icon icon icon
icon icon icon

Congress: దిల్లీలో కాంగ్రెస్‌కు ‘ఆప్‌’సోపాలు.. పొత్తుపై అసంతృప్తితో పార్టీని వీడుతున్న నేతలు

దిల్లీలో ఆప్‌తో పొత్తు కాంగ్రెస్‌ అంతర్గత సమస్యలకు దారి తీస్తోంది. ఆ పార్టీ కీలక నేతలు రాజీనామాలు చేస్తున్నారు. 

Published : 01 May 2024 11:28 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: వారం వ్యవధిలోనే దిల్లీలో కాంగ్రెస్‌ (Congress)కు మరో షాక్‌ ఎదురైంది. రెండు లోక్‌సభ సీట్లలోని ఇద్దరు పరిశీలకులు పార్టీని వీడారు. ముఖ్యంగా ఆప్‌-కాంగ్రెస్‌ పొత్తు కారణంగానే తాము ఈ నిర్ణయం తీసుకొన్నట్లు పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు వేర్వేరుగా రాసిన లేఖల్లో పేర్కొన్నారు. 

పార్టీ పశ్చిమ దిల్లీ పార్లమెంట్‌ స్థానం పరిశీలకుడు, మాజీ ఎమ్మెల్యే నీరజ్‌ బసోయా రాజీనామా చేశారు. ఈ సందర్భంగా రాసిన లేఖలో స్పందిస్తూ ‘‘ఆప్‌తో పొత్తుపై బాధపడుతూ మీకు ఈ లెటర్‌ రాస్తున్నాను. ఈ కూటమి కారణంగా దిల్లీలో కార్యకర్తలు నిత్యం అవమానాలు, ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. ఆత్మాభిమానం ఉన్న నేతగా నేను పార్టీని వీడుతున్నాను. పదవులు, ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాను. నాలాంటి సాధారణ మనిషికి సోనియా గాంధీ పలు అవకాశాలు కల్పించినందుకు ధన్యవాదాలు’’ అని ఖర్గేకి రాసిన రాజీనామా పత్రంలో వెల్లడించారు. 

ఇక ఉత్తర దిల్లీ పార్లమెంట్‌స్థానంలో కాంగ్రెస్‌ పరిశీలకుడు, మాజీ ఎమ్మెల్యే నసీబ్‌ సింగ్‌ రాజీనామా లేఖలో దిల్లీకి నియమించిన కొత్త కాంగ్రెస్‌ అధ్యక్షుడు దవేందర్‌ యాదవ్‌పై అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘‘దవేందర్‌ ఓ పక్క పంజాబ్‌లో కేజ్రీవాల్‌ తప్పుడు అజెండాపై ఇప్పటి వరకు ప్రచారం చేశారు. నేటి నుంచి ఆయన దిల్లీలో ఆప్‌ ప్రభుత్వాన్ని, కేజ్రీవాల్‌ను పొగుడుతున్నారు’’ అని మండిపడ్డారు. 

కాంగ్రెస్‌ దిల్లీ శాఖ అధ్యక్షుడు అర్విందర్‌ సింగ్ లవ్లీ ఆదివారం తన పదవికి రాజీనామా చేశారు. ఆయన కూడా ఆమ్‌ ఆద్మీ పార్టీతో పొత్తుకు దిల్లీ యూనిట్‌ అంగీకరించలేదని తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు. లోక్‌సభ ఎన్నికలు కొనసాగుతున్న తరుణంలో ఈ పరిణామం చోటుచేసుకోవడం పార్టీకి తలనొప్పిగా మారింది. తాజాగా మరో ఇద్దరు కీలక నాయకులు కూడా వైదొలగడం పార్టీకి ఇబ్బందికరంగా మారింది.   

కాంగ్రెస్‌ పార్టీపై నిరాధార అవినీతి, అక్రమాల ఆరోపణలతోనే ఆప్‌ ఏర్పాటైనట్లు నాడు అర్విందర్‌ తన రాజీనామా లేఖలో ఆరోపించారు. అలాంటి పార్టీతో పొత్తు వద్దని దిల్లీ శాఖ ఏకగ్రీవ తీర్మానం చేసినట్లు చెప్పారు. అయినప్పటికీ.. అధిష్ఠానం నిర్ణయం మేరకు కూటమిని సమర్థించినట్లు వెల్లడించారు. మరోవైపు డీపీసీసీ అధ్యక్ష హోదాలో పార్టీ పదవుల నియామకాలను చేపట్టేందుకు దిల్లీ ఇన్‌ఛార్జి తనను అనుమతించడం లేదని ఆరోపించారు. ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని విమర్శించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img