logo

దుకాణదారుడిని బెదిరించి.. అడ్డంగా దొరికిపోయిన పోలీసు అధికారి భార్య!

ఓ ప్రభుత్వ వాహనం.. దానిపై పోలీసు సైరన్‌.. వాహనంలో పోలీసు అధికారి భార్య.. ఆమెకు ఓ గన్‌మెన్‌ ఇలా వస్తే ఏమైనా చేయొచ్చనుకుని ఓ పోలీసు అధికారి భార్య అడ్డంగా దొరికిపోయారు. సాటి పోలీసు అధికారి భార్యే కదా అని పోలీసులు ఆమెకు కౌన్సెలింగ్‌ ఇచ్చి పంపించారు.

Updated : 27 Aug 2023 16:07 IST

కడప నేరవార్తలు, న్యూస్‌టుడే : ఓ ప్రభుత్వ వాహనం.. దానిపై పోలీసు సైరన్‌.. వాహనంలో పోలీసు అధికారి భార్య.. ఆమెకు ఓ గన్‌మెన్‌.. ఇలా వస్తే ఏమైనా చేయొచ్చనుకుని ఓ పోలీసు అధికారి భార్య అడ్డంగా దొరికిపోయారు. సాటి పోలీసు అధికారి భార్యే కదా అని పోలీసులు ఆమెకు కౌన్సెలింగ్‌ ఇచ్చి పంపించారు. వివరాలు.. కడప శివారులోని ఓ ప్రత్యేకమైన పోలీసు విభాగానికి చెందిన ఓ పోలీసు అధికారి భార్య కొంతకాలంగా కడప వైవీ స్ట్రీట్‌కు వచ్చి తాను పోలీసు అధికారి భార్యనంటూ వస్త్ర దుకాణాదారుడిని భయపెట్టి వస్త్రాలు తీసుకెళ్లేవారు.

శనివారం ఆమె గన్‌మెన్‌ను తీసుకుని వచ్చి వస్త్రాలు కొనుగోలు చేసి డబ్బులు ఇవ్వకుండా వెళ్లిపోతుండగా దుకాణ యజమాని అడ్డగించి ఇలా చేయడం సరికాదని తనకు నష్టం వస్తోందని వివరించారు. అయినా ఆమె వినలేదు. వెంటనే దుకాణదారుడు ఒకటో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వచ్చి ఆమెను ఠాణాకు తీసుకెళ్లారు. తొలుత ఆమె ఎవరని చెప్పలేదు, పోలీసులు అడగడంతో తాను పోలీసు అధికారి భార్య అని చెప్పడంతో కౌన్సెలింగ్‌ ఇచ్చి మరోసారి ఇలా చేయొద్దంటూ చెప్పి అక్కడి నుంచి పంపించారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఈ విషయంపై ‘న్యూస్‌టుడే’ ఒకటో పట్టణ పోలీసులను వివరణ కోరగా ఈ ఘటన వాస్తవమని ఆమెకు కౌన్సెలింగ్‌ ఇచ్చి పంపించామన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని