logo

జైళ్లలో స్థానిక, అంతర్రాష్ట్ర ముఠాల దోస్తీ.. చిట్కాలు నేర్చి చోరీలు

చేతులకు గ్లౌజులు.. ముఖానికి మాస్క్‌.. సీసీ కెమెరాకు చిక్కకుండా దొంగతనాలు. పోలీసులకు ఆనవాళ్లు చిక్కకుండా లంగర్‌హౌజ్‌ ప్రాంతానికి చెందిన కరడుగట్టిన దొంగ వేసే ఎత్తుగడలు. రెండేళ్ల కిందట కారాగారంలో

Published : 31 Mar 2022 08:08 IST

రాచకొండ పోలీసులు అరెస్టు చేసిన నిందితులు(పాతచితం)

ఈనాడు, హైదరాబాద్‌: చేతులకు గ్లౌజులు.. ముఖానికి మాస్క్‌.. సీసీ కెమెరాకు చిక్కకుండా దొంగతనాలు. పోలీసులకు ఆనవాళ్లు చిక్కకుండా లంగర్‌హౌజ్‌ ప్రాంతానికి చెందిన కరడుగట్టిన దొంగ వేసే ఎత్తుగడలు. రెండేళ్ల కిందట కారాగారంలో అంతర్రాష్ట్ర ముఠా ఇచ్చిన సలహాతో వేలిముద్రలు దొరక్కుండా ఇలా చేస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో వివరించాడు. ఇప్పటి వరకు 80కు పైగా చోరీలు చేసిన ఇతడికి అంతరాష్ట్ర దొంగలతో పరిచయాలున్నాయి.  మహారాష్ట్రలో చోరీ చేసిన ద్విచక్రవాహనాలను హైదరాబాద్‌లో విక్రయిస్తారు. ఇక్కడ కొట్టేసిన వాహనాలను కర్ణాటక, మహారాష్ట్రల్లోని గ్రామీణ ప్రాంతాల్లో అమ్ముతుంటారు. వచ్చే సొమ్మును వాటాలేసుకొని పంచుకుంటారు.

వేలిముద్రలు పడకుండా..

మహానగరంలో ఏటా రూ.80-100 కోట్ల సొత్తు దొంగలు దోచుకెళ్తుంటారని అంచనా. వీటిలో ఇళ్లలో జరిగే చోరీల్లో పోగొట్టుకుంటున్న సొమ్ము ఎక్కువగా ఉంటుంది. స్థానిక చోరులకు దీటుగా ఏపీ, మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్‌, తమిళనాడు రాష్ట్రాల ముఠాలు దొంగతనాలు, దోపిడీలకు తెగబడుతున్నాయి. వీరిలో 50-60 శాతం మంది నిందితులు పోలీసులకు చిక్కి జైలుకెళ్తున్నారు. ఆ సమయంలో ఇతర కేసుల్లో నిందితులను స్నేహితులుగా మారుతున్నారు. తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, ఉర్దూ వంటి భాషలను తేలికగా నేర్చుకుంటున్నారు. మైత్రి కుదిరాక తమ అనుభవాలను పంచుకుంటున్నారు. నేరాలు చేసే సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఆధారాల్లేకుండా ఎలా చెరిపేయాలనే అంశాలు నేర్చుకుంటున్నారని నగరానికి చెందిన పోలీసు ఉన్నతాధికారి ఒకరు విశ్లేషించారు. బాచుపల్లి, కొంపల్లి, దుండిగల్‌ ప్రాంతాల్లో విల్లాల్లో మాత్రమే చోరీలు చేసే దొంగ.. వేలిముద్రలు దొరక్కుండా, పోలీసు జాగిలాలకు ఆనవాళ్లు చిక్కకుండా కారంపొడి చల్లుతాడు. తమిళనాడు జైలులో పరిచయమైన ఓ వ్యక్తి తనకు ఈ చిట్కా చెప్పాడంటూ సైబరాబాద్‌ పోలీసులకు వెల్లడించాడు. స్మార్ట్‌ఫోన్లవల్ల పోలీసులు జాడ కనిపెడుతున్నారు. అందుకే.. తాను మూడేళ్లుగా సెల్‌ఫోనే వాడట్లేదంటూ ఇటీవల రాచకొండ పోలీసులు అరెస్ట్‌ చేసిన మరో దొంగ చెప్పిన సమాధానం.

పేరు మార్చి.. ఖాకీలను ఏమార్చి

నేరస్తుడిగా పోలీసు రికార్డుల్లోకి ఎక్కితే తనిఖీలు, నోటీసులు వస్తుంటాయి. న్యాయస్థానాల ఎదుట హాజరు కావాల్సి ఉంటుంది. పోలీసుల నుంచి తప్పించుకొనేందుకు పేర్లు, చిరునామాలను తేలికగా మార్చేసుకుంటున్నారు. ఇటీవల ఇబ్రహీంపట్నం వద్ద జరిగిన జంట హత్యల కేసుల్లో ప్రధాన నిందితుడు మట్టారెడ్డి అలియాస్‌ శంకర్‌రెడ్డి పలు మారుపేర్లతో చలామణీ అయ్యాడు. 2007లో నారాయణగూడ పోలీసులు నమోదు చేసిన కేసులో నిందితుడిగా ఉన్న ఇతడి ఆచూకీ గుర్తించటం సాధ్యపడలేదు. హత్యల కేసులో నిందితుడిగా నిర్ధారించాక తాము వెతికే వ్యక్తి అతడని నారాయణగూడ పోలీసులు గుర్తించగలిగారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని