logo

జగనన్నా... ఇది మీ ఊరేనన్నా!

సీఎం జగన్‌ స్వగ్రామమంటే అహో.. ఓహో అనుకుంటే పప్పులో కాలేసినట్లే. పులివెందుల నియోజకవర్గం సింహాద్రిపురం మండలం బలపనూరు గ్రామమే ఆయనది.

Updated : 09 Mar 2024 06:04 IST

పది నెలలుగా పని చేయని నీటిశుద్ధి యూనిట్...

సీఎం జగన్‌ స్వగ్రామమంటే అహో.. ఓహో అనుకుంటే పప్పులో కాలేసినట్లే. పులివెందుల నియోజకవర్గం సింహాద్రిపురం మండలం బలపనూరు గ్రామమే ఆయనది. గ్రామంలో 1,359 కుటుంబాలు.. 5,119 మంది జనాభా, 3 వేల మంది ఓటర్లు ఉన్నారు. ఆ గ్రామంలో సీˆఎం నివాసం లేకున్నా పూర్వీకులందరూ పుట్టిపెరిగిన గ్రామం. ఇప్పటికీ వైఎస్‌ కుటుంబానికి చెందిన స్వగ్రామంగానే పిలుస్తారు. సీˆఎం స్వగ్రామమంటే అన్ని విధాలుగా అభివృద్ధి పథంలో ఉంటుందని, ఏ సమస్య ఉండదని అందరూ ఊహించుకోవచ్చు. ఆ పరిస్థితి ఏ మాత్రం అక్కడ కనిపించడంలేదు.

మురుగు కాలువ పక్కనే తాగునీటి పైపులైను

గ్రామంలో గుడికి.. బడికి మధ్య నిర్మించిన వైఎస్‌ఆర్‌ సుజల సురక్షిత తాగునీటి పథకం పది నెలలుగా పని చేయడంలేదు. దీని ముందు భాగంలో పారిశుద్ధ్యం అధ్వానంగా ఉంది. తాగునీటి పైపులైను మురుగు కాలువలోనే వెళుతోంది. మూడేళ్లకు ముందు నిర్మించిన తాగునీటి ట్యాంకు నిరుపయోగంగా ఉంది. బిల్లుల కోసమే ట్యాంకు నిర్మించినట్లు గ్రామస్థులు విమర్శిస్తున్నారు. జల జీవన్‌ మిషన్‌ కింద గ్రామంలో వైపులైను ఏర్పాటుకు వీధుల్లో తవ్వకాలు చేపట్టి అసంపూర్తిగా వదిలేశారు. తితిదే కల్యాణ మండపం నిర్మించి అర్భాటంగా ప్రారంభించినా ఒక్క వివాహం కూడా జరగనీయకుండా అధికార పార్టీ నాయకుడు తన వద్ద పని చేసే కూలీల ఆవాసంగా వాడుకుంటున్నారు. జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల ఉన్నా తాగునీటి సౌకర్యం లేదు.

తాగడానికి నీళ్లు లేవంటున్న బలపనూరు విద్యార్థులు

పాఠశాలలో మౌలిక సదుపాయాలు లేకపోగా, నిధుల్లేక భవనాలు అసంపూర్తిగా ఆగిపోయాయి. వీధులు ఇష్టారాజ్యంగా తవ్వేసి వదిలిపెట్టేశారు. ఇలాంటి సమస్యలతో సీˆఎం స్వగ్రామంలో ప్రజలు నిత్యం అగచాట్లు పడుతున్నారు. ఈ గ్రామం కంటే పక్కనున్నవి కాస్త నయంగా ఉన్నాయి. గ్రామానికైతే నిధులు వెచ్చించారు.. గానీ అభివృద్ధి మాత్రం కనుచూపు మేర కనిపించడంలేదు. అధికార పార్టీ నేతలకు మేతగా నిధులు కరిగిపోయాయని గ్రామస్థులు వాపోతున్నారు. 

ఈనాడు, కడప

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని