icon icon icon
icon icon icon

మద్యం అక్రమాలపై సమగ్ర విచారణ.. అధికారంలోకి రాగానే విషపూరిత బ్రాండ్ల రద్దు

అధికారంలోకి రాగానే విషపూరిత మద్యం బ్రాండ్లను రద్దుచేస్తామని, మద్యం అక్రమాలపైౖ సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెదేపా అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు.

Updated : 01 May 2024 07:31 IST

రూ.10 ఇచ్చి రూ.100 లాక్కునే విధానానికి స్వస్తి: చంద్రబాబు
ఉమ్మడి మ్యానిఫెస్టోకు కేంద్రం సంపూర్ణ మద్దతు: భాజపా

ఈనాడు, అమరావతి: అధికారంలోకి రాగానే విషపూరిత మద్యం బ్రాండ్లను రద్దుచేస్తామని, మద్యం అక్రమాలపైౖ సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెదేపా అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు. రాష్ట్రంలో సంపద సృష్టించి పేదలకు పంచుతామని, వైకాపా ప్రభుత్వం అమలు చేసిన రూ.10 ఇచ్చి ప్రజల నుంచి రూ.100 లాక్కునే విధానానికి స్వస్తి పలుకుతామని పేర్కొన్నారు. ‘మ్యానిఫెస్టో రూపకల్పనలో తెదేపా, జనసేనల భాగస్వామ్యం ఉంది. భాజపా సూచనలూ తీసుకున్నాం. ఎన్డీయే జాతీయస్థాయిలో మ్యానిఫెస్టో ప్రకటించింది. రాష్ట్రస్థాయిలో ఎక్కడా వారు భాగస్వాములు కావడం లేదు. కూటమి మ్యానిఫెస్టోకు కేంద్ర సహకారం సంపూర్ణంగా ఉంటుంది. అందుకే భాజపా నేతలు ఇక్కడికి వచ్చారు. మ్యానిఫెస్టోను పూర్తిగా అమలు చేసే బాధ్యతను జనసేన, తెదేపా తీసుకుంటాయి’ అని పేర్కొన్నారు. ఉండవల్లిలోని నివాసంలో మంగళవారం ఆయన ఉమ్మడి మ్యానిఫెస్టోను ప్రకటించారు. ఈ సందర్భంగా మాట్లాడారు.

రూ.13 లక్షల కోట్ల అప్పులు

‘జగన్‌కు పాలన చేతకాదు. కానీ డ్రైవర్‌ సీట్లో కూర్చోబెట్టారు. ఆయన వాహనాన్ని రివర్స్‌లో తోలుతున్నారు. బుద్ధి ఉన్నవారు ఎవరైనా రివర్స్‌ టెండరింగ్‌ చేస్తారా? వైకాపా హయాంలో రాష్ట్రానికి ఒక్క పరిశ్రమైనా వచ్చిందా? అభివృద్ధి జరిగిందా? ఇక ఆదాయం ఎక్కడ నుంచి వస్తుంది? అందుకే అప్పులు చేశారు. ఇప్పుడు ఏమీ చేయలేనని చేతులెత్తేశారు. రూ.2.70 లక్షల కోట్లకు బటన్‌ నొక్కానంటున్నారు. అమరావతిని కొనసాగించి ఉంటే రూ.3లక్షల కోట్లు వచ్చేవి. దానికి బదులు రూ.13 లక్షల కోట్ల అప్పులు చేశారు. అస్తవ్యస్త ఆర్థిక విధానాలు, విధ్వంసంతో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు’ అని మండిపడ్డారు.

భూముల్ని దోచుకునేందుకే.. ఆ యాక్ట్‌

‘వైకాపా ప్రభుత్వం తెచ్చింది ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ కాదు... అది జగన్‌ ల్యాండ్‌ గ్రాబింగ్‌ యాక్ట్‌. దీన్ని అడ్డుగా పెట్టుకుని ప్రజల భూములు దోచుకోవాలని చూస్తున్నారు. 40-50 ఏళ్లు కష్టపడి సంపాదించుకొన్న ఆస్తులనూ మెడమీద కత్తిపెట్టి రాయించుకున్నారు. అధికారంలోకి రాగానే ల్యాండ్‌ గ్రాబింగ్‌ యాక్ట్‌ను రద్దుచేస్తా’ అని హామీ ఇచ్చారు.

‘ఊరూరా మంచినీళ్లు దొరకవు కానీ గంజాయి దొరికే పరిస్థితి తెచ్చారు. వందరోజుల్లో గంజాయి, మాదకద్రవ్యాల్ని నియంత్రిస్తాం. ఉచిత ఇసుక విధానం తెస్తాం. విదేశీ విద్యను ప్రారంభించి అందరికీ వర్తింపజేస్తాం. రాష్ట్రంలో మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేస్తాం. గ్రామాల నుంచి మండలాలకు, అక్కడి నుంచి జిల్లాలకు, అటు నుంచి పోర్టులు, మార్కెట్లకు రోడ్లు, ఇతర మౌలిక వసతులు కల్పిస్తాం. ఫుడ్‌ ప్రాసెసింగ్‌కి అధిక ప్రాధాన్యం ఇస్తాం. రాయితీలు ఇస్తాం. పర్యాటకానికి చాలా అవకాశాలున్నాయి. విద్యుత్తు ఛార్జీలు నియంత్రిస్తాం. అవినీతి అరికడతాం. చెత్తపన్ను రద్దు చేస్తాం. ఇంటి పన్నులనూ సమీక్షిస్తాం. పెట్రోలు, డీజీల్‌ ధరలు, మద్యం ధరల్ని నియంత్రిస్తాం’ అని పేర్కొన్నారు.
రిజర్వాయర్లే కొట్టుకుపోతున్నాయి

‘సాగునీటి ప్రాజెక్టుల్ని నిర్వీర్యం చేశారు. ఇరిగేషన్‌ మేనేజ్‌మెంట్‌ అధ్వానంగా ఉంది. కాలువలు, డ్రెయిన్లు తవ్వలేదు. రిజర్వాయర్లు కొట్టుకుపోతున్నాయి. అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోతే ఏం చేస్తారో చెప్పలేని నిస్సహాయ స్థితి. గుండ్లకమ్మ ప్రాజెక్టు గేట్లు మూడుసార్లు కొట్టుకుపోయాయి. పులిచింతల ప్రాజెక్టు గేట్లు కొట్టుకుపోయాయి. పోలవరం సహా అన్ని ప్రాజెక్టులూ పూర్తి చేస్తాం. నదులు అనుసంధానిస్తాం’ అని చంద్రబాబు తెలిపారు. ‘దేవాదాయ ఆస్తుల కబ్జాల్ని అడ్డుకుంటాం’ అని స్పష్టం చేశారు.

యువతలో నైపుణ్య గణన

‘యువతలో నైపుణ్య గణన చేస్తాం. ఇది దేశంలోనే తొలిసారి. ప్రపంచ మార్పులకు అనుగుణంగా నైపుణ్యాలు అందిస్తాం. చిన్న, మధ్యతరహా, అంకుర పరిశ్రమలకు రూ.10లక్షల వరకు సబ్సిడీ ఇస్తాం. డిజిటల్‌ లైబ్రరీలను అందుబాటులోకి తీసుకువస్తాం’ అని అన్నారు.

‘ఎన్డీయే ప్రభుత్వం తీసుకువచ్చిన 10% ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్లు అమలుచేస్తాం. ఇందులో దామాషా ప్రకారం కాపులకు రిజర్వేషన్లు ఇస్తాం. అగ్రవర్ణ పేదలకు ప్రత్యేక కార్పొరేషన్‌ ఏర్పాటుచేస్తాం. బీసీల హత్య కేసులన్నీ తిరగతోడుతాం. నిందితులకు శిక్ష పడేలా చేస్తాం’ అని తెలిపారు.

తొలిసారిగా రూ.25లక్షల ఆరోగ్య బీమా

‘దేశంలోనే మొదటిసారిగా ఆరోగ్యబీమాను తీసుకొస్తున్నాం. ప్రతి కుటుంబానికీ రూ.25లక్షల బీమా ఇప్పిస్తాం. డిజిటల్‌హెల్త్‌కార్డులు ఇస్తాం. చంద్రన్న బీమా పథకంతో సహజ మరణానికి రూ.5లక్షలు, ప్రమాదంలో మరణిస్తే రూ.10 లక్షలు ఇస్తాం’ అని ప్రకటించారు.

ఉద్యోగులు, ఉపాధ్యాయులకు అండ

‘వైకాపా ప్రభుత్వంలో ఉద్యోగులు చాలా నష్టపోయారు. ఉపాధ్యాయులను నిస్సహాయ స్థితికి తెచ్చారు. వారి హక్కులపై మాట్లాడినందుకు కేసులు పెట్టి సంఘాల నాయకులను అరెస్టు చేయించారు. ఉద్యోగులకు పీఆర్సీ ఇస్తాం. అది వచ్చేలోపు మధ్యంతర భృతి ఇస్తాం. బకాయిల్ని విడతల వారీగా చెల్లిస్తాం. సీపీఎస్‌ను కూడా సమీక్షించి సరైన మార్గం చూపించేలా కృషి చేస్తాం. అవుట్‌సోర్సింగ్‌, అంగన్‌వాడీ, పోలీసుశాఖలో ఉండే వారికి మేలు చేస్తాం. వాలంటీర్ల వేతనం రూ.10వేలకు పెంచుతాం’ అని స్పష్టం చేశారు.

రాయితీపై వ్యవసాయ యంత్ర పరికరాలు

‘ఉచితంగా సోలార్‌ పంప్‌సెట్స్‌ ఏర్పాటుచేసి, వారు ఉత్పత్తి చేసిన విద్యుత్తును వారికిచ్చి.. మిగిలింది గ్రిడ్‌కు ఇచ్చి డబ్బులు పొందేలా చూస్తాం. ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేస్తాం. వ్యవసాయం పరికరాలు, యంత్రాలు రాయితీ మీద ఇస్తాం. కౌలురైతులకు గుర్తింపుకార్డులు ఇస్తాం’ అని తెలిపారు.


ఉద్యోగ కల్పన కేంద్రంగా అమరావతి

‘రాజధాని అమరావతితోనే సంపద సృష్టి సాధ్యం. అమరావతికి పూర్వవైభవం తీసుకొస్తాం. ప్రజల రాజధానిగా మాత్రమే కాకుండా ప్రతి ఒక్కరికీ ఉద్యోగ కల్పన చేసేలా, రాష్ట్రానికి ఆదాయ కేంద్రంగా అమరావతిని మారుస్తాం. విశాఖను ఆర్థిక రాజధానిగా అభివృద్ధి చేస్తాం’ అని చంద్రబాబు చెప్పారు.


ఇళ్ల స్థలాలను రద్దుచేయం

‘పేదలకు పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్ల స్థలం మంజూరు చేస్తాం. ఇప్పటికే పట్టాలిచ్చినవారికి అవే స్థలాల్లో ఇళ్లు కట్టిస్తాం. ఏ ఒక్కరికీ ఇళ్ల స్థలాన్ని రద్దుచేయం. టిడ్కో గృహాల్ని వెంటనే లబ్ధిదారులకు అప్పగిస్తాం. ఉచిత గ్యాస్‌ సిలిండర్ల పథకాన్ని తీసుకొచ్చాం. ఉచిత ప్రయాణ సౌకర్యం వల్ల మహిళల్లో మొబిలిటీ ఎక్కువ ఉంటుంది. డ్వాక్రా మహిళలకు రూ.10లక్షల వరకు వడ్డీ లేని రుణాలు ఇస్తాం’ అని హామీ ఇచ్చారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img