logo

ఒక్క అవకాశమిస్తే అభివృద్ధి చేసి చూపిస్తాం

మాకు ఒక్క అవకాశమిస్తే అభివృద్ధి చేసి చూపిస్తామని ఎన్డీఏ రాజంపేట ఎంపీ అభ్యర్థి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి, రాయచోటి ఎమ్మెల్యే అభ్యర్థి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి పేర్కొన్నారు

Published : 25 Apr 2024 06:33 IST

నామపత్రాలు సమర్పించిన నల్లారి, మండిపల్లి

భారీ ర్యాలీగా తరలి వచ్చిన ఎన్‌డీఏ శ్రేణులు

  నామినేషన్‌ దాఖలు చేస్తున్న నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి

 రాయచోటి, న్యూస్‌టుడే: మాకు ఒక్క అవకాశమిస్తే అభివృద్ధి చేసి చూపిస్తామని ఎన్డీఏ రాజంపేట ఎంపీ అభ్యర్థి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి, రాయచోటి ఎమ్మెల్యే అభ్యర్థి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి పేర్కొన్నారు. వీరు బుధవారం అట్టహాసంగా నామిసేషన్లు దాఖలు చేశారు. కార్యక్రమానికి జిల్లాలోని వివిధ నియోజకవర్గాల నుంచి భారీ సంఖ్యలో తెదేపా, భాజపా, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చారు. రాయచోటి ఎస్‌ఎన్‌ కాలనీలోని తెదేపా కార్యాలయం నుంచి ప్రత్యేక వాహనంపై మదనపల్లె రోడ్డు, కొత్తపేట, ఆర్టీసీ బస్టాండు కూడలి, నేతాజీ కూడలి వరకు భారీ ర్యాలీగా తరలి వచ్చారు. ఉదయం 11 గంటలకు నల్లారి అట్టహాసంగా నామినేషన్‌ దాఖలు చేయగా, మండిపల్లి మూడో సెట్‌ నామపత్రాలు దాఖలు చేశారు. కార్యక్రమానికి వచ్చిన మాజీ ఎమ్మెల్సీ బత్యాల చెంగల్రాయుడిని డీఎస్పీలు, మహబూబ్‌బాషా, శ్రీధర్‌లు అనుమతి లేదంటూ అడ్డగించారు. అక్కడి నుంచి ఆయన వెనుతిరిగి వెళ్లిపోతుండగా భాజపా నాయకుడు నాగోతు రమేష్‌నాయుడు తీసుకెళ్లి కారులో కూర్చోబెట్టారు. నామినేషన్‌ అనంతరం కిరణ్‌కుమార్‌రెడ్డిని కలిసి చర్చించి వెళ్లిపోయారు. మదనపల్లె రోడ్డులోని కొత్తపేట రోడ్డు కూడలిలో నల్లారి మాట్లాడుతూ రాష్ట్రంలో ఇసుక, మట్టి, భూ మాఫియాలు రాజ్యమేలుతున్నాయని ధ్వజ మెత్తారు. రానున్న ఎన్నికల్లో రెండే మార్గాలున్నాయని, కేంద్రంలో ప్రధానిగా నరేంద్రమోదీ, రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడిని గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రజలపై ఉందన్నారు. ప్రజలందరూ  విజ్ఞతతో ఆలోచించి ఓటేయాలని పిలుపునిచ్చారు. రాజంపేట పార్లమెంటు పరిధిలోని ఓటర్లు రాజంపేట పార్లమెంట్‌ స్థానానికి కమలం గుర్తుకు, రాయచోటి అసెంబ్లీ స్థానానికి సైకిల్‌ గుర్తుకు ఓటేయాలని అభ్యర్థించారు. కార్యక్రమంలో తెదేపా పీలేరు, మదనపల్లె నియోజకవర్గాల అభ్యర్థులు నల్లారి కిశోర్‌కుమార్‌రెడ్డి, షాజహాన్‌బాషా, జనసేన, భాజపా, తెదేపా నాయకులు రాందాస్‌చౌదరి, బాబురెడ్డి, రామచంద్రయ్య, విశ్వనాథనాయుడు, సాయిలోకేశ్‌, నాగోతు రమేష్‌నాయుడు, మైనార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని