icon icon icon
icon icon icon

మూడో దశ.. ములాయం కుటుంబం నుంచి ముగ్గురు.. గెలుపు వరించేనా..?

యూపీలో మూడో దశ పోలింగ్‌లో భాగంగా 10 నియోజకవర్గాలకు మే7న పోలింగ్‌ జరగనుంది.

Updated : 06 May 2024 19:31 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: లోక్‌సభ ఎన్నికల్లో 80 సీట్లు ఉన్న పెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్‌ వైపే అందరి దృష్టి. ఇక్కడ ఎక్కువ స్థానాలు గెలుచుకున్న పార్టీయే దిల్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంటుంది. ఇప్పటికే రెండు దశల్లో 16 స్థానాలకు పోలింగ్‌ ముగియగా.. తాజాగా మూడో దశలో మరో 10 సీట్లకు మే 7న పోలింగ్‌ జరగనుంది. ఈ దశలో ములాయం సింగ్‌యాదవ్‌ కుటుంబం నుంచి ముగ్గురు బరిలో ఉండటంతో ఆయా స్థానాలపై ఆసక్తి నెలకొంది.

మూడో దశలో భాగంగా యూపీలో సంభల్‌, హత్రాస్‌, ఆగ్రా, ఫతేపుర్‌ సిక్రీ, ఫిరోజాబాద్‌, మైన్‌పురీ, ఇటా, బదౌన్‌, ఓన్ల, బరేలీ నియోజకవర్గాలకు పోలింగ్‌ జరగనుంది. ఈ దశ ఎన్నికలు ములాయం కుటుంబానికి ఎంతో కీలకం. ముగ్గురు కీలక నేతలు బరిలో ఉన్నారు.

మైన్‌పురీ-డింపుల్‌ యాదవ్‌

సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్‌ యాదవ్‌ మైన్‌పురీలో 1996లో గెలిచినప్పటినుంచి ఈ నియోజకవర్గం ఆ పార్టీకి కంచుకోటగా మారింది. 2019 ఎన్నికల్లో ములాయం భాజపా అభ్యర్థిపై 94 వేలకుపైగా ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఆయన మరణానంతరం వచ్చిన ఉప ఎన్నికలో ఆయన కోడలు డింపుల్‌ యాదవ్‌ పోటీ చేసి ఘన విజయం సాధించారు. మరోసారి ఇదే స్థానం నుంచి బరిలో నిలిచారు. భాజపా అభ్యర్థి, యూపీ టూరిజం మంత్రి జైవీర్‌ సింగ్‌ ఆమెపై పోటీకి దిగారు. ఈ రెండు పార్టీల మధ్య గట్టి పోటీ నెలకొంది.

ఫిరోజాబాద్‌-అక్షయ్‌ యాదవ్‌..

ఎస్పీ ప్రధాన కార్యదర్శి రామ్‌గోపాల్‌ యాదవ్‌ కుమారుడు అక్షయ్‌ యాదవ్‌.. ఫిరోజాబాద్‌ నియోజకవర్గం నుంచి పోటీపడుతున్నారు. 2014లో ఈ నియోజకవర్గం నుంచి తొలిసారి పోటీ చేసిన అక్షయ్‌ గెలుపొందారు. 2019 ఎన్నికల్లో మాత్రం భాజపా అభ్యర్థిపై ఓటమి పాలయ్యారు. మరి ఈ సీటును ఆయన భాజపా నుంచి తిరిగి దక్కించుకుంటారా.. చూడాలి. ఇక్కడ భాజపా తరఫున విశ్వదీప్‌ సింగ్‌, మాయావతి బీఎస్పీ తరఫున చౌదరీ బషీర్‌ బరిలో ఉన్నారు. వీరి మధ్య త్రిముఖ పోరు నెలకొంది.

బదౌన్‌-ఆదిత్య యాదవ్‌

ఎస్పీ సీనియర్‌ నేత శివపాల్‌సింగ్‌ యాదవ్‌ కుమారుడు ఆదిత్య యాదవ్‌ బదౌన్‌ నుంచి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. తొలిసారి ఆయన ఎన్నికల బరిలోకి దిగారు. 1996 నుంