logo

జాగాలపై జగన్‌ మూకలు.. అయిదేళ్ల వైకాపా పాలనలో ఊరూరా ఆక్రమణలపర్వం

‘జాగా కనిపిస్తే..పాగా వేసేయడమే’ అన్నట్లు జగన్‌ అనుచరగణం ఊరూరా చెలరేగిపోయింది. అయిదేళ్ల జమానాలో మమ్మల్ని ఎవర్రా ఆపేది అన్నట్లు ఆక్రమణల పర్వం సాగింది. ప్రజల సామూహిక అవసరాలకు వినియోగించాల్సిన స్థలాలు వైకాపా నేతల కబంధ హస్తాల్లోకి వెళ్లిపోయాయి.

Published : 06 May 2024 05:31 IST

స్థలాలు కనిపిస్తే గెద్దల్లా వాలిపోతున్న వైనం
కాలువగట్లు, శ్మశానాలూ కబ్జా చెరలోకి..
ఈనాడు, భీమవరం, న్యూస్‌టుడే బృందం

‘జాగా కనిపిస్తే..పాగా వేసేయడమే’ అన్నట్లు జగన్‌ అనుచరగణం ఊరూరా చెలరేగిపోయింది. అయిదేళ్ల జమానాలో మమ్మల్ని ఎవర్రా ఆపేది అన్నట్లు ఆక్రమణల పర్వం సాగింది. ప్రజల సామూహిక అవసరాలకు వినియోగించాల్సిన స్థలాలు వైకాపా నేతల కబంధ హస్తాల్లోకి వెళ్లిపోయాయి.

దెందులూరు మండలం కొవ్వలిలో కొత్త సచివాలయం ఎదురుగా ఉన్న భూములను వైకాపా అనుచరులు ఆక్రమించారు. వ్యాపారాలు చేసుకుంటున్నారు. గ్రామస్థులు స్పందనలో ఫిర్యాదు చేసినా అధికారులు చర్యలు తీసుకోలేదు. ఓ వైకాపా నేత అధికారులపై ఒత్తిడి చేయడంతో వారు చర్యలకు ఉపక్రమించడం లేదు.

ప్రభుత్వ స్థలంపై కన్ను పడితే ముందు చదును చేసి..మెరక చేస్తారు. చిన్న దుకాణం..లేదా దేవుడు విగ్రహం పెట్టేస్తారు.. అదే దన్నుగా కొద్ది రోజులకు శాశ్వత నిర్మాణాలు చేపడతారు. ఉమ్మడి జిల్లాలో జలవనరులు, పంచాయతీ, పుర, నగరపాలిక, దేవాదాయ భూములన్న తేడా లేకుండా ఇలా కబ్జా చేశారు. ఇంత జరుగుతున్నా అధికారులు ఉత్సవ విగ్రహాల్లా చూస్తూ ఉండిపోయారు.

కాకి లెక్కలతో సరి..

వైకాపా అయిదేళ్ల పాలనలో ఆక్రమణలు పెరిగి పోయాయి. అధికారులు జిల్లాలో 4 వేల ఆక్రమణలు ఉన్నాయని కాకి లెక్కలు వేస్తున్నా..నిజానికి ఏలూరు పరిధిలోనే 4వేలకు పైగా ఉన్నాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా జలవనరులు పంచాయతీ, దేవాదాయ, నగర, పురపాలిక, ఆర్‌అండ్‌బీ తదితర శాఖల్లో దాదాపు లక్షకు పైగా ఆక్రమణలు ఉన్నాయి. ఇందులో వైకాపా పాలనలోనే దాదాపు 50వేల వరకు కొత్త ఆక్రమణలు జరిగాయని తెలుస్తోంది.

భవిష్యత్తుకు  భరోసా లేకుండా చేశారు

భవిష్యత్తులో కాలువలు, రహదారుల విస్తరణ, ప్రజా సేవలను పెంపొందించేందుకు ప్రభుత్వ భవనాల నిర్మాణం వంటి అవసరాల కోసం ప్రతి శాఖలో అదనపు భూములంటాయి. వాటిని అధికారులు పట్టించుకోకపోవటంతో నాయకుల అండతో వారి అనుచరులు ఆక్రమిస్తున్నారు. దీంతో భవిష్యత్తు అవసరాలకు ఇబ్బందులు పడుతున్నాం. ప్రైవేటు భూమి కొనుగోలు చేయాల్సిన పరిస్థితులు వస్తున్నాయి. ఉమ్మడి జిల్లాలో జగనన్న ఇళ్ల స్థలాల కోసం 932 ఎకరాల ప్రైవేటు స్థలాన్ని రూ.1.34 లక్షల కోట్లతో కొనుగోలు చేశారు. ఉన్న ప్రభుత్వ స్థలాలను కాపాడుకుంటే కొంతమేర ఖర్చు తగ్గేది.

జిల్లాలో ఒక్క దేవాదాయ శాఖలోనే దాదాపు వెయ్యి ఎకరాల వరకు పొలాలు, స్థలాలు ఆక్రమణల్లో ఉన్నాయి. వైకాపా నాయకులు వాటిలో వ్యాపార సమూహాలు, నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. గ్రామంలో ఖాళీగా ఉన్న స్థలాలను వారు ఆక్రమించగానే ఎక్కడన్నా అడ్డుకొనేందుకు అధికారులు వెళ్తే... ‘మా పార్టీ వాళ్లే వదిలేయండి’ అంటూ ప్రజాప్రతినిధులు ఫోన్లో హుకుం జారీ చేస్తారు. ఇల్లు లేని పేదలు చిన్న గుడిసె వేసుకుంటే ముందస్తు సమాచారం లేకుండా అధికారులు రాత్రికిరాత్రే కూల్చేస్తారు. వైకాపా నాయకులు వందల ఎకరాలు ఆక్రమించుకుని శాశ్వత నిర్మాణాలు చేపట్టినా పట్టించుకోరు.


ముసునూరు మండలం రమణక్కపేట పంచాయతీ భూమిని స్థానిక వైకాపా నేత ఆక్రమించుకున్నారు. ప్రభుత్వ అవసరాల కోసం దాతలు ఇచ్చిన 2 సెంట్ల భూమిలో దుకాణ నిర్మాణం చేపట్టారు. అదే గ్రామంలో రూ.1.5 కోట్ల విలువైన 3 ఎకరాల శ్మశాన స్థలాన్ని వైకాపా నాయకులు  ఆక్రమించి కోళ్లఫారాలు, దుకాణాలు కూడా ఏర్పాటు  చేసుకున్నారు.


పాలకొల్లు పట్ణణంలో దిగమర్రు ఛానల్‌కు ఆనుకుని ఉన్న జలవనరుల శాఖ స్థలం కబ్జా కోరల్లో చిక్కుకుంది. వైకాపా నేతల అండతో వారి అనుచరులు కాలువలో మట్టి పోసి మరీ అక్కడ ఈ కట్టడం నిర్మిస్తున్నారు. అధికారుల కళ్ల ముందే ఇదంతా సాగుతున్నా పట్టించుకున్న పాపాన పోలేదు. ఇలా కాలువ పొడవునా ఆక్రమణలు పెరిగితే భవిష్యత్తులో కాలువలు విస్తరించాలంటే కష్టమే.


పెనుగొండ మండలం సిద్ధాంతం అయ్యప్పస్వామి గుడి సమీపంలో ఉన్న రూ.కోట్ల విలువైన 10 సెంట్ల పంచాయతీ స్థలం ఆక్రమణ చెరలోకి వెళ్లింది. స్థానిక వైకాపా నేత అంతా నా ఇష్టం అన్నట్లు రాత్రికిరాత్రే ప్రభుత్వ భవనాలు కూల్చి భక్తి సాకుతో సరస్వతి విగ్రహం, మరుగుదొడ్లు, భోజనశాల పేరుతో రేకుల షెడ్లు ఏర్పాటు చేశారు. ఇంత జరుగుతున్నా అధికారులు కనీస చర్యలకు ఉపక్రమించలేదు.


కుడిగట్టు కొల్లగొట్టారు

పెదవేగి మండలం జానంపేటలో కుడికాలువ గట్టును ఆక్రమించి వైకాపానేతలు ఏర్పాటు చేసిన కోళ్లఫారాలు

పోలవరం కుడికాలువ ఉన్న పోలవరం, కొయ్యలగూడెం, ఉంగుటూరు, భీమడోలు, దెందులూరు, పెదవేగి మండలాల్లో గట్టు పొడవునా ఆక్రమణలే దర్శనమిస్తాయి. పెదవేగి మండలం జగన్నాథపురం, లక్ష్మీపురంలో ఆయిల్‌పాం, జీడి, కొబ్బరి తోటలు, వరి సాగు చేస్తున్నారు. భీమడోలు మండలం పోలసానిపల్లిలో ఆయిల్‌పామ్‌ తోటలు వేశారు. పెదవేగి మండలం జానంపేట సమీపంలో ఓ వైకాపా నేత అనుచరుడు షెడ్లు వేసి కోళ్లఫారాలు నిర్మించారు. ఇదంతా బహిరంగంగా సాగుతున్నా జలవనరుల శాఖ అధికారులు ఒక్క ఆక్రమణనూ తొలగించలేదు. కారణం  ఆక్రమణదారులంతా వైకాపా వర్గీయులు కావడమే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని