icon icon icon
icon icon icon

Rahul Gandhi: రాయ్‌బరేలీ నుంచి రాహుల్‌ పోటీ.. వయనాడ్‌ ప్రజలు ఏమనుకుంటున్నారంటే..?

వయనాడ్‌తోపాటు రాహుల్‌ గాంధీ రాయ్‌బరేలీ నుంచి కూడా పోటీకి దిగారు. ఈ నిర్ణయంపై వయనాడ్‌ ప్రజల స్పందన ఎలా ఉందంటే..?

Updated : 04 May 2024 18:37 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఉత్తరప్రదేశ్‌లోని కీలకమైన అమేఠీ, రాయ్‌బరేలీ నియోజకవర్గాలకు కాంగ్రెస్‌ చివరి నిమిషంలో అభ్యర్థులను ప్రకటించిన విషయం తెలిసిందే. రాయ్‌బరేలీ నుంచి అగ్రనేత రాహుల్‌గాంధీని పోటీలోకి దింపగా.. అమేఠీ నుంచి గాంధీ కుటుంబానికి అత్యంత సన్నిహితుడైన కిశోర్‌ లాల్‌ శర్మను ఎంపిక చేశారు. ప్రస్తుతం కేరళలోని వయనాడ్‌ సిటింగ్‌ ఎంపీగా ఉన్న రాహుల్‌.. అక్కడినుంచి మరోసారి పోటీ చేశారు. ఏప్రిల్‌ 26న పోలింగ్‌ పూర్తయ్యింది. రాయ్‌బరేలీ నుంచి కూడా రాహుల్‌ బరిలోకి దిగడంపై వయనాడ్‌ ప్రజల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది.

రాహుల్‌ రెండుచోట్ల పోటీ చేయడాన్ని పలువురు సమర్థిస్తుండగా.. మరికొందరు వ్యతిరేకిస్తున్నారు. ‘‘ఆయన జాతీయస్థాయి నాయకుడు. ఇండియా కూటమిలో కీలక నేత. రెండుచోట్ల పోటీ చేయడంలో ఎలాంటి తప్పు లేదు’’ అని ఒకరు అభిప్రాయం వ్యక్తంచేశారు. ఆయన రెండుచోట్ల గెలుపొందితే దేనిని వదులుకుంటారు? అని మరొకరు ప్రశ్నించారు. రెండుచోట్ల గెలిచి వయనాడ్‌ను వదులుకుంటే అది తమ నియోజకవర్గానికి మంచిది కాదని రాహుల్‌ అభిమాని ఒకరు పేర్కొన్నారు.

రాయ్‌బరేలీ నుంచి కూడా పోటీ చేయాలన్న రాహుల్‌గాంధీ నిర్ణయంలో ఎలాంటి తప్పు లేదని ఇండియన్‌ యూనియన్‌ ముస్లిం లీగ్‌ నేత పీకే కున్హాలికుట్టి సమర్థించారు. ‘రాహుల్‌ గాంధీ వయనాడ్‌తోపాటు మరో స్థానం నుంచి కూడా పోటీ చేయాలని కాంగ్రెస్‌ జాతీయ నాయకత్వాన్ని మేమే కోరాం. గతంలో ప్రధాని మోదీ రెండుచోట్ల పోటీ చేయలేదా..? ఇండియా కూటమికి ఈ నిర్ణయం ఊతమిస్తుందని మేం భావిస్తున్నాం’’ అని ఆయన పేర్కొన్నారు.

అమేఠీలో కేంద్రమంత్రి స్మృతి ఇరానీ చేతిలో 2019లో రాహుల్‌ ఓటమిపాలైన విషయం తెలిసిందే. అప్పుడు వయనాడ్‌ నుంచి ఆయన గెలిచారు. ఇక రాయ్‌బరేలీ కాంగ్రెస్‌ కంచుకోటగా కొనసాగుతోంది. 1951 నుంచి ఈ నియోజకవర్గంలో కేవలం మూడుసార్లు మాత్రమే ఆ పార్టీ అభ్యర్థులు ఓడిపోయారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ ఇక్కడి నుంచి మూడుసార్లు గెలుపొందారు. ఆమె భర్త, కాంగ్రెస్‌ నాయకుడు ఫిరోజ్‌ గాంధీ రెండుసార్లు విజయం సాధించారు. 1962, 1999 ఎన్నికల్లో మాత్రమే ఈ నియోజకవర్గం నుంచి నెహ్రూ-గాంధీ కుటుంబసభ్యులు పోటీ చేయలేదు. 2004 నుంచి సోనియాగాంధీ ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించి ఇటీవల రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఈ స్థానం నుంచి రాహుల్‌గాంధీ శుక్రవారం నామినేషన్‌ దాఖలు చేశారు. ఐదోవిడతలో భాగంగా మే 20న ఎన్నికలు జరగనున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img