logo

ఝరికోన... ప్రగతి జరిగేనా?

సంబేపల్లె మండలం ఝరిదిన్నె వద్ద 2006లో నిర్మించిన ఝరికోన ప్రాజెక్టు ద్వారా రాయచోటి, రాజంపేట నియోజకవర్గాలకు సాగు, తాగునీరందించాల్సి ఉన్నా 15 ఏళ్లుగా చుక్క నీరందని పరిస్థితి నెలకొంది.

Published : 03 Jun 2023 02:33 IST

ఏళ్లుగా అంచనాల పెంపు 
నిధుల్లేక పడకేసిన పనులు
న్యూస్‌టుడే, రాయచోటి, సంబేపల్లె

సంబేపల్లె మండలం ఝరిదిన్నె వద్ద 2006లో నిర్మించిన ఝరికోన ప్రాజెక్టు ద్వారా రాయచోటి, రాజంపేట నియోజకవర్గాలకు సాగు, తాగునీరందించాల్సి ఉన్నా 15 ఏళ్లుగా చుక్క నీరందని పరిస్థితి నెలకొంది. ఎన్నికలొచ్చినప్పుడల్లా రైతులను ఊరడించే మాటలు చెబుతున్న ప్రజాప్రతినిధులు కాలువల నిర్మాణంపై దృష్టి సారించకపోవడంతో పనుల పురోగతి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా తయారైంది.  

జిల్లాలో రాయచోటి, రాజంపేట నియోజకవర్గాలు అత్యంత కరవు పీడిత ప్రాంతాలు. 2005లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం ఈ ప్రాంతానికి సాగు, తాగునీటి ఇబ్బందులు తొలగించేందుకు అప్పట్లో రూ.39 కోట్లతో సంబేపల్లె, కె.వి.పల్లె, కలకడ మండలాల సరిహద్దులోని ఝరిదిన్నె వద్ద బాహుదా నదిపై ప్రాజెక్టు నిర్మించింది. ప్రాజెక్టుకు తొలుత తూము ప్రతిపాదన లేకపోవడంతో కట్టకు అలుగు ఏర్పాటు చేసి నిర్మాణం పూర్తిచేశారు. దిగువన ఉన్న సుండుపల్లి మండలంలోని బాహుదా నదీ పరివాహక ప్రాంతంలో నీరు పారకపోవడంతో తీవ్ర ఇబ్బందులు తలెత్తాయి. ఈ నేపథ్యంలో మండల రైతులు, బహుదా నది జలసాధన సమితి చేపట్టిన ఆందోళనలతో తూము ఏర్పాటు చేశారు. ప్రాజెక్టు నుంచి నీరు పంటపొలాలకు నింపాలంటే గ్రావిటీ ద్వారా వెళ్లే పరిస్థితి లేదు. ప్రాజెక్టు నుంచి ఎత్తిపోసి కాలువలకు నీరు సరఫరా చేయాల్సి ఉంది. ఎత్తిపోతల పథకంతోపాటు కాలువల నిర్మాణానికి తొలుత రూ.40 కోట్ల అంచనాలతో ప్రతిపాదనలు చేశారు. మూడేళ్లు గడిచినా నిధులు రాకపోవడంతో అవి కాస్త మూలన పడ్డాయి ఇటీవల.తాజాగా ఉన్నతాధికారులు పనులు చేపట్టేందుకు చర్యలు చేపట్టడంతో తాజాగా రూ.139 కోట్లతో అంచనాలు తయారు చేసి ప్రభుత్వానికి నివేదించారు. గత నాలుగేళ్లుగా నిరీక్షించినా నిధుల లేమితో పనులు సాగకపోగా, మరోవైపు అంచనాలలు పెంచుకుంటూపోతున్నారు. సంబేపల్లె, సుండుపల్లి మండలాల పరిధిలో సుమారు ఎటు వెళ్లినా పదిహేను కిలోమీటర్ల మేర కాలువల నిర్మాణం చేపట్టాల్సి ఉంది. కొన్ని ప్రాంతాల్లో ఇంకా భూసేకరణ పనులు పూర్తి చేయలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఎత్తిపోతల పథకం సిద్ధం కాకపోవడంతో ఏటా బాహుదాలో ప్రవహించే నీటితో ప్రాజెక్టు నిండుకుండలా ఉన్నా ఆయకట్టుకు సాగునీరందని దుస్థితి నెలకొంది.

గడువు సమీపిస్తున్నా...

సాగు, తాగునీరందించేందుకు ఉన్న జలవనరులను బాగుచేసి ప్రతి ఇంటికి తాగునీటి కుళాయి, ప్రతి ఎకరాకు సాగునీరందిస్తామని అధికార పార్టీ నేతలు ఎన్నికల సమయంలో వాగ్దానాలు చేశారు. కరపత్రాలు ముద్రించి మరీ ఎన్నికల్లో ప్రచారం సాగించారు. ప్రభుత్వం ఏర్పడితే నిధులొచ్చి సాగుకు నీరందుతుందని ఆశించిన రైతన్నలే కాకుండా తాగునీటితో ఇబ్బందులు పడుతున్న ప్రజలు నేతల మాటలు నమ్మారు. ఎన్నికల్లో అనుకూల ఫలితమిచ్చినా హామీలు అమలులో నేతలు విఫలమయ్యారు. ప్రభుత్వ పదవీ కాలం గడువు సమీపిస్తున్నా నేటికీ కాలువల నిర్మాణ పనులు అడుగు కూడా ముందుకు పడలేదు. గత  నాలుగేళ్లుగా సాగని పనులు ఏడాదిలో ఎలా సాధ్యమవుతాయంటూ రైతులు నిట్టూరుస్తున్నారు. ఇప్పటికే ప్రాజెక్టు ఉంచి సాగునీటి కాలువలు నిర్మించాలని తరచూ ఆందోళనలు, ఉద్యమాలు కొనసాగుతూనే ఉన్నాయి. రాయచోటి, రాజంపేట ఎమ్మెల్యేల పరిధిలో ప్రాజెక్టు ఉన్నప్పటికీ నిధులు సమీకరించేందుకు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురాలేకపోతున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రాజెక్టు నిర్మిత లక్ష్యం నెరవేరకపోగా, 2010-14 మధ్య కాలంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన కిరణ్‌కుమార్‌రెడ్డి మాత్రం ప్రాజెక్టు నుంచి తాగునీటిని ఆయన సొంత ప్రాంతమైన కలికిరి, కలకడ, కె.వి.పల్లె మండలాలకు పైపులైన్ల ద్వారా తీసుకెళ్లడంలో సఫలమయ్యారు. ఈ ప్రాంత నేతలు ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచి అసంపూర్తి పనులు చేపట్టకపోవడంపై తీవ్ర విమర్శలు ఎదురవుతున్నాయి. ఉన్నతాధికారులు చొరవ తీసుకొని కరవు పీడిత ప్రాంతంలో నిర్మించిన ఝరికోన ప్రాజెక్టు నుంచి సాగు, తాగునీరందించేందుకు అవసరమైన కాలువలు, ఎత్తిపోతల పథకం నిర్మాణం వెంటనే చేపట్టాలని కోరుతున్నారు. ఈ విషయమై నీటిపారుదలశాఖ బాధ్య ఎస్‌ఈ కృష్ణమూర్తి మాట్లాడుతూ ఝరికోన ప్రాజెక్టు ఎత్తిపోతల పథకానికి సంబంధించి తాజాగా అంచనాలు ప్రభుత్వానికి నివేధించామని, నిధులు రాగానే పనులు చేపడతామని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని