ఉన్నత విద్యకు వేరుపురుగు జగన్‌

జగన్‌ అంటే- పోత పోసిన అబద్ధం. ఆయన పాలన రాష్ట్రం కనీవినీ ఎరుగని అనర్థం! ‘విశ్వవిద్యాలయ స్థాయిలో అత్యున్నత ప్రమాణాలు నెలకొల్పాలి... ఆరు వర్సిటీలపై  ప్రధానంగా దృష్టిసారించి దేశంలోని టాప్‌ 10 జాబితాలో అవి నిలిచేలా కార్యాచరణ రూపొందించాలి’ అని 2021లో ఆదర్శ ప్రబోధాలు చేసింది జగనే! నేషనల్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ ర్యాంకింగ్‌ ఫ్రేమ్‌వర్క్‌ (ఎన్‌ఐఆర్‌ఎఫ్‌)లో ఏయూ 19వ స్థానంలో...

Published : 15 Apr 2024 01:34 IST

గన్‌ అంటే- పోత పోసిన అబద్ధం. ఆయన పాలన రాష్ట్రం కనీవినీ ఎరుగని అనర్థం! ‘విశ్వవిద్యాలయ స్థాయిలో అత్యున్నత ప్రమాణాలు నెలకొల్పాలి... ఆరు వర్సిటీలపై  ప్రధానంగా దృష్టిసారించి దేశంలోని టాప్‌ 10 జాబితాలో అవి నిలిచేలా కార్యాచరణ రూపొందించాలి’ అని 2021లో ఆదర్శ ప్రబోధాలు చేసింది జగనే! నేషనల్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ ర్యాంకింగ్‌ ఫ్రేమ్‌వర్క్‌ (ఎన్‌ఐఆర్‌ఎఫ్‌)లో ఏయూ 19వ స్థానంలో, ఎస్వీ వర్సిటీ 38వ స్థానంలో ఉన్నాయని వాటి ర్యాంకుల్ని మెరుగుపరచాలనీ నిర్దేశించిందీ ఆయనే. నేడు ఏయూ 43వ స్థానానికి,  ఎస్వీయూ 101-150 స్థానాల కేటగిరీకీ దిగజారిపోయాయి. బోధన, అధ్యాపకులు- విద్యార్థుల నిష్పత్తి, ఆర్థిక వనరుల వంటి అయిదు అంశాలను ప్రామాణికంగా మదింపు వేసే ఈ ర్యాంకులు- రాష్ట్రంలో ఉన్నత విద్య దురవస్థకు దర్పణం పడుతున్నాయి. దేశ భవిష్యత్తు నిర్మాణానికి నిబద్ధం కావాల్సిన యూనివర్సిటీల్ని వైకాపా కార్యాలయాలుగా భ్రష్టు పట్టించింది జగన్‌ ప్రభుత్వం. ఉపకులపతి పదవికి జాతీయ స్థాయిలో నోటిఫికేషన్‌ ఇచ్చినా సమర్థులెవరూ స్పందించలేనంతగా వర్సిటీల ప్రతిష్ఠ నేలమట్టమైంది. అత్యున్నత సామర్థ్యం, నిష్కళంక వ్యక్తిత్వం, నిష్పాక్షికత, జవాబుదారీతనం కలవారే ఉపకులపతులుగా ఉండాలని యూజీసీ నిర్దేశిస్తోంది. ‘వేరు పురుగు చేరి వృక్షంబు చెరచు’ అన్నట్లు జగన్‌ చేసిన రాజకీయ నియామకాలతో నేడు వర్సిటీల్లో పరిశోధనలు కాదు, వైకాపా నేతల బర్త్‌డే వేడుకలు జరుగుతున్నాయి. జగన్‌కు పాలాభిషేకాలు, వైఎస్‌ విగ్రహావిష్కరణలు, జగన్‌ పరివారం ఫ్లెక్సీలు- నేడు సర్వసాధారణమయ్యాయి. విశ్వవిద్యాలయాల్ని వైకాపా భజన మండళ్లస్థాయికి దిగజార్చేటంత బరితెగింపు వీసీలకు ఎలా సాధ్యపడింది? వీసీ పదవికి మూడు పేర్లను ఎంపిక చేసి గవర్నర్‌ పరిశీలనకు పంపినా, తమ మోచేతి నీళ్లు తాగేవాళ్లలో అగ్రగణ్యుడినే తమ ప్రాధాన్యంగా సర్కారు సిఫార్సు చేస్తోంది. పాలక వర్గం నియామకాల్లోనూ అదే వరస. వర్సిటీల్నీ అక్షరాలా రాజకీయ అడ్డాలుగా మార్చేసింది జగన్‌ రాక్షసపాలన!

