icon icon icon
icon icon icon

ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల కోటాపై ప్రతికూల ప్రభావం!

దేశ జనాభాలో హిందువుల వాటా తగ్గి, ముస్లింల శాతం పెరిగిందంటూ ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి ఇచ్చిన నివేదిక అధికార, విపక్ష నేతల మధ్య మాటల యుద్ధాన్ని రాజేసింది.

Published : 10 May 2024 05:58 IST

ముస్లిం జనాభా పెరుగుదల వేగంపై భాజపా ఆందోళన
మతచిచ్చు రాజేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని విపక్షాల ఆరోపణ

దిల్లీ: దేశ జనాభాలో హిందువుల వాటా తగ్గి, ముస్లింల శాతం పెరిగిందంటూ ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి ఇచ్చిన నివేదిక అధికార, విపక్ష నేతల మధ్య మాటల యుద్ధాన్ని రాజేసింది. ముస్లిం జనాభా పెరుగుదల వేగంపై భాజపా ఆందోళన వ్యక్తం చేసింది. అధికారంలోకి వస్తే ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించాలని కాంగ్రెస్‌ పట్టుదలతో ఉందని, ఈ నేపథ్యంలో వారి పెరుగుదల ప్రభావం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల కోటాపై ప్రతికూలంగా పనిచేసే ముప్పుందని పేర్కొంది. భాజపా జాతీయ అధికార ప్రతినిధి సుధాన్షు త్రివేది గురువారం ఈ అంశంపై మాట్లాడారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం వస్తే.. ముస్లింల జనాభా పెరిగే కొద్దీ వారికి రిజర్వేషన్లను పెంచుతూ వెళ్తుందని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌ విధానాల వల్లే దేశ జనాభాలో హిందువుల వాటా తగ్గిందని కేంద్ర మంత్రి గిరిరాజ్‌ సింగ్‌ ఆరోపించారు. ‘‘హిందువుల వాటా తగ్గుతోంది. ముస్లింల శాతం పెరుగుతోంది. దీన్నిబట్టి చూస్తుంటే.. రాబోయే రోజుల్లో భారత్‌ను ఇస్లామిక్‌ దేశంగా మార్చాలని వారు కోరుకుంటున్నట్లు కనిపిస్తోంది’’ అని ఆయన పేర్కొన్నారు.

తప్పుదోవ పట్టించడమే భాజపా ఏకైక లక్ష్యం: తేజస్వి

భాజపా విమర్శలను విపక్ష నేతలు తిప్పికొట్టారు. సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న వేళ ప్రజల మధ్య మతచిచ్చు పెట్టేందుకు భాజపా ప్రయత్నిస్తోందంటూ మండిపడ్డారు. ఎన్నికల వేళ ప్రధాని సలహా మండలి ఈ నివేదికను తీసుకురావడమేంటని సీపీఐ జాతీయ కార్యదర్శి డి.రాజా ప్రశ్నించారు. ఇలాంటి నివేదికల విషయంలో అప్రమత్తంగా ఉండాలంటూ ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రజలను తప్పుదోవ పట్టించడం, విద్వేషాలను వ్యాపింపజేయడమే కమలదళం ఏకైక లక్ష్యమని ఆర్జేడీ అగ్రనేత తేజస్వీ యాదవ్‌ విమర్శించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img