logo

బటన్‌ నొక్కుడు.. వట్టిదేనా జగన్‌?

‘మహిళల సంక్షేమమే నా లక్ష్యం.. అతివల ఆర్థిక స్వావలంబనే నా ధ్యేయం’ అంటూ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి తరచూ వేదికలపై ఉపన్యాసాలు ఇస్తుంటారు. అమలు చేసే విషయంలో మాత్రం ఆయనకు చిత్తశుద్ధి కొరవడింది. దీనికి నిదర్శనమే వైఎస్సార్‌ ఈబీసీ నేస్తం పథకం. అగ్రవర్ణ పేద మహిళలకు ఆర్థిక సహాయం అందించేందుకు దీన్ని అమల్లోకి తీసుకొచ్చారు.

Updated : 06 May 2024 06:48 IST

ఖాతాల్లో పడని మూడో విడత ఈబీసీ నేస్తం నగదు
ఏలూరు వన్‌టౌన్‌, కలిదిండి,  వీరవాసరం, ఉంగుటూరు, న్యూస్‌టుడే

‘మహిళల సంక్షేమమే నా లక్ష్యం.. అతివల ఆర్థిక స్వావలంబనే నా ధ్యేయం’ అంటూ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి తరచూ వేదికలపై ఉపన్యాసాలు ఇస్తుంటారు. అమలు చేసే విషయంలో మాత్రం ఆయనకు చిత్తశుద్ధి కొరవడింది. దీనికి నిదర్శనమే వైఎస్సార్‌ ఈబీసీ నేస్తం పథకం. అగ్రవర్ణ పేద మహిళలకు ఆర్థిక సహాయం అందించేందుకు దీన్ని అమల్లోకి తీసుకొచ్చారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కాలమానిని సైతం విడుదల చేసింది. లబ్ధిదారులకు మూడేళ్లపాటు ఈ పథకాన్ని అమలు చేస్తామని ప్రకటించిన వైకాపా సర్కారు చివరి విడతను మాత్రం గాలికొదిలేసింది.

ఉంగుటూరు మండలం నారాయణపురం గ్రామానికి చెందిన నాగమణి, సత్యవతులు ఈబీసీ నేస్తం పథకం లబ్ధిదారులు. వీరికి మూడో విడతకు సంబంధించి ముఖ్యమంత్రి జగన్‌ బటన్‌ నొక్కి 51 రోజులు గడిచినా ఇంత వరకు నగదు జమ కాకపోవడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంక్షేమం, అభివృద్ధిపై సీఎం పేరిట గత మార్చిలో వాలంటీర్లు పంపిణీ చేసిన లేఖలో మూడు విడతలుగా రూ.45 వేలు లబ్ధి పొందినట్లు ప్రచురించారని, ఇది ఎంత వరకు సబబు అని వారు ప్రశ్నిస్తున్నారు.

లబ్ధదారుల ఎంపికలో కోతలు..

ఈ పథకంలో లబ్ధిదారుల సంఖ్య తగ్గించేందుకు ప్రభుత్వం ఎత్తుగడ వేసింది. ఏలూరు జిల్లాలో రెండో విడతలో 14,274 మంది లబ్ధిదారులు ఎంపిక చేస్తే.. మూడో విడతలో 12,660 మందిని మాత్రమే అర్హులుగా గుర్తించారు. 1614  మంది లబ్ధిదారులకు కోత పడింది. 300 యూనిట్ల విద్యుత్తు వినియోగంతోపాటు ఇతర కారణాలు చూపించి ఎంతో మందికి కొర్రీలు వేసి లబ్ధిదారుల సంఖ్య తగ్గించేశారు.

పథకం అమలు ఇలా..

ఈ బీసీ నేస్తం పథకానికి 45 నుంచి 60 ఏళ్ల వయసున్న కమ్మ, రెడి,్డ ఆర్యవైశ్య, బ్రాహ్మణ, క్షత్రియ, వెలమలతోపాటు ఇతర ఓసీ సామాజిక వర్గాలకు చెందిన అగ్రవర్ణ పేద మహిళలు అర్హులు. ఒక్కొక్కరికి ఏటా రూ.15 వేల చొప్పున మూడేళ్లలో రూ.45 వేలు ఖాతాల్లోకి జమ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. 2021-22లో ఉమ్మడి జిల్లాలో మొదటి విడతగా మొత్తం రూ.24,941 మంది ఖాతాల్లో రూ.37.41 కోట్లు జమ చేశారు. రెండో ఏడాది 2022-23లో జిల్లాలో 28,849 మంది మహిళలను అర్హులుగా గుర్తించారు. సంక్షేమ క్యాలెండర్‌లో ప్రకటించినట్లుగా గతేడాది నవంబరులో వారి ఖాతాల్లో జమ చేయాల్సి ఉండగా.. ఎప్పటికో ఈ ప్రక్రియ పూర్తిచేశారు.

చివర విడత ఏదీ?

మూడో విడతకు సంబంధించి గత నెల 14న మహిళల ఖాతాల్లోకి నగదు జమ చేస్తున్నామని ముఖ్యమంత్రి జగన్‌ ఎంతో ఆర్భాటంగా బటన్‌ నొక్కారు. ఇప్పటి వరకు ఆ డబ్బుల జాడ కనిపించడం లేదు. దాదాపు నెల రోజులు గడిచిపోతున్నా నేటికీ ఖాతాల్లోకి జమకాకపోవడంతో లబ్ధిదారులు బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.


కాళ్లరిగేలా తిరిగా..

మహిళల సాధికారతకు పాటుపడుతున్నామని వైకాపా చెప్పే మాటలు వాస్తవానికి దూరంగా ఉన్నాయి. రోజు కష్టపడి పని చేసి జీవనం సాగించే నాకు ఈబీసీ నేస్తం పథకం ద్వారా అందించే ఆర్థికసాయంతో కాస్త ఉపశమనం లభిస్తుందని ఆశ పడ్డా. ఇందుకోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా. ఇదిగో.. అదిగో అంటూ అధికారులు నెలలు నెట్టుకొచ్చేశారని మండవల్లి గ్రామానికి చెందిన పి.లక్ష్మి ఆవేదన చెందుతున్నారు.


పెట్టుబడికి సాయపడుతుందనుకున్నా

‘నా కుటుంబం వీరవాసరంలో చిల్లర దుకాణం నిర్వహిస్తోంది. 2022 చివర్లో ఈబీసీ నేస్తం కింద ప్రభుత్వం నాకు రూ.15 వేలు మంజూరు చేసింది. మూడో విడత నిధుల కోసం అయిదు నెలలుగా ఎదురు చూస్తున్నా. పథకం నగదుతో వ్యాపారం పెంచుకోవాలనుకున్నా. ఇప్పటికీ జమ కాలేదు.’ అని గ్రంథి పుష్పకుమారి తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని