icon icon icon
icon icon icon

Telangana Elections 2023: మీది గూగుల్‌ పేనా.. ఫోన్‌ పేనా

ఎన్నికల్లో ప్రతి ఓటు కీలకమే. ఒక్క ఓటుతోనే ఓడిన, గెలిచిన సందర్భాలు అనేకమున్నాయి. అందుకే గ్రామాల నుంచి పట్టణాలకు వెళ్లి ఉద్యోగ, ఉపాధి పొందుతున్న వలస ఓటర్లపై రాజకీయ పార్టీల కన్ను పడింది.

Updated : 10 Nov 2023 10:12 IST

రానుపోనూ ఖర్చులు మావే..
వలస ఓట్లపై పార్టీల దృష్టి

ఎన్నికల్లో ప్రతి ఓటు కీలకమే. ఒక్క ఓటుతోనే ఓడిన, గెలిచిన సందర్భాలు అనేకమున్నాయి. అందుకే గ్రామాల నుంచి పట్టణాలకు వెళ్లి ఉద్యోగ, ఉపాధి పొందుతున్న వలస ఓటర్లపై రాజకీయ పార్టీల కన్ను పడింది. ఎలాగైనా వారిని గ్రామాలకు రప్పించి తమకు అనుకూలంగా ఓట్లు మలుచుకునేందుకు పార్టీల నాయకులు శ్రీకారం చుట్టారు.

కోటపల్లి (చెన్నూరు), న్యూస్‌టుడే: జిల్లాలో తమ పరిధిలో ఉన్న ఓటర్లు ఎక్కడున్నా సరే రప్పించి ఓట్లు వేయించుకుంటే తమ అభ్యర్థికి మెజార్టీ పెరుగుతుందనే కోణంలో వలస ఓట్లపై దృష్టి సారిస్తున్నారు. రానుపోనూ ఖర్చులు మావే ఆ పై రోజంతా ఖర్చు మాదేనంటూ ఫోన్లల్లో ఎరవేస్తున్నారు. ఇక్కడి బంధువులు, కుటుంబ సభ్యుల ద్వారా వారి ఫోన్‌ నెంబర్లను సేకరించి మాట్లాడటమే కాకుండా ఓటు హక్కు వినియోగించుకునేందుకు గ్రామాలకు వచ్చి తమ పార్టీ అభ్యర్థికి ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నారు. అంతే కాదండోయ్‌ పైగా ఆయా ఫోన్‌ నెంబర్లకు ఫోన్‌పే, గూగుల్‌ పే ఉందా అంటూ ఆరా తీస్తున్నారు. పార్టీల మధ్య పోటీ తీవ్రంగా ఉండటంతో ప్రతీ ఓటు ముఖ్యమైనదే కావడం వల్ల ముందే పనిలో పనిగా డబ్బులు సైతం ఫోన్‌పే ద్వారా చెల్లిస్తూ ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్నారు. ఉద్యోగ, ఉపాధి పనుల నిమిత్తం గ్రామాలకు దూరంగా ఉన్న వారికి ఫోన్‌ చేసి మామా, అన్న, బావ, అక్కా, చెల్లి అంటూ వరుసలతో పలకరిస్తూ వారిని ఆకట్టుకునే పనిలో పడ్డారు. తామే ముందుగా పలకరించి ఓటు వేయడానికి రమ్మనడంతో పాటు తీరా ఖర్చులన్నీ అందిస్తే ఆ ఓటు తమకే పక్కా పడుతుందని నాయకులు విశ్వసిస్తున్నారు. ఇదిలా ఉంటే పట్టణాలకు వలస పోయిన వారికి ఫోన్లు చేస్తూ సమాచారం అందించడం తమ గుర్తింపు కార్డుల క్రమ సంఖ్య చెప్పడం లాంటి పనులతో ద్వితీయ శ్రేణి నాయకులతో పాటు కార్యకర్తలు ఓట్ల వేటలో పడ్డారు.

  • చెల్లెమ్మ బావను ఎలాగైనా ఒప్పించి ఎన్నికల రోజున గ్రామానికి వచ్చి మా పార్టీ అభ్యర్థికి ఓటేయ్యాలి. ఇందుకోసం అయ్యే ఖర్చులు మేమే భరిస్తాం.. అంటూ కోటపల్లి మండలంలోని ఓ గ్రామానికి చెందిన ప్రధాన పార్టీకి చెందిన ద్వితీయ శ్రేణి నాయకుడు హైదరాబాద్‌లో ఉంటున్న వారిని ఫోన్లలో సంప్రదిస్తున్నారు. తమ అభ్యర్థికి ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నారు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img