రామీణం, ఆచంట

బ్యాంకులన్నీ పింఛనుదార్లతో కిటకిటలాడాయి. ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రజలు కొండలు, గుట్టలు ఎక్కుతూ కిమీ మేర నడుచుకుంటూ వచ్చి బ్యాంకుల వద్ద పడిగాపులు పడ్డారు. కొందరు ప్రయాణ ఖర్చులు పెట్టుకుని   వచ్చినా..ఆధార్‌ అనుసంధానం కాకపోవటం, ఖాతా మనుగడలో లేకపోవటం, పింఛన్‌ సొమ్ము జమకావటం వంటి సమస్యలతో అవస్థలు పడ్డారు.  ఎండ మండిపోతుంటే వృద్ధులు, దివ్యాంగులు బ్యాంకుల్లో ఇబ్బంది పడ్డారు. బ్యాంకుల్లో నగదు జమకాక సచివాలయాలకు వెళ్లటం, అక్కడ సిబ్బంది సమాధానం చెప్పకపోవటంతో మళ్లీ బ్యాంకుల దగ్గరకు పరుగులు పెట్టడం కనిపించింది.  నగదు విత్‌డ్రా చేసే దరఖాస్తు నింపడం రాని అవసరాన్ని ఆసరాగా తీసుకుని భీమవరం మండలం గొల్లవానితిప్పలో యూనియన్‌ బ్యాంకు బయట కొందరు యువకులు  దరఖాస్తులు పూర్తి చేసినందుకు ఒక్కో పింఛన్‌దారు నుంచి రూ.50 వరకు వసూలు చేశారు.

55 కి.మీ.. రప్పించి.. నిరాశపరచి..

గెడ్డపల్లి నుంచి పింఛను కోసం వచ్చిన కొండరెడ్డి గిరిజనులు

పోలవరం మండల కేంద్రానికి 55 కి.మీ దూరంలో ఉన్న గిన్నెపల్లి, గెడ్డపల్లి ఆదివాసీ గ్రామాలకు చెందిన 20 మంది రెండు వాహనాలు కిరాయికి పెట్టుకుని వచ్చారు. ఒక్కొక్కరికి రూ.400 చొప్పున వాహనాలకే రూ.8వేలు ఖర్చు అయింది. ఊళ్లో కూలిపని మానుకుని వచ్చారు. భోజనాలు, ఇతర ఖర్చులు అన్నీ కలుపుకొంటే రూ.10 వేలకు పైనే ఖర్చయింది. ఇంత వ్యయప్రయాసలు పడి వచ్చినప్పటికీ పెంటారెడ్డి, చంటమ్మలకు ఖాతాలో సొమ్ము జమకాలేదు. మళ్లీ ప్రత్యేక వాహనాలు పెట్టుకుని రావాలంటే పింఛను సొమ్ము కూడా సరిపోదని వారు ఆవేదన వ్యక్తం చేస్తూ వెనుదిరిగారు.

ఇద్దరి ఉసురు తీసి..

  • పింఛన్ల పంపిణీలో జగన్‌ ఆడుతున్న రాజకీయ చదరంగంలో పండుటాకులు రాలిపోతున్నాయి. మండుటెండలో పింఛను కోసం వెళ్లి.. ఆచంట మండలం చిల్లేవారిపాలేనికి చెందిన తాయారు(69) ప్రాణాలు విడిచారు. పోలవరం బాపూజీ కాలనీకి చెందిన కస్తూరి కడెమ్మ(55)   ఎండలో అర కిలోమీటరు దూరం నడిచి వచ్చి అస్వస్థతకు గురై మరణించారు.
  • ఎల్‌ అగ్రహారానికి చెందిన 70 ఏళ్ల వృద్ధుడికి తాడేపల్లిగూడెంలో మూడు బ్యాంకు ఖాతాలున్నాయి. నగదు జమయిందని తెలిసినా ఏ  ఖాతాలో ఉన్నాయో తెలియక మూడు రోజులుగా తిరుగుతున్నారు.  పరిశీలించగా నగదు జమకాలేదు. దీంతో దిక్కుతోచని స్థితిలో ఉన్నారు.

రెండ్రోజులుగా విలపిస్తూ...

పెనుమంచిలి తూర్పుగరువుకు చెందిన 75 ఏళ్ల కొంబత్తుల సుగుణమ్మ  రెండ్రోజులుగా మినీ బ్యాంకు, సచివాలయం, పోస్టాఫీˆసు చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు.  జాబితాలో ఆమెకు స్టేÆట్ బ్యాంకులో జమైనట్లు ఉండగా.. నాలుగైదు కిలోమీటర్ల దూరంలోని ప్రధాన బ్రాంచికి వెళ్లడం తెలియక రోదిస్తున్నారు.


నాకు మిగిలేది ఏమిటి?

‘మాది చివటం గ్రామం. నడవలేను.. ఇంటి వద్దే ఉంటా. ఐసీఐసీఐ బ్యాంకు ఖాతాలోకి పింఛన్‌ జమచేయడంతో రూ.500 ఆటో కట్టించుకొని ఇద్దరి సాయంతో వచ్చా. ఖాతా మనుగడలో లేదన్నారు. ఖాతాను బతికించేందుకు డబ్బులు కూడా చెల్లించాలని చెప్పారు. ఇలా అయితే నాకు మిగిలేది ఏమిటి?’అని వాపోయారు బీబీ.

ఎత్తుకుని తీసుకొచ్చారు..

మాది ఇరగవరం కాలనీ. మంచానికే పరిమితమయ్యాను. ఇంటికి పింఛన్‌ ఇస్తారనుకున్నా.  కానీ బ్యాంకు ఖాతా లో వేయడంతో చాలా ఇబ్బంది పడ్డా. రూ.300కు ఆటో కట్టించుకుని ఇద్దరు నన్ను ఎత్తుకుని బ్యాంకుకు తీసుకొచ్చారు. అధికారులు స్పందించి ఇంటికి పింఛన్‌ అందించేలా చర్యలు తీసుకోవాలి.

అమ్మాయమ్మ

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు