logo

తపాలా బ్యాలెట్‌ ఓటింగ్‌లో ఇంకా ఇబ్బందులు

తపాలా బ్యాలెట్‌ వినియోగంలో ఉద్యోగులకు రెండో రోజూ స్వల్ప ఇబ్బందులు ఎదురయ్యాయి.  శనివారం ఫెసిలిటేషన్‌ కేంద్రాలకు వెళ్లిన అనేక మంది ఉద్యోగులకు వారి ఓట్లు లేవని తెలుసుకుని తీవ్ర ఆవేదనకు లోనయ్యారు.

Published : 06 May 2024 05:19 IST

ఏలూరులో నిరీక్షిస్తున్న ఉద్యోగులు

ఏలూరు అర్బన్‌, నూజివీడు గ్రామీణ, న్యూస్‌టుడే: తపాలా బ్యాలెట్‌ వినియోగంలో ఉద్యోగులకు రెండో రోజూ స్వల్ప ఇబ్బందులు ఎదురయ్యాయి.  శనివారం ఫెసిలిటేషన్‌ కేంద్రాలకు వెళ్లిన అనేక మంది ఉద్యోగులకు వారి ఓట్లు లేవని తెలుసుకుని తీవ్ర ఆవేదనకు లోనయ్యారు. రెండో రోజు ఇటువంటి పరిస్థితి ఎక్కువ మందికి ఎదురు కాకపోయినప్పటికీ కొందరు గందరగోళానికి లోనయ్యారు.  ఏలూరులోని ఫెసిలిటేషన్‌ కేంద్రంలో రెండో రోజు ఎక్కువ కౌంటర్ల ఏర్పాటుతో ఎక్కువ సేపు క్యూలో నిలబడే పరిస్థితిని నివారించగలిగారు. ఉదయం కాస్త రద్దీగా ఉండటానికి తోడు కొందరి ఓట్లు ఇక్కడ లేవని తెలుసుకుని కొద్దిసేపు ఆందోళన చేశారు. ఏలూరు, నూజివీడుతోపాటు పలు ఇతర కేంద్రాలకు ఓటు వినియోగానికి వచ్చిన ఉద్యోగుల్లో కొందరికి ప్రధాన రాజకీయ పార్టీల ప్రతినిధులు నగదు పంపిణీ చేశారు. అయినప్పటికీ పోలీసులు వీరిని నియంత్రించలేకపోయారు.

నూజివీడులో గందరగోళం

నూజివీడు ట్రిపుల్‌ ఐటీలో నిర్వహిస్తున్న ఓటింగ్‌ ప్రక్రియ నిత్యం ఏదో ఒక గందరగోళానికి కారణం అవుతోంది. ఆదివారం ఈ కేంద్రంలో మరోసారి అధికార పార్టీ నాయకులు హవా నడిపించారు. తెదేపా నాయకులు అక్కడికి చేరుకునేలోపే వారు వెళ్లిపోయారు. కూటమి అభ్యర్థి పార్థసారథి వచ్చి ఆర్వో భవానీశంకరితో సమావేశమయ్యారు. ఫాం-12 ద్వారా కొందరు ఓట్లకు దరఖాస్తు చేశారని, వారిలో కలెక్టరు 18 మందికి అనుమతి ఇచ్చినట్లు ఆర్వో వివరించారు. అందులో ముగ్గురికి పోస్టల్‌ బ్యాలెట్‌ ఇవ్వకపోవడంతో ఈ గందరగోళం జరిగినట్లు వివరించారు. చీఫ్‌ ఏజెంట్లు అభ్యంతరం తెలపడంతో ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు తెలిపామని చెప్పారు. వారికి పోస్టల్‌ బ్యాలెట్‌ను అందిస్తామని తెలపడంతో పార్థసారథి వెనుదిరిగారు.
11,874 మంది ఓటు వినియోగం: జిల్లావ్యాప్తంగా శని, ఆదివారాల్లో మొత్తం 11,874 మంది ఉద్యోగులు ఓటు హక్కు వినియోగించుకున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని