icon icon icon
icon icon icon

Revanth Reddy: మోదీ, అమిత్‌షా నాపై పగబట్టారు: సీఎం రేవంత్‌రెడ్డి

కేసీఆర్‌ (KCR) పదేళ్ల పాలనలో వందేళ్ల విధ్వంసం జరిగిందని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి (Revanth Reddy) అన్నారు. కోరుట్లలో నిర్వహించిన జనజాతర సభలో ఆయన మాట్లాడారు.

Updated : 01 May 2024 16:27 IST

కోరుట్ల: కేసీఆర్‌ (KCR) పదేళ్ల పాలనలో వందేళ్ల విధ్వంసం జరిగిందని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి (Revanth Reddy) అన్నారు. రాష్ట్రంలో ప్రజల అండతో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిందని చెప్పారు. ఇప్పుడు జరుగుతున్న లోక్‌సభ ఎన్నికలు గతం కంటే భిన్నమన్నారు. రిజర్వేషన్లు రద్దు చేయాలని భాజపా, ఆర్‌ఎస్‌ఎస్‌ కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. ఈ ఎన్నికల్లో 400 స్థానాల్లో గెలవాలని భాజపా చూస్తోందని.. తద్వారా దేశాన్ని అమ్మేయాలని భావిస్తోందని వ్యాఖ్యానించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా జగిత్యాల జిల్లా కోరుట్లలో నిర్వహించిన జనజాతర సభలో రేవంత్‌ మాట్లాడారు.

‘‘బలహీన వర్గాలకు దక్కాల్సిన అవకాశాలు, నిధులు రాలేదు. మైనార్టీలకు 4 శాతం రిజర్వేషన్లు కాంగ్రెస్‌ ఇచ్చింది. రిజర్వేషన్లు రద్దు చేస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఎటు వెళ్లాలి?ఈ అంశంపై నేను ప్రశ్నించా. మోదీ, అమిత్‌షా నాపై పగబట్టి దిల్లీలో కేసు పెట్టారు. ఈడీ, సీబీఐ, ఐటీతోనే కాదు.. దిల్లీ పోలీసులతో భయపెట్టాలని చూస్తున్నారు. కేసులకు రేవంత్‌ భయపడడు. చర్లపల్లి జైలుకు కేసీఆర్‌ పంపితే తిరగబడి కొట్లాడాం. మీ దగ్గర సీబీఐ, ఈడీ, పోలీసులు ఉండొచ్చు.. నా వెంట 4 కోట్ల తెలంగాణ ప్రజలున్నారు. మోదీ గుజరాత్‌ వ్యక్తిలా వచ్చి మనల్ని తిట్టారు.. శపించారు. ఐదు రోజుల్లో ఇస్తామన్న పసుపు బోర్డు ఐదేళ్లయినా ఇవ్వలేదు.

20 ఏళ్ల నుంచి ఎన్నో ఆటుపోట్లు చూశా. గుజరాత్‌ నుంచి వచ్చి తెలంగాణలో పెత్తనం చేద్దామనుకుంటున్నారు. తెలంగాణ పౌరుషానికి, గుజరాత్‌ ఆధిపత్యానికి మధ్య ఈ ఎన్నికల్లో పోటీ. ప్రెస్‌ మీట్‌ పెట్టి భాజపా కుట్రలు బయటపెడతా. రాజ్యాంగాన్ని ఎలా మార్చాలని చూస్తోందో వివరిస్తా. రాజ్యాంగం మార్పు అంశాన్ని రాష్ట్రపతి ప్రసంగంలోనే చేర్చారు. దీనికి సంబంధించిన అన్ని వివరాలు  వెల్లడిస్తా. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వేషన్లు కొనసాగించాలని చెప్పినందుకు నాపై కేసా? గుజరాత్‌ నుంచి వచ్చి నా రాష్ట్ర నడిగడ్డపై నిలబడి సీఎంను బెదిరిస్తారా? మోదీ భయపెడితే బెదరడానికి ఇక్కడెవరూ లేరు’’ అని రేవంత్‌ అన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img