logo

TS News: నా ఆత్మహత్యకు మొదటి సూత్రధారి అతనే: మరో సెల్ఫీ వీడియోలో రామకృష్ణ

భార్య, పిల్లలకు నిప్పు పెట్టి తాను ఆత్మహత్య చేసుకున్న రామకృష్ణ మరో సెల్ఫీ వీడియో నిన్న రాత్రి బయటకొచ్చింది.

Updated : 08 Jan 2022 08:54 IST

పాల్వంచ, ఈటీవీ- ఖమ్మం: తన బలవన్మరణానికి మొదటి సూత్రధారి వనమా రాఘవేంద్రరావు అలియాస్‌ రాఘవ అని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో ఈనెల 3న కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకున్న నాగ రామకృష్ణ పేర్కొన్నారు. ఆయన ఆత్మహత్య చేసుకోవడానికి ముందు చేసిన సెల్ఫీ వీడియో మరోటి శుక్రవారం వెలుగుచూసింది. వివరాలు ఆయన మాటల్లోనే.. ‘నా నాన్న పేరు మండిగ చిట్టబ్బాయి. తూర్పుగోదావరి జిల్లా మోతుగూడెంలో ఆరోగ్య శాఖలో హెల్త్‌ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేసేవారు. 1992లో నాకు 13 ఏళ్ల వయసులో మావోయిస్టులు అమర్చిన మందుపాతర పేలి మా నాన్న మృతిచెందారు. మీరు ఈ వీడియో చూసే సమయానికి నేను బతికి ఉంటాననో లేదో తెలీదు.

నా పరిస్థితికి సూత్రధారి రాఘవ. నా అక్క మాధవి, మా తల్లి సూర్యవతి సహకరించారు. 20 ఏళ్లుగా మా అక్కతో వనమా రాఘవకు వివాహేతర సంబంధం ఉంది. ఈ ముగ్గురూ కలిసి తండ్రి ద్వారా న్యాయబద్ధంగా నాకు రావాల్సిన ఆస్తిని అడ్డుకున్నారు. అమ్మ రిటైరయ్యే ముందు 2020 నవంబరులో పెద్దమనుషుల సమక్షంలో వాటాలు తేల్చుకున్నాం. ఏడాది నుంచి వాటాలు పంచకుండా నా పరిస్థితిని చావుదాకా తీసుకొచ్చారు. మా సొంత స్థలం పోలవరం మండలం పాత పట్టిసీమ. మా స్వస్థలానికి ఏ సంబంధం లేని రాఘవ ఆస్తి పంపకాల విషయంలో జోక్యం చేసుకుంటున్నారు.

అక్కకు పోలవరంలో రెండు ఎకరాలు, రాజమండ్రిలో రెండు ఇళ్ల స్థలాలు, గోకవరంలో 200 గజాల స్థలం, అమ్మ రిటైర్‌మెంట్‌ డబ్బులో కూడా వాటా ఇచ్చాం. నేను రాజమండ్రిలో అద్దె ఇల్లులో ఉంటున్నా. ఇద్దరు ఆడపిల్లలు. వారి చదువులు, కుటుంబం గడవడానికి సంపాదించుకోవాలి. సుమారు రూ.30లక్షలు అప్పులు అయ్యాయి. న్యాయం జరగదనే కుటుంబం సహా బలవన్మరణానికి పాల్పడుతున్నా. నాకు అప్పులిచ్చిన వారికి అన్యాయం చేయొద్దు’ అని రామకృష్ణ వీడియోలో తెలిపారు. కుటుంబం ఆత్మహత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రాఘవను నిన్న రాత్రి పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని