logo

పగలు దేదీప్యం... రాత్రి అంధకారం!

వైయస్‌ఆర్‌ జిల్లాలో 557 గ్రామపంచాయతీలున్నాయి. పరిపాలన వికేంద్రీకరణలో భాగంగా 427 గ్రామ సచివాలయాలను ప్రారంభించారు. గ్రామాల్లో గత ప్రభుత్వ పాలనలో అధిక కాంతినిచ్చే 1,03,575 ఎల్‌ఈడీ దీపాలు అమర్చారు. ఇందుకోసం సుమారు రూ.17.50 కోట్లు ఖర్చు చేశారు. అన్నమయ్య

Updated : 02 Jul 2022 07:26 IST

ఇదీ గ్రామాల్లో ఎల్‌ఈడీ దీపాల నిర్వహణ తీరు

గ్రామ పంచాయతీలను వేధిస్తున్న నిధుల కొరత

పగలే వెలుగు జిలుగులు

న్యూస్‌టుడే, కడప, బృందం

గాలివీడులో

‘గ్రామీణ ప్రాంతాల్లో రాత్రివేళ కమ్ముకున్న కారుచీకట్లు తొలగించాలి. అంధకారం లేకుండా  కాంతులు పంచాలి. వీధివీధినా వెలుగుదివ్వెలు ప్రకాశించాలి.’ ఇదే స్ఫూర్తితో అయిదేళ్ల కిందట అప్పటి రాష్ట్రప్రభుత్వం ముందడుగు వేసింది. ఉన్నత స్థాయి అనుమతి తీసుకుని జిల్లా అధికారులు రంగంలోకి దిగారు. పల్లెల్లో ఇంధన సామర్థ్య సేవల సంస్థ (ఈఈఎస్‌ఎల్‌), పునరుత్పాదక ఇంధన వనరుల సంస్థ (నెడ్‌క్యాప్‌) ఆధ్వర్యంలో అధునాతన ఎల్‌ఈడీ దీపాలు వేశారు. కొన్నాళ్లపాటు నిర్వహణ మెరుగ్గానే ఉండగా, అనంతరం వీటి బాధ్యతలను గ్రామపంచాయతీలకు అప్పగించారు. ప్రస్తుతం నిధుల కొరత వెంటాడుతోంది. కాసుల కష్టంతో నిర్వహణ భారమై పగలు వెలుగులు... రాత్రి చీకట్లు తప్పడంలేదు.

లింగాల ప్రధాన రహదారిపై...

వైయస్‌ఆర్‌ జిల్లాలో 557 గ్రామపంచాయతీలున్నాయి. పరిపాలన వికేంద్రీకరణలో భాగంగా 427 గ్రామ సచివాలయాలను ప్రారంభించారు. గ్రామాల్లో గత ప్రభుత్వ పాలనలో అధిక కాంతినిచ్చే 1,03,575 ఎల్‌ఈడీ దీపాలు అమర్చారు. ఇందుకోసం సుమారు రూ.17.50 కోట్లు ఖర్చు చేశారు. అన్నమయ్య జిల్లాలో 501 పంచాయతీలుండగా, 419 గ్రామసచివాలయాలు పనిచేస్తున్నాయి. జిల్లాలో 1.10 లక్షల వీధి దీపాలుండగా, ఇందుకోసం సుమారు రూ.18.75 కోట్లు వ్యయం చేశారు. దక్షిణ ప్రాంత విద్యుత్తు పంపిణీ సంస్థ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా మూడో తీగ ఏర్పాటు చేసి అనుసంధానం చేయాలని అప్పట్లో నిర్ణయించారు. ఎంసీబీ సీసీఎం జంక్షన్‌ పెట్టెలను ఏర్పాటు చేసి రిమోట్‌ వ్యవస్థతో దీపాలు పనిచేసేవిధంగా సాంకేతిక వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చారు. సాయంత్రం చీకటి పడగానే వెలిగేలా, ఉదయం తెల్లారిన వెంటనే ఆగిపోయేలా సమయసారిణి (టైమర్‌) అమలయ్యేవిధంగా ఏర్పాట్లు చేశారు. ఈఈఎస్‌ఎల్‌, నెడ్‌క్యాప్‌ సంయుక్త పర్యవేక్షణలో పదేళ్లపాటు నిర్వహణ బాధ్యతలను అప్పగించారు. పల్లె వీధులు ప్రకాశించేవిధంగా నివాసం ఉంటున్న కుటుంబాలు, జనాభాను పరిగణనలోకి తీసుకొని 24, 32, 75 వాట్ల సామర్థ్యం ఉన్న దీపాలను ఏర్పాటు చేశారు. 24 వాట్ల సామర్థ్యం ఉన్న ఒక దీపం ధర రూ.1,650. కాగా, ఒక్కొక్క పంచాయతీలో మూడు నెలలకొకసారి రూ.150 చెల్లించాలని అప్పట్లో నిర్ణయించారు. ఇందుకోసం 14వ ఆర్థిక సంఘం నిధులను సర్దుబాటు చేశారు. సాంకేతిక లోపాలతో క్షేత్రస్థాయిలో ఈ విధానం సమర్థంగా పనిచేయడం లేదు. రాత్రి కాకుండా పగటి పూట కాంతులు పంచుతూ వెలగడంతో ఒత్తిడితో కాలిపోతూ.. పేలిపోతూ చీకట్లు కమ్మేస్తున్నాయి.

సుండుపల్లిలో... 

సమన్వయ లోపమే శాపం

గ్రామాల్లో ఏర్పాటు చేసిన ఎల్‌ఈడీ దీపాల నిర్వహణను ఇంధన సామర్థ్యం సేవల సంస్థ (ఈఈఎస్‌ఎల్‌), పునరుత్పాదక ఇంధన వనరుల సంస్థ (నెడ్‌క్యాప్‌) పరిధిలో ఉన్న పర్యవేక్షణ బాధ్యతలను పంచాయతీలకు అప్పగిస్తూ 2020, డిసెంబరు 27న రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అనంతరం క్షేత్రస్థాయిలో అమలు విధి విధానాలను ఖరారు చేశారు. నిరుడు మార్చి 3న పంచాయతీరాజ్‌ శాఖ ఉన్నతాధికారులు మరో ఉత్తర్వు ఇచ్చారు. ‘జగనన్న పల్లె వెలుగు’గా నామకరణం చేశారు. గ్రామ సచివాలయం, పంచాయతీ కార్యదర్శులు ఎల్‌ఈడీ దీపాల పనితీరును పర్యవేక్షించాలని ఆదేశించారు. క్షేత్ర, మండల, డివిజన్‌, జిల్లా స్థాయి అధికారుల మధ్య సమన్వయలోపం గ్రామీణులకు శాపంగా మారింది. సాంకేతిక లోపంతో ఎక్కడైనా వెలగకపోతే సకాలంలో మరమ్మతులు చేయడం లేదు. ఇందుకు కాసుల కష్టం ప్రధాన కారణమని అధికారుల నోట వినిపిస్తోంది. గతేడాది వచ్చిన 15వ ఆర్థిక సంఘం నిధులను వెనక్కి లాగేసుకున్నారు. ఇక సాధారణ (జనరల్‌) పద్దు కొన్నింట్లోనే ఉంది. మిగతా వాటికి నిధుల సమస్య వెంటాడుతోంది. అన్ని గ్రామ సచివాలయాల్లో ఇంధన సహాయకులు లేరు. ఖాళీ పోస్టులను భర్తీ చేయడంలో జాప్యం జరుగుతుండడంతో పర్యవేక్షణకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. మరమ్మతులు చేయడానికి ప్రత్యేక యంత్రాంగం, వ్యవస్థ లేదు. కొన్నిచోట్ల ఆయా ప్రాంతాల్లో సర్పంచులు చొరవ తీసుకొని తాత్కాలికంగా బాగుచేయిస్తున్నారు.

 రాజంపేట: మదనగోపాలపురం చక్రధర్‌ కాలనీలో...

పొదుపు చర్యలేవీ?

విద్యుత్తు వినియోగం క్రమేణా పెరుగుతూ వస్తోంది. మరోవైపు డిమాండుకు తగ్గ ఉత్పత్తి లేదు. సరఫరా-వాడకం మధ్య అంతరం ఏర్పడుతోంది. లోటు ఉండటంతో కరెంటు కోతలు అమలు చేస్తున్నారు. వ్యవసాయానికి నిరంతరం 9 గంటలు ఇస్తామని ఘనంగా ప్రకటించినా ఏడు గంటలు ఇవ్వడం గగనమైంది. పైగా రెండు విడతల్లో ఇస్తున్నారు. మరోవైపు గ్రామాల్లో వీధి దీపాలు కొన్నిచోట్ల నిరంతరాయం అంటే 24 గంటలు వెలుగుతూనే ఉన్నాయి.  పంచాయతీల నుంచి వీధి దీపాలకు విద్యుత్తు వినియోగించారని బిల్లులు వసూలు చేస్తున్నారు. మీటర్లు పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయకపోవడంతో ఎస్పీడీసీఎల్‌ సంస్థ తీవ్రంగా నష్టపోతోంది.

నందలూరు సెయింట్‌ జోసఫ్‌ పాఠశాల ఆవరణలో...


రాత్రిళ్లు చీకట్లు ఇలా...

ఒంటిమిట్ట మండలం కొత్తమాధవరంలో...

జమ్మలమడుగు మండలం అంబవరంలో...


నిరంతరం పర్యవేక్షిస్తున్నాం

గ్రామాల్లో ఎల్‌ఈడీ దీపాల పనితీరును నిరంతరం పర్యవేక్షిస్తున్నాం. కొన్నిచోట్ల 24 గంటలూ వెలుగుతున్నట్లు మా దృష్టికి వచ్చింది. అక్కడ స్విచ్‌లు ఏర్పాటు చేయాలని పంచాయతీ/గ్రామ సచివాలయం కార్యదర్శులను ఆదేశించాం. ఎక్కడైతే పనిచేయలేదో వెంటనే గుర్తించి మరమ్మతులు చేయించి తిరిగి అమర్చాలని ఉత్తర్వులిచ్చాం.

- నాగరాజు, డీపీవో, అన్నమయ్య జిల్లా


త్వరలో పరిష్కరిస్తాం

గ్రామాల్లో కొన్నిచోట్ల ఎల్‌ఈడీ దీపాలకు స్విచ్‌లు లేకపోవడంతో నిరంతరం వెలుగుతున్నట్లు మా దృష్టికి వచ్చింది. మూడో తీగ ఏర్పాటు చేయకపోవడంతో సమస్య తలెత్తింది. త్వరలో 15వ ఆర్థిక సంఘం నిధులు విడుదల కానున్నాయి. ప్రతి దీపానికి ఒక స్విచ్‌ ఏర్పాటు చేయాలని కార్యదర్శులను ఆదేశించాం. ఎక్కడైనా పనిచేయని దీపాలుంటే వెంటనే మరమ్మతులు చేయిస్తాం.

- మస్తాన్‌వలీ, డివిజన్‌ పంచాయతీ అధికారి, కడప


 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని