icon icon icon
icon icon icon

ఆ రాష్ట్రంలో లోక్‌సభ బరిలో 12 మంది ఎమ్మెల్యేలు.. గెలిస్తే మరోసారి ఎన్నికలు

పంజాబ్‌లో 12 మంది ఎమ్మెల్యేలు లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. వీరిలో ఆప్‌ నుంచి 9 మంది ఉన్నారు.

Published : 05 May 2024 12:17 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: పంజాబ్‌ రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికలు ముగియగానే.. మరోసారి ఎన్నికల సమరం వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఎక్కువ సంఖ్యలో ఎమ్మెల్యేలు లోక్‌సభ ఎన్నికల బరిలోకి దిగడమే ఇందుకు కారణం. ఆ రాష్ట్రంలో 12 మంది ఎమ్మెల్యేలు ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. వీరు విజయం సాధిస్తే.. ఆయా అసెంబ్లీ స్థానాల్లో ఆరు నెలల్లో ఉప ఎన్నికలు వస్తాయి. రాష్ట్రంలో ఇంతమంది ఎమ్మెల్యేలు లోక్‌సభకు పోటీచేస్తుండటం గతంలో ఎన్నడూ చూడలేదని విశ్లేషకులు అంటున్నారు.

  • పంజాబ్‌లో 13 లోక్‌సభ నియోజకవర్గాలు ఉన్నాయి. ఇందులో 9 నియోజకవర్గాల్లో మొత్తం 12 మంది ఎమ్మెల్యేలు పోటీ పడుతున్నారు. వీరిలో ఐదుగురు మంత్రులు ఉండటం గమనార్హం.
  • ఆరు లోక్‌సభ స్థానాల్లో ఒక్కో ఎమ్మెల్యే తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటుండగా.. మరో మూడు స్థానాల్లో ఇద్దరేసి ఎమ్మెల్యేలు పోటీలో ఉన్నారు.
  • పోటీపడుతున్న ఎమ్మెల్యేల్లో అధికార ఆమ్‌ఆద్మీ పార్టీకి చెందినవారే తొమ్మిది మంది ఉన్నారు. మిగతా ముగ్గురు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు.
  • ఆప్‌ నుంచి పోటీపడుతున్న మంత్రుల్లో అమృత్‌సర్‌ నుంచి కుల్‌దీప్‌సింగ్‌, ఖాదూర్‌ సాహిబ్‌ నుంచి లల్‌జిత్‌ సింగ్‌ భుల్లార్‌, బఠిండా నుంచి గుర్మీత్‌ సింగ్‌ ఖుడియాన్‌, సంగ్రూర్‌ నుంచి గుర్మీత్‌ సింగ్‌ మీట్‌ హయర్‌, పటియాల నుంచి బల్బీర్‌ సింగ్‌ ఉన్నారు.
  • కాంగ్రెస్‌ ఇప్పటివరకూ ప్రకటించిన 12 మంది అభ్యర్థుల జాబితాలో.. ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్నారు. మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన అమరీందర్‌ సింగ్‌ వారింగ్‌ లుధియానా నుంచి పోటీ పడుతున్నారు. భోలత్‌ ఎమ్మెల్యే సుఖ్‌పాల్‌ సింగ్‌ ఖైరా సంగ్రూర్‌ నుంచి, మాజీ ఉప ముఖ్యమంత్రి సుఖ్‌జిందర్‌ సింగ్‌ రంధావా గుర్‌దాస్‌పుర్‌ నియోజకవర్గం నుంచి బరిలో ఉన్నారు. ఈ నియోజకవర్గాల్లో ముగ్గురు ఆప్‌ ఎమ్మెల్యేలు వీరి ప్రత్యర్థులుగా ఉన్నారు.
  • రాష్ట్ర ముఖ్యమంత్రి భగవంత్‌ మాన్‌ దీనిపై మాట్లాడుతూ.. ప్రజల్లో మంచి గుర్తింపు ఉన్న నేతలనే తాము లోక్‌సభ అభ్యర్థులుగా ప్రకటించినట్లు తెలిపారు. ‘‘దిల్లీలో కూడా మేం పలువురు ఎమ్మెల్యేలను బరిలోకి దించాం. వారు గెలిస్తే.. కొత్త ఎమ్మెల్యేలను ఎన్నుకునేందుకు ఉప ఎన్నికలు వస్తాయి. ఉప ఎన్నికలంటే మాకు భయం లేదు. బాగా మాట్లాడే అభ్యర్థులనే మేం ఎంచుకున్నాం. వారందరికీ రాష్ట్ర అసెంబ్లీలో అనుభవం ఉంది’’ అని తమ నిర్ణయాన్ని సమర్థించుకున్నారు.
  • పంజాబ్‌లో 13 లోక్‌సభ నియోజకవర్గాలకు చివరి దశలో భాగంగా జూన్‌ 1న పోలింగ్‌ జరగనుంది.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img