సంక్షోభం నుంచి సంక్షోభానికి...

భయపడినంతా జరిగింది! ఎడతెగని యుద్ధాలతో భీతిల్లుతున్న ప్రపంచాన్ని మరో కదన రక్కసి చుట్టుముట్టింది. రెండు వారాల క్రితం సిరియాలో తమ రాయబార కార్యాలయంపై జరిగిన దాడికి ప్రతీకారం తీర్చుకునే తీరతామన్న ఇరాన్‌- ఆ హెచ్చరికను నిజంచేస్తూ తాజాగా ఇజ్రాయెల్‌పై దండెత్తింది. వందల సంఖ్యలో క్షిపణులు, డ్రోన్లను ప్రయోగించింది. వాటిని మధ్యలోనే కూల్చేసినట్లు అమెరికా...

Published : 15 Apr 2024 01:34 IST

యపడినంతా జరిగింది! ఎడతెగని యుద్ధాలతో భీతిల్లుతున్న ప్రపంచాన్ని మరో కదన రక్కసి చుట్టుముట్టింది. రెండు వారాల క్రితం సిరియాలో తమ రాయబార కార్యాలయంపై జరిగిన దాడికి ప్రతీకారం తీర్చుకునే తీరతామన్న ఇరాన్‌- ఆ హెచ్చరికను నిజంచేస్తూ తాజాగా ఇజ్రాయెల్‌పై దండెత్తింది. వందల సంఖ్యలో క్షిపణులు, డ్రోన్లను ప్రయోగించింది. వాటిని మధ్యలోనే కూల్చేసినట్లు అమెరికా, ఇజ్రాయెల్‌ ప్రకటించినప్పటికీ- టెహరాన్‌ ప్రతీకార చర్యలతో పశ్చిమాసియా యుద్ధసంక్షోభం మరింత జటిలం కానుంది.  ఆరు నెలలుగా గాజాలో ఇజ్రాయెల్‌ సాగిస్తున్న జాతిహననం మూలంగా పశ్చిమాసియా నిత్యం నెత్తురోడుతోంది. పాలస్తీనీయులపై ఇజ్రాయెల్‌ దమనకాండను నిరసిస్తూ ఇరాన్‌ మద్దతు కలిగిన హెజ్బొల్లా, హూతీ, ఇతర తీవ్రవాద బృందాలు టెల్‌ అవీవ్‌పై మెరుపు దాడులకు దిగుతున్నాయి. అందుకు ప్రతిగా ఆయా వర్గాల నేతలు, సైనికాధికారులను ఇజ్రాయెల్‌ మట్టుపెడుతోంది. ఎర్రసముద్రంలో రవాణా నౌకలే లక్ష్యంగా హూతీలు చెలరేగుతుండటంతో చమురు రవాణాకు తీవ్ర ఆటంకాలు తలెత్తుతున్నాయి. హూతీలను నిలువరించేందుకు అమెరికా, బ్రిటన్‌లు రంగంలోకి దిగాయి. ఈ పరస్పర దాడులతో రావణకాష్ఠమైన పశ్చిమాసియాలో శాంతి పావురం రెక్కలు ఎప్పుడో తెగటారిపోయాయి. ఇజ్రాయెల్‌తో ఇన్నాళ్లూ ప్రచ్ఛన్న యుద్ధం చేసిన ఇరాన్‌ ఇప్పుడు ప్రత్యక్ష కదనానికి కాలుదువ్వడంతో పరిస్థితులు మరింతగా విషమించనున్నాయన్న భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.  టెహరాన్‌ దాడిని కాచుకోవడంలో ఇజ్రాయెల్‌కు పూర్తిస్థాయిలో అండగా నిలబడతానని అమెరికా పునరుద్ఘాటించిన నేపథ్యంలో పశ్చిమాసియా భవిష్యత్తు ఏమిటో ఎవరికీ అంతుపట్టడంలేదు!

పశ్చిమాసియాలో అమెరికా దన్ను ఉన్న దేశాలతో తమకు ముప్పు తప్పదని భావించే ఇరాన్‌- ఆయా ప్రాంతాల్లో వేర్పాటువాద బృందాలను పెంచిపోషిస్తోంది. అగ్రరాజ్యం 2003లో ఇరాక్‌ను ఆక్రమించినప్పుడు అక్కడి షియా తిరుగుబాటుదారులకు- ఇరాన్‌కు చెందిన ఇస్లామిక్‌ రెవల్యూషనరీ గార్డ్‌ కోర్‌(ఐఆర్‌జీసీ) సాయం చేసింది. దాంతో అమెరికా తన సైనికులను పెద్దసంఖ్యలో కోల్పోవాల్సి వచ్చింది. ఈ క్రమంలో ప్రపంచ శాంతిభద్రతలకు ప్రమాదకరమైన దేశాల జాబితాలో ఇరాన్‌ను అమెరికా చేర్చింది. 2015లో ఇరుపక్షాల నడుమ కుదిరిన అణు ఒప్పందాన్ని ఆపై మూడేళ్లకు ట్రంప్‌ సర్కారు ఏకపక్షంగా కాలదన్నడంతో టెహరాన్‌ మళ్ళీ ఆంక్షల చట్రంలోకి జారిపోయింది. ఐఆర్‌జీసీ సీనియర్‌ కమాండర్‌ ఖాశీం సులేమానీని నాలుగేళ్ల క్రితం అమెరికా మట్టుపెట్టినప్పుడు ఇరాన్‌ తీవ్రంగా రగిలిపోయింది. ఇటీవల సులేమానీ సమాధి దగ్గర ప్రజలు నివాళులు అర్పిస్తున్నప్పుడు సంభవించిన జంట పేలుళ్లలో 103 మంది మృత్యవాత పడ్డారు. డమాస్కస్‌లోని తమ రాయబార కార్యాలయంపై జరిగిన దాడిలో ఐఆర్‌జీసీ కీలక సభ్యులు మరణించడం- ఇరాన్‌ ఆగ్రహ జ్వాలల్లో మరింతగా ఆజ్యంపోసింది. మరోవైపు ప్రాంతీయంగా తాను ఎదుర్కొంటున్న సవాళ్లన్నింటికీ ఇరానే మూలకారణమని ఇజ్రాయెల్‌ బలంగా నమ్ముతోంది. అలా దీర్ఘకాలంగా కత్తులు దూసుకుంటున్న ఉభయపక్షాలు నేడు నేరుగా తలపడుతున్నాయి. ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు రక్తదాహానికి ఇప్పటికే 33వేలకు పైగా పాలస్తీనీయుల ప్రాణాలు గాలిలో కలిశాయి. అందులో డెబ్భైశాతం మహిళలు, చిన్నారులే. లక్షల మంది నిరాశ్రయులయ్యారు. ఇరాన్‌-ఇజ్రాయెల్‌ పోరు తీవ్రతరమైతే పశ్చిమాసియాలో  మిణుకుమిణుకుమంటున్న మానవతా దీపం పూర్తిగా కొండెక్కిపోతుంది. ఆ దారుణోత్పాతాన్ని నిలువరించేందుకు ఐక్యరాజ్య సమితితో కలిసి ప్రపంచ దేశాలు సత్వరం స్పందించాలి. శాంతిచర్చలకు మార్గం సుగమం చేసి ఇజ్రాయెల్‌-ఇరాన్‌ నడుమ సంధికి ప్రయత్నించడంతో పాటు నెత్తుటిగాయాల గాజాకు ఉపశమనం లభించేలా చూడాలి!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు