logo

అక్రమాలకు పాల్పడకుండా గెలిచే సత్తా మీకుందా?

అక్రమాలకు పాల్పడకుండా పులివెందులలో గెలిచే సత్తా మీకుందా? అని తెదేపా పులివెందుల నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి బీటెక్‌ రవి సీఎం జగన్‌కు సవాల్‌ విసిరారు

Updated : 25 Apr 2024 06:58 IST

సీఎం జగన్‌కు తెదేపా పులివెందుల ఎమ్మెల్యే అభ్యర్థి బీటెక్‌ రవి సూటి ప్రశ్న

 ఆర్వో వెంకటేశులుకు నామపత్రాలు అందిస్తున్న బీటెక్‌ రవి

పులివెందుల, న్యూస్‌టుడే : అక్రమాలకు పాల్పడకుండా పులివెందులలో గెలిచే సత్తా మీకుందా? అని తెదేపా పులివెందుల నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి బీటెక్‌ రవి సీఎం జగన్‌కు సవాల్‌ విసిరారు. పులివెందులలో బుధవారం ఆయన తన సోదరుడు జోగిరెడ్డి, భాజపా జిల్లా ఉపాధ్యక్షురాలు సుష్మ, న్యాయవాది రామకృష్ణారెడ్డి, కార్యకర్తలతో కలిసి ఆర్డీవో వెంకటేసులకు నామ పత్రాలు అందించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. పులివెందులలో జగన్‌ పతనానికి అంకురార్పణ జరిగిందన్నారు. రానున్న ఎన్నికల్లో అక్రమాలకు స్వస్తి పలికి స్వేచ్ఛాయుతంగా ఎన్నికలు జరిపించి గెలవగలిగే దమ్ము మీకుందా అని ప్రశ్నించారు. ప్రజలంతా స్వచ్ఛందంగా తమకు మద్దతిస్తున్నార]న్నారు. ఐదేళ్లలో పులివెందులలో ఒక్క ఎకరాకు కూడా అదనంగా సాగునీరు ఇవ్వలేదన్నారు. రైతులకు డ్రిప్పు పరికరాలు, పంటల బీమా పరిహారం ఇచ్చిన దాఖలాల్లేవని ఆవేదన వ్యక్తం చేశారు.

వివేకా హత్య, రైతులకు చేసిన అన్యాయం.. ఇలాంటి విషయాలపై ప్రజలు తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారని, ఎన్నికల్లో జగన్‌కు సరైన రీతిలో బుద్ధి చెబుతారన్నారు. తెదేపా కడప ఎంపీ అభ్యర్థి భూపేష్‌రెడ్డి మాట్లాడుతూ.. వివేకా హత్యకేసుకు సంబంధించి తన చిన్నాన్న ఆదినారాయణరెడ్డి, పులివెందుల అభ్యర్థి బీటెక్‌ రవిపై అప్పట్లో నిందారోపణలు చేశారన్నారు. ఐదేళ్ల తర్వాత ఈ కేసులో పాత్రధారులెవరో, సూత్రధారులెవరో ప్రజలందరికీ తెలిసిపోయిందన్నారు. ఎంపీ అవినాష్‌రెడ్డి సొంత పార్టీ కార్యకర్తలకు, ప్రజలకు అందుబాటులో లేరని కేవలం తన వద్దనున్న డబ్బుతో కార్యకర్తలను కొంటున్నారన్నారు. ప్రజలు తనకు, ఎమ్మెల్యే అభ్యర్థి బీటెక్‌ రవికి ఓట్లు వేసి గెలిపించాలని కోరారు.

పులివెందులలో తెదేపా భారీ ర్యాలీ

పులివెందులలో తెదేపా భారీ ర్యాలీ నిర్వహించింది. తెదేపా అభ్యర్థి బీటెక్‌ రవి, ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంభూపాల్‌రెడ్డి, తదితరులు పార్టీ కార్యాలయం నుంచి ర్యాలీగా బయలుదేరారు. పార్నపల్లి రింగురోడ్డు, పూలంగళ్లు, వెంకటేశ్వరస్వామి ఆలయం, ఆర్టీసీ బస్టాండ్‌ పాతరోడ్డు మీదుగా మినీ సెక్రటేరియట్‌ వరకు ర్యాలీ కొనసాగింది. బీటెక్‌రవి కారుపై నిల్చొని ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకుసాగారు. ర్యాలీలో నియోజకవర్గంలోని ఏడు మండలాల తెదేపా కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని