ప్లాస్టిక్‌ శుద్ధి ప్రాణావసరం

పర్యావరణానికి తూట్లు పొడిచి, జీవావరణానికి మరణశాసనం లిఖిస్తున్న ప్లాస్టిక్‌ కాలుష్యభూతం ప్రపంచ దేశాలన్నింటినీ హడలెత్తిస్తోంది. భూరి పరిమాణంలో వ్యర్థాలు సూక్ష్మ ప్లాస్టిక్‌గా గాలిలో, నీటిలో చేరి ప్రజారోగ్యానికి, ఇతరత్రా జీవకోటి మనుగడకు పెనుసవాళ్లు రువ్వుతున్నాయి.

Published : 17 Apr 2024 01:24 IST

ర్యావరణానికి తూట్లు పొడిచి, జీవావరణానికి మరణశాసనం లిఖిస్తున్న ప్లాస్టిక్‌ కాలుష్యభూతం ప్రపంచ దేశాలన్నింటినీ హడలెత్తిస్తోంది. భూరి పరిమాణంలో వ్యర్థాలు సూక్ష్మ ప్లాస్టిక్‌గా గాలిలో, నీటిలో చేరి ప్రజారోగ్యానికి, ఇతరత్రా జీవకోటి మనుగడకు పెనుసవాళ్లు రువ్వుతున్నాయి. శుద్ధిచేసి పునర్వినియోగానికి అనుగుణంగా మార్చడంలో అలసత్వం మూలాన ప్లాస్టిక్‌ చెత్త కొండలుగా పేరుకుపోతోంది. స్విట్జర్లాండ్‌కు చెందిన ఎర్త్‌ యాక్షన్‌ సంస్థ తాజాగా క్రోడీకరించిన సమాచారం ప్రకారం- ప్లాస్టిక్‌ కాలుష్యంలో 60శాతానికి పన్నెండు దేశాలు ప్రధానంగా పుణ్యం కట్టుకుంటున్నాయి. ఆ జాబితాలో అమెరికా, చైనా, రష్యా తదితర దేశాలతోపాటు ఇండియా పేరూ చోటుచేసుకుంది. ఈ ఏడాది భారత్‌లో శుద్ధి చేయకుండా వదిలేసే ప్లాస్టిక్‌ వ్యర్థాల రాశి 74లక్షల టన్నులకు చేరుతుందన్న ఆ సంస్థ అంచనా- సత్వర దిద్దుబాటు చర్యల ఆవశ్యకతను చాటుతోంది. వాస్తవానికి, దేశంలో ఇప్పటికే రోజూ సగటున 26వేల టన్నుల ప్లాస్టిక్‌ వ్యర్థాలు ఉత్పత్తవుతున్నాయి. అంటే, సంవత్సరకాలంలో దాదాపు 95లక్షల టన్నులు. అందులో 30శాతమే రీసైక్లింగుకు నోచుకుంటున్నదన్న గణాంకాల ప్రాతిపదికన- శుద్ధికాకుండా పోగుపడుతున్నది 66లక్షల టన్నులకుపైగానే ఉంది. అది ఇంకో ఎనిమిది లక్షల టన్నుల దాకా పెరుగుతుందని ‘ఎర్త్‌ యాక్షన్‌’ చెబుతోంది! పర్యవసానాలు గుర్తెరగకుండా బహిరంగ ప్రదేశాల్లో పారేస్తున్న ప్లాస్టిక్‌ సంచులు ఎన్నో మూగజీవాల ప్రాణాల్ని తోడేస్తున్నాయి. దేశంలో చనిపోతున్న ప్రతి గేదె, ఆవు పొట్టలో 30, 40 కిలోలదాకా ప్లాస్టిక్‌ వ్యర్థాలు బయటపడుతున్నాయి. నదులు, సముద్రాల్లో పేరుకుపోతున్న ప్లాస్టిక్‌ ఉత్పత్తుల్ని తిని హరాయించుకోలేక పక్షులు, చేపలు, తాబేళ్లు వంటివెన్నో అసంఖ్యాకంగా మృత్యువాత పడుతున్నాయి. ఆమధ్య శ్రీలంకలో ప్లాస్టిక్‌ వ్యర్థాలకు ఆశపడి ఏనుగులు చనిపోయిన కథనాలు సంక్షోభ తీవ్రతను కళ్లకు కట్టాయి. మానవ శరీర కణాల్ని, డీఎన్‌ఏను దెబ్బతీసి క్యాన్సర్లనూ వాటిల్లజేయగల ప్లాస్టిక్‌ వ్యర్థాల నియంత్రణకు నిపుణులు ఏనాటినుంచో పిలుపిస్తున్నారు. అధ్వాన నిర్వహణవల్ల ప్లాస్టిక్‌ కాలుష్యం ఇంతలంతలవుతున్న నేపథ్యంలో- తక్షణ కార్యాచరణకు ఇండియాతోపాటు తక్కిన దేశాలూ ముందడుగు వేస్తేనే, పర్యావరణం తేరుకుంటుంది.

ప్లాస్టిక్‌ వ్యర్థాల కట్టడిలో విఫలమైతే, రేపటి తరానికి అణ్వస్త్రాలను మించిన పెనుముప్పు తప్పదని సర్వోన్నత న్యాయస్థానం దశాబ్దం క్రితమే హెచ్చరించింది. దేశవ్యాప్త ప్లాస్టిక్‌ కాలుష్యంలో 30శాతం దాకా మహారాష్ట్ర, గుజరాత్‌, తమిళనాడుల పుణ్యమేనని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ (బెంగళూరు)- ప్రాక్సిస్‌ గ్లోబల్‌ అలయెన్స్‌ల సంయుక్త నివేదిక నిరుడు వెల్లడించింది. ఎవరేం చెప్పినా పెద్దగా పట్టించుకోని పాలక గణాల అలసత్వం దేశంలో పలుచోట్ల వరద బీభత్సాలకు, జలచరాల సామూహిక బలిదానానికి, మనుషుల్లో తీవ్ర అనారోగ్య సమస్యలకు కారణభూతమవుతోంది. సక్రమంగా వినియోగించుకోవాలే గాని- ప్లాస్టిక్‌ వ్యర్థాల వల్ల ఎన్నో ప్రయోజనాలు ఒనగూడుతాయని ఇప్పటికే పలుమార్లు రుజువైంది. చెన్నై, నొయిడా, కొచ్చి, ముంబయి, కోల్‌కతా, బెంగళూరు వంటిచోట్ల ప్లాస్టిక్‌ వ్యర్థాలతో రోడ్లు వేస్తున్నారు. పది టన్నుల ప్లాస్టిక్‌ వ్యర్థాల నుంచి 6000 లీటర్ల డీజిల్‌ తయారీ ప్రయోగంతో ఆమధ్య తెలంగాణ యువ ఇంజినీర్ల ద్వయం కనబరచిన విశేష ప్రతిభ అబ్బురపరచింది. ఒకవైపు ప్లాస్టిక్‌ రీసైక్లింగ్‌ను ప్రోత్సహిస్తూ, మరోపక్క- వీధికుక్కల ఆకలి తీర్చేలాగా ప్రత్యేక యంత్రాన్ని రూపొందించిన హుబ్లీ యువకుడు కిరణ్‌ మానవీయ సృజనాత్మకత స్ఫూర్తిమంతంగా నిలుస్తుంది. అటువంటి మిషన్లను దేశవ్యాప్తంగా 375 పట్టణాల్లో నెలకొల్పాలన్నది ఆ యువతేజం లక్ష్యం! మనసుంటే మార్గం ఉంటుంది. మానవాళికి వదిలించుకోలేని శత్రువులా పరిణమించిన ప్లాస్టిక్‌ కాలుష్యాన్ని అరికట్టి, ఆ వ్యర్థాలను ఇంధనంగానో మరో విధంగానో ఉపయోగించడమన్నది జాతి సంస్కృతిగా స్థిరపడాలి. ఆ మేరకు విధివిధానాలను ప్రక్షాళించడంతోపాటు రేపటి తరంలో ప్లాస్టిక్‌ ఉత్పత్తుల దుష్ప్రభావాలపై లోతైన అవగాహన కలిగించడానికి ప్రభుత్వాలు కంకణబద్ధం కావాలి!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.