‘నాణ్యమైన విద్య ప్రతి ఒక్కరి హక్కు’ అన్నది జగన్‌ నోట జాలువారిన సుభాషితం. ఆదీ అంతం లేని అరాచకాలతో ఉన్నత చదువుల్ని కుళ్లబొడిచింది వైకాపా ప్రభుత్వం. రాష్ట్రంలోని 18 విశ్వవిద్యాలయాలు, ట్రిపుల్‌ ఐటీల్లో 4192 పోస్టులు ఉంటే, ప్రస్తుతం పనిచేస్తున్నవారు 994 మంది. ఉన్నత విద్యారంగంలో ఖాళీగా ఉన్న 3220 పోస్టుల్ని భర్తీ చేసే ప్రక్రియ వేగంగా జరుగుతోందని కొన్నేళ్లుగా జగన్‌ బులిపించారు. ఎట్టకేలకు తీరిక చేసుకొని నిరుడు అక్టోబరులో ఉద్యోగ ప్రకటనలు ఇచ్చినా అందులో దాగున్న మతలబులపై కొందరు అభ్యర్థులు కోర్టుకెక్కారు. దానిపై న్యాయస్థానంలో వెంటనే కౌంటర్‌ దాఖలు చేయకుండా సర్కారు నాన్చుడు ధోరణి అవలంబించడంతో నియామక ప్రక్రియ అటకెక్కింది! పాఠశాల విద్యారంగంపై వేసిన పాచికల్నే జగన్‌ ప్రభుత్వం ఇక్కడా ప్రయోగించింది. హేతుబద్ధీకరణ ముసుగులో కొన్నిచోట్ల పోస్టుల్ని రద్దుచేశారు. మరికొన్ని సర్దుబాట్లు చేశారు. పర్యవసానంగా తమకు లభించాల్సిన బ్యాక్‌లాగ్‌ పోస్టులు పోయాయని ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు మొత్తుకొంటున్నారు! ఆంధ్ర, ఎస్వీ యూనివర్సిటీల్లోనే 350 పోస్టులకు మంగళం పాడిన జగన్‌, కొన్ని కోర్సులనూ ఎత్తేశారు. ఒప్పంద అధ్యాపకుల కనీస జీతనాతాల ఆశల్నీ తుంచేశారు. ఈ నేపథ్యంలో ప్రవేశ పరీక్షతో నిమిత్తం లేకుండా సీటు ఇస్తామంటున్నా వర్సిటీల గుమ్మం తొక్కడానికే చదువరులు మొహం చాటేస్తున్నారు. పరీక్షల్లో తప్పినా పునర్‌ మూల్యాంకనంలో 30-40శాతం ఉత్తీర్ణులవుతున్నారు. జగనన్న కాలనీల పేరిట విశ్వవిద్యాలయాల స్థలాలకు వైకాపా నేతలు ఎసరుపెడుతున్నారు. వర్సిటీల్లో అక్రమాల్ని ఉన్నత విద్యామండలి పెద్దలు చూసీచూడనట్లు వదిలేస్తున్నారు! మరోవంక జగన్‌ ప్రభుత్వం విశ్వవిద్యాలయాల ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు, నిధులపై కన్నేసి వాటిని రాష్ట్ర ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ కార్పొరేషన్‌కు బదిలీ చేయిస్తోంది. ఇలా వర్సిటీల్ని కరిమింగిన వెలగపండుగా మార్చేసిన జగన్‌ దురాగతాల్ని ఓటుతో దునుమాడితేనే ఉన్నత విద్యారంగం తిరిగి కోలుకునేది!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు