logo

అనుమతులతో పనేంటి... తవ్వేద్దాం

ఒంటిమిట్ట చెరువులో  గత మూడు రోజులుగా అడ్డగోలుగా మట్టి తవ్వేస్తున్నారు.

Published : 28 Mar 2024 03:51 IST

ఒంటిమిట్ట చెరువులో మట్టి దోపిడీ

ఒంటిమిట్ట చెరువులో మట్టిని ట్రాక్టరులో నింపుతున్న పొక్లెయిన్‌

ఒంటిమిట్ట, న్యూస్‌టుడే: ఒంటిమిట్ట చెరువులో  గత మూడు రోజులుగా అడ్డగోలుగా మట్టి తవ్వేస్తున్నారు. దీనికి అటు నీటిపారుదల, ఇటు రెవెన్యూ శాఖల నుంచి అనుమతి పొందలేదు. మండల రెవెన్యూ అధికారి కార్యాలయానికి కూత వేటులో ఉన్న తటాకంలో ఇష్టారాజ్యంగా పట్ట పగలే మట్టి తరలిస్తున్నారు. శ్రీరామనవమి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆలయ పరిసర ప్రాంతాల్లో ఎగుడుదిగుడుగా ఉన్న నేలను చదును చేయాలని తితిదే అధికారులు నిర్ణయించారు. ఇటీవల టెండర్లు పిలిచారు. ఓ గుత్తేదారు పనులను దక్కించుకున్నారు. చెరుడు కట్ట రోడ్డు నుంచి కడప-రేణిగుంట జాతీయ రహదారి మధ్యలో ఖాళీ స్థలాన్ని సమాంతరంగా చేస్తున్నారు. దీని కోసం సమీపంలోని చెరువు నుంచి అనధికారికంగా  మూడు రోజులుగా యంత్రాలతో మట్టి తవ్వుతున్నారు. మమ్మల్ని అడ్డుకునేవారెవరు అనే  ధైర్యంతో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వ నిబంధనలు పాటించడం లేదు. ఎన్నికల వేళ అధికారిక ఉత్తర్వులు తీసుకోవాలనే నిబంధనను విస్మరించారు. ఆలయం బ్రహ్మోత్సవాల అవసరాలకు మన్ను తీసుకుంటున్నామని తితిదే అధికారులు చెబుతున్నారు. ఉన్నతాధికారుల అనుమతి లేకుండా, టెండర్లు పిలవకుండా, గుత్తేదారులతో ఒప్పందం చేసుకోకుండా అంతా మౌఖికంగా చేస్తున్నారా అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఇదే ముసుగులో ప్రైవేటు, వాణిజ్య అవసరాల నిమిత్తం తీసుకెళ్లడానికి  మరికొందరు యత్నిస్తున్నారు. ఈ విషయంపై నీటిపారుదల శాఖ ఈఈ వెంకట్రామయ్యను ‘న్యూస్‌టుడే’ సంప్రదించగా చెరువులో మట్టి కావాలని ఇంతవరకు ఎవరూ తమను అడగలేదని తెలిపారు. తహసీల్దారు వెంకటరమణను సంప్రదించగా మట్టి తరలింపునకు దరఖాస్తు చేశారని, ఇంకా అధికారిక అనుమతి ఇవ్వలేదని చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని