icon icon icon
icon icon icon

PM Modi: బీజేడీ హయాంలోనూ దోపిడీ.. నవీన్‌ పట్నాయక్‌పై మోదీ విమర్శలు

కాంగ్రెస్‌, బీజేడీ ప్రభుత్వాలు సంపదను దోచుకుని ఒడిశాను పేద రాష్ట్రంగా మార్చాయని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు. 

Updated : 06 May 2024 15:39 IST

భువనేశ్వర్‌: పలు సందర్భాల్లో కేంద్ర ప్రభుత్వానికి మద్దతు తెలిపిన బిజూ జనతాదళ్‌పై (BJD) ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) విమర్శల బాణాలు ఎక్కుపెట్టారు. సార్వత్రిక ఎన్నికల వేళ ఈ అరుదైన పరిణామం చోటుచేసుకుంది. ఒడిశా అభివృద్ధి కాకపోవడానికి లోపాలను ఎత్తి చూపుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు. కాంగ్రెస్‌, బీజేడీ హయాంలో ఒడిశా దోపిడీకి గురైందని ఆరోపించారు.

‘‘సమృద్ధిగా నీరు, సారవంతమైన భూమి, ఖనిజాలు, సుదీర్ఘ తీరప్రాంతం, చరిత్ర, సంస్కృతి ఇలా ఎన్నింటినో భగవంతుడు ఒడిశాకు ప్రసాదించాడు. అయితే, ఒడిశా ప్రజలు ఎందుకు పేదలుగా మారుతున్నారు? ఆస్పతుల్లో వైద్యుల పోస్టులు ఖాళీగా ఎందుకున్నాయ్‌? చాలామంది చిన్నారులు పాఠశాలకు ఎందుకు దూరమవుతున్నారు?’’ అని ప్రశ్నించారు. భారత్‌కు స్వాతంత్య్రం వచ్చిన అనంతరం తొలుత కాంగ్రెస్‌.. ఆ తర్వాత బీజేడీ ఒడిశాను దోచుకున్నాయని ఆరోపించారు.

హౌస్‌ కీపర్ ఇంట్లో.. రూ. కోట్లల్లో నోట్ల గుట్టలు..!

లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బ్రహ్మపుర ఏర్పాటుచేసిన బహిరంగ సభలో పాల్గొన్న మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. దోచుకున్న సంపదతో బీజేడీలోని చిన్న నాయకులకు సైతం పెద్ద బంగ్లాలు ఉన్నాయని.. కానీ, సీఎం పట్నాయక్‌ సొంత నియోజకవర్గం హింజిలిలోని ప్రజలు మాత్రం బతుకుతెరువు కోసం ఇతర రాష్ట్రాలకు ఎందుకు వలసవెళుతున్నారని ప్రశ్నించారు. కేంద్రం ప్రతి గర్భిణీకి రూ.6 వేలు సాయం అందిస్తోందని.. ఒడిశా ప్రభుత్వం మాత్రం  ఈ పథకాన్ని నిలిపివేయడం ఆశ్చర్యంగా ఉందన్నారు.

ఒడిశా అభివృద్ధి పనుల కోసం నిధులు అందించడంలో మోదీ సర్కార్‌ ఎన్నడూ వెనకాడలేదని ప్రధాని పేర్కొన్నారు. మన్మోహన్‌ సింగ్‌ ప్రభుత్వాన్ని రిమోట్‌ కంట్రోల్ గా అభివర్ణించిన మోదీ.. ‘‘కేంద్రంలో సోనియాగాంధీ రిమోట్‌ కంట్రోల్‌ ప్రభుత్వం పదేళ్ల పాటు ఉంది. అప్పుడు మన్మోహన్‌ సింగ్‌ ప్రధానిగా ఉన్నారు. ఆ దశాబ్ద కాలంలో ఒడిశాకు రూ.లక్ష కోట్ల నిధులు వచ్చాయి. కానీ, మోదీ సర్కార్‌ మాత్రం పదేళ్లలోనే రూ.3.5 లక్షల కోట్లు ఇచ్చింది. నిధులు సమకూర్చినప్పటికీ అభివృద్ధి చేయడం లేదు’’ అని విమర్శలు గుప్పించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img