logo

జగనన్నా.. శంకుస్థాపనలేనా?

9 నెలలు... లెక్క ప్రకారం సార్వత్రిక ఎన్నికలకు ఉన్న సమయమిది! 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు వైకాపా నగరాభివృద్ధిపై ఇచ్చిన హామీలను పూర్తిస్థాయిలో నెరవేర్చడానికి ఉన్న సమయమింతే.

Updated : 10 Jul 2023 08:36 IST

పనులు పూర్తి చేసేదేమైనా ఉందా?
నిధులకు ఎదురు చూస్తున్న శిలాఫలకాలు
ఎన్నికల్లోపు పూర్తయ్యేది   ప్రశ్నార్థకమే
న్యూస్‌టుడే, కడప నగరపాలక

9 నెలలు... లెక్క ప్రకారం సార్వత్రిక ఎన్నికలకు ఉన్న సమయమిది! 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు వైకాపా నగరాభివృద్ధిపై ఇచ్చిన హామీలను పూర్తిస్థాయిలో నెరవేర్చడానికి ఉన్న సమయమింతే. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కడప నగర పర్యటనకు రావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. పునరుద్ధరణ పనులు పూర్తయిన రాజీవ్‌పార్కు - రాజీవ్‌ మార్గ్‌ల ప్రారంభోత్సవం, బ్రహ్మంసాగర్‌ జలాల పంపిణీ పనులకు శంకుస్థాపనతో సరిపెడతారా? లేక వైకాపా ఆవిర్భావం నుంచి ఇస్తున్న హామీల అమలుకు చర్యలు తీసుకుంటారా? లేక ఇప్పటికింతే అని సరిపెడతారా? అన్న అంశం కడప నగరంలో తీవ్ర చర్చనీయాంశం మారింది.

బుగ్గవంకకు ఇరువైపులా 40 అడుగుల రహదారి నిర్మాణం పనులను  2020లో ప్రారంభించారు. రూ.14.50 కోట్లతో చేపట్టిన ఈ పనులు ఇప్పటికీ ఓ కొలిక్కిరాలేదు. రోడ్డు నిర్మాణంలో భాగంగా యర్రముక్కపల్లి ప్రాంతంలో నివాస గృహాల పక్కన దాదాపు 10 అడుగుల లోతు ఆరు  అడుగుల వెడల్పుతో కాలువ నిర్మాణం కోసం భారీ గుంతలు తీశారు. కాలువ నిర్మాణం చేపట్టకపోవడంతో దాని పక్కనున్న నివాస గృహాల ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని జీవిస్తున్నారు.

సీపీ బ్రౌన్‌ గ్రంథాలయం భవన నిర్మాణాలకు 2021 జులై 9న సీఎం జగన్‌ శంకుస్థాపన చేశారు. దీని కోసం కేటాయించిన రూ.6 కోట్ల నిధులు ఇప్పటి వరకు విడుదల కాలేదు. నగరంలో వరద నీటి కాలువల నిర్మాణానికి రూ.69 కోట్ల విలువైన పనులకు ఇదే రోజున ఆయన శంకుస్థాపన చేశారు. ఆ పనుల ఊసే లేకుండా పోయింది.

రూ.250 కోట్ల నిధులతో మూడు కీలక రహదారుల విస్తరణకు కూడా శంకుస్థాపన చేయగా ఇప్పటికీ స్థల సేకరణ దశలోనే పనులు ఉన్నాయి. బండి కనుమపై ఆర్కిటెక్చర్‌ యూనివర్సిటీ భవన నిర్మాణాలు చేపట్టడానికి ఉత్తర్వులు కూడా జారీ చేసి తర్వాత రద్దు చేశారు. వైవీయూ వద్ద భవన నిర్మాణాలు చేపట్టాలని నిర్ణయించారు. దీనికి నిధులు ఎప్పుడు విడుదల చేస్తారు అన్న అంశం ప్రశ్నార్థకంగా మారింది.

రూ.72 కోట్ల వ్యయంతో చేపట్టిన భూగర్భ మురుగు పారుదల పనులు నిరర్థకంగా మారాయి. ఈ సమస్య పరిష్కారానికి ఏం చర్యలు తీసుకుంటారన్న అంశం ప్రశ్నార్థకంగా మారింది. దేవునికడప చెరువుకట్టను ట్యాంక్‌బండ్‌ తరహాలో అభివృద్ధి చేయడానికి రూ.55 కోట్లతో టెండర్లు ఖరారు చేసి సుమారు రెండేళ్లు దాటింది. ఇప్పటి వరకూ నిధులు విడుదల కాలేదు.

అమృత్‌ 2.0 కింద నగరంలో నీటి సరఫరాను మెరుగుపరచడానికి, చెరువులు ఆధునికీకరణ, జగనన్న కాలనీలు, టిడ్కో నివాసాలకు నీటి సరఫరా, భూగర్భ మురుగు నీటిపారుదల పనులకు రూ.350 కోట్లతో అనుమతులు వచ్చాయి. ఈ పనులు పట్టాలెక్కాలంటే రాష్ట్ర ప్రభుత్వం దాదాపు రూ.230 కోట్లు విడుదల చేయాలి.

2021లో రోడ్ల విస్తరణకు మంజూరు చేసిన నిధులు విడుదల చేయకుండానే ఆ నిధుల్లో రూ.55 కోట్ల మిగులు చూపారు. ఈ మొత్తంతో నగరపాలక కార్యాలయం నూతన భవన నిర్మాణానికి, బుగ్గవంకపై మరో రెండు వంతెనల ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇవన్నీ పూర్తి కావాలంటే ముఖ్యమంత్రి జగన్‌ కడపకు నిధులు విడుదల చేయించాలి.


ఈ నెల 10న కడపకు వస్తున్న ఆయన ఈ అంశంపై స్పష్టమైన హామీ ఇవ్వకపోతే ఈ పనులు ఇప్పటికింతే అని నగరవాసులు సరిపెట్టుకోక తప్పదు. ఈ పనులు చేసి ఎన్నికలకు వెళతారా..? లేక ఈ పనులు చేస్తామని మళ్లీ హామీ ఇస్తూ ఎన్నికలకు వెళతారా? అన్న అంశం ఆసక్తికరంగా మారింది.


మంచినీటి సమస్య శాశ్వత పరిష్కారానికి అమృత్‌ పథకం కింద బ్రహ్మంసాగర్‌ నుంచి 1.5 టీఎంసీల నీటిని కడపకు తీసుకు రావడానికి తగిన జీవో జారీ చేశారు. ఈ పనులకు రూ.570 కోట్లు వ్యయం అవుతుందని అంచనా వేశారు. ఈ పనులకు రాష్ట్ర ప్రభుత్వం వాటాగా దాదాపు రూ.350 కోట్లు కేటాయించాలి. నిధులు ఇస్తే బ్రహ్మంసాగర్‌ పనులు ముందుకు కదిలే అవకాశం ఉంటుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని