icon icon icon
icon icon icon

కమల వికాసమా.. ద్రవిడ దరహాసమా!

దక్షిణాదిన పాగా వేసేందుకు చురుగ్గా పావులు కదుపుతున్న భాజపా....తమిళనాడులో సంచలన విజయాల నమోదుకు తహతహలాడుతోంది.

Updated : 16 Apr 2024 17:32 IST

విజయకేతనం ఎగురవేయాలని భాజపా...
పట్టు సడలనివ్వరాదని డీఎంకే...
కీలక స్థానాల్లో ముఖ్య నేతల హోరాహోరీ
తమిళనాట రసవత్తర పోరు
ఈనాడు,చెన్నై

దక్షిణాదిన పాగా వేసేందుకు చురుగ్గా పావులు కదుపుతున్న భాజపా....తమిళనాడులో సంచలన విజయాల నమోదుకు తహతహలాడుతోంది. ప్రధాని మోదీ ప్రజాదరణతో ప్రత్యర్థులపై సాహసోపేత పోరుకు సిద్ధమైంది. వ్యూహాలను ఆయుధంగా మలచుకుంటూ లక్ష్యసాధన కోసం విశ్వప్రయత్నం చేస్తోంది. మరోవైపు.. విపక్ష ఇండియా కూటమిలో ముఖ్య భూమిక వహిస్తున్న డీఎంకే కూడా కమలదళాన్ని రాష్ట్రంలో పాదం మోపనీయ రాదన్న సంకల్పంతో సర్వశక్తులూ ఒడ్డుతోంది. ఈ క్రమంలో రాష్ట్రంలోని పలు లోక్‌సభ స్థానాల్లో ఎన్నికల పోరు రసవత్తరంగా మారింది. జాతీయ స్థాయిలో పేరున్న పలువురు కీలక నేతలు తమిళనాడులోని వివిధ లోక్‌సభ స్థానాల్లో పోటీకి దిగడంతో రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల సమరం సర్వత్రా ఆసక్తి రేకెత్తిస్తోంది.


తమిళిసై.. మరోసారి సై

దక్షిణ చెన్నై నగరంలో డీఎంకే బలమైన పార్టీ. ఇదివరకు అన్నాడీఎంకే గట్టి పోటీ ఇచ్చేది. ఇప్పుడు భాజపా సత్తా చాటేందుకు సిద్ధమైంది. 2014 ఎన్నికల్లో మూడో స్థానానికి పరిమితమైనప్పటికీ ఈసారి గెలుస్తామనే అంచనాలతో అనూహ్యంగా మాజీ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ను కమలదళం బరిలోకి పంపింది. ఇదివరకు ఆమె అసెంబ్లీకి మూడు సార్లు, లోక్‌సభకు రెండు సార్లు పోటీచేసినా విజయం దక్కలేదు. దక్షిణ చెన్నై లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఆరు అసెంబ్లీ స్థానాల్లో ఐదుచోట్ల డీఎంకే, ఒకచోట కాంగ్రెస్‌ పాగా వేశాయి. డీఎంకే నుంచి సిట్టింగ్‌ ఎంపీ తమిళచ్చి తంగపాండియన్‌, అన్నాడీఎంకే నుంచి జె.జయవర్ధన్‌ పోటీలో ఉన్నారు.


మురుగన్‌.. విజయం వరిస్తుందా?

కేంద్ర సహాయ మంత్రిగా ఉన్న ఎల్‌.మురుగన్‌ ఇప్పుడు నీలగిరి లోక్‌సభ స్థానానికి భాజపా అభ్యర్థి. గత ఎన్నికల్లో అన్నాడీఎంకేతో కలిసి పోటీ చేసినా ఈ సీటును దక్కించుకోలేకపోయారు. అప్పట్లో ప్రస్తుత డీఎంకే అభ్యర్థి, సిట్టింగ్‌ ఎంపీ ఎ.రాజాదే పైచేయి అయ్యింది. ఈ నియోజకవర్గం పరిధిలోని 6 అసెంబ్లీ స్థానాల్లో ఊటీ (కాంగ్రెస్‌) మినహా మిగిలిన అన్నిచోట్లా అన్నాడీఎంకే ఎమ్మెల్యేలే ఉన్నారు. తమిళనాడులో భాజపా గాలి వీస్తున్నందున నీలగిరి తమదేనని మురుగన్‌ అంటున్నారు. గతంలో ఆయన మూడుసార్లు అసెంబ్లీకి పోటీచేసి ఓడారు.


టి.ఆర్‌.బాలు... గెలుపు సునాయాసమే

డీఎంకే కోశాధికారి టి.ఆర్‌.బాలు ఆరు దఫాలు ఎంపీగా గెలిచారు. మూడు సార్లు కేంద్ర మంత్రి అయ్యారు. 2014లో తంజావూరు లోక్‌సభ స్థానానికి పోటీచేసి ఓడిపోవడం మినహా అన్నిసార్లు ఆయనదే విజయం. శ్రీపెరుంబుదూరు లోక్‌సభ స్థానానికి ఆయన పోటీచేయడం ఇది మూడోసారి. అన్నాడీఎంకే నుంచి జి.ప్రేమ్‌కుమార్‌, ఎన్డీయే కూటమి నుంచి టీఎంసీ(ఎం) అభ్యర్థి వి.ఎన్‌.వేణుగోపాల్‌ బరిలో ఉన్నారు. బలమైన ప్రత్యర్థులు పోటీలో లేకపోవడం బాలుకు కలిసొచ్చే అంశం.


కార్తీకి గట్టి పోటీ

శివగంగ లోక్‌సభ స్థానాన్ని చేజిక్కించుకోవాలని రెండు దఫాలుగా భాజపా విశ్వప్రయత్నం చేస్తోంది. 2014, 2019 ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థి హెచ్‌.రాజా ఓడినప్పటికీ 8.50 శాతం మేర ఓట్లు పెంచుకోగలిగారు. ఈసారి చెన్నై వ్యాపార దిగ్గజం డి.దేవనాథన్‌ యాదవ్‌ను పోటీకి దించడం ద్వారా కాంగ్రెస్‌ అభ్యర్థి, సిట్టింగ్‌ ఎంపీ కార్తీ పి.చిదంబరానికి గట్టి సవాలు విసురుతోంది. కేంద్ర ఆర్థిక శాఖ మాజీ మంత్రి చిదంబరం తనయుడు ఆయన. వీరి కుటుంబానికి గట్టి బలం ఉండటంతోనే డీఎంకే ఈ సీటును మళ్లీ హస్తానికే ఇచ్చింది.


ఠాగూర్‌తో సినీ పోరు

తెలంగాణ, ఏపీ కాంగ్రెస్‌ రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించిన బి.మాణికం ఠాగూర్‌ విరుదునగర్‌ సిట్టింగ్‌ ఎంపీ. ఏఐసీసీలో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఆయన ఈ నియోజకవర్గం నుంచి మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఇప్పటికే 2 సార్లు (2009, 2019) ఎంపీగా గెలిచారు. ఈయనకు పోటీగా ఇద్దరు సినీ నటులు బరిలో ఉన్నారు. ‘కెప్టెన్‌’ విజయకాంత్‌ తనయుడు వి.విజయప్రభాకర్‌ డీఎండీకే నుంచి, రాధికా శరత్‌కుమార్‌ భాజపా నుంచి పోటీ చేస్తున్నారు. 2019 ఎన్నికల్లో ఎన్డీయే కూటమి మద్దతుతో డీఎండీకే పోటీ చేసి రెండోస్థానంలో నిలిచింది. డీఎండీకే ఈసారి అన్నాడీఎంకే చెంత చేరడంతో పోరు ఆసక్తిగా మారింది. విరుదునగర్‌ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని 6 అసెంబ్లీ స్థానాల్లో 2చోట్ల అన్నాడీఎంకే, 4చోట్ల డీఎంకే, కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు ఉన్నారు.


కనిమొళి.. ఖాయమేనా?

దేశ ప్రజల దృష్టిని ఆకట్టుకుంటోన్న లోక్‌సభ స్థానాల్లో తూత్తుకుడి ఒకటి. ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్‌ సోదరి కనిమొళి కరుణానిధి సిట్టింగ్‌ ఎంపీ. డీఎంకే నుంచి మళ్లీ బరిలో ఉన్నారు. ఈసారి కూడా విజయం తనదేననే ఆత్మవిశ్వాసంతో కనిపిస్తున్నారు. 2019 ఎన్నికల్లో అప్పటి భాజపా అభ్యర్థి తమిళిసై సౌందరరాజన్‌పై 3,47,209 ఓట్ల భారీ మెజారిటీతో గెలిచారు. ప్రస్తుతం కనిమొళికి పోటీగా అన్నాడీఎంకే నుంచి ఆర్‌.శివసామి వేలుమణి, ఎన్డీయే కూటమి నుంచి టీఎంసీ(ఎం) అభ్యర్థి ఎస్‌.డి.ఆర్‌.విజయశీలన్‌ పోటీ చేస్తున్నారు. శివసామి స్థానికుడు కాకపోవడం అన్నాడీఎంకేకు పెద్ద లోటుగా రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. 2021లో తూత్తుకుడి అసెంబ్లీ స్థానానికి అన్నాడీఎంకే నుంచి బరిలోకి దిగి ఓడిపోయిన విజయశీలన్‌ ఇప్పుడు ఎన్డీయే అభ్యర్థిగా పోటీలో ఉన్నారు.


పన్నీరుసెల్వం.. అటో ఇటో!

అన్నాడీఎంకే బహిష్కృత నేత, మాజీ ముఖ్యమంత్రి ఒ.పన్నీరుసెల్వం తొలిసారిగా లోక్‌సభకు రామనాథపురం స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. 2001 నుంచి 2021 వరకు అయిదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రికార్డు ఈయన సొంతం. ఈ రికార్డంతా తేని జిల్లాకు సంబంధించింది. ఇప్పుడీయన రామనాథపురం స్థానానికి కొత్త. ఓ పక్క అన్నాడీఎంకేతో వైరం, ఇంకోపక్క చాలామంది నేతలు దూరమవడం, ఇప్పుడు అన్నాడీఎంకే వదిలేసిన భాజపాతో తన ప్రయాణం.. వీటన్నింటిని ప్రజలు ఎలా స్వీకరిస్తారనేది ఈ ఎన్నికల్లో తేలనుంది. కచ్చతీవుల అంశం రామనాథపురం లోక్‌సభ స్థానం పరిధిలోనే ఉంది. అసెంబ్లీ స్థానాల్లో మొత్తం ఇండియా కూటమి ఎమ్మెల్యేలే ఉన్నారు. గత రెండు పర్యాయాలుగా ఇక్కడి ఓటర్లు ముస్లిం మైనార్టీలనే లోక్‌సభకు పంపిస్తున్నారు. ప్రస్తుత సిట్టింగ్‌ ఎంపీ ఇండియా కూటమిలోని ఐయూఎంఎల్‌కు చెందిన నవాజ్‌ కని. మళ్లీ ఆ కూటమి అభ్యర్థి ఆయనే. అన్నాడీఎంకే నుంచి జయపెరుమాళ్‌ బరిలో ఉన్నారు.


పొన్‌ రాధాకృష్ణన్‌.. పోరు యాత్ర

ఇదివరకు 6సార్లు కేంద్రమంత్రిగా, రెండు పర్యాయాలు ఎంపీగా, ఒకసారి ఎమ్మెల్యేగా చేసిన సీనియర్‌ నేత పొన్‌ రాధాకృష్ణన్‌పై ఇప్పుడు భాజపా భారీ ఆశలు పెట్టుకుంది. ఈయన కన్యాకుమారి లోక్‌సభ స్థానంలో బరిలో ఉన్నారు. ఇప్పుడు పదోసారి లోక్‌సభకు పోటీ చేస్తున్నారు. ఇక్కడ ముస్లిం, క్రిస్టియన్‌ మైనార్టీ వర్గాల ఓట్లు ప్రభావం చూపనున్నాయి. 2021 లోక్‌సభ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థి, సినీనటుడు విజయవసంత్‌ 1,37,950 ఓట్ల మెజారిటీతో గెలిచారు. అప్పుడు కూడా ప్రత్యర్థి పొన్‌ రాధాకృష్ణనే. 2014లో ఇక్కడ ఎంపీగా గెలిచిన పొన్‌ రాథాకృష్ణన్‌ 2019, 2021 ఎన్నికల్లో రెండో స్థానంలో నిలిచారు. తమిళిసై సౌందరరాజన్‌ చిన్నాన్న కుమారుడే విజయవసంత్‌ కావడంతో పోటీ రసవత్తరంగా మారింది. అన్నాడీఎంకే నుంచి నజరత్‌ పసిలియన్‌ బరిలో ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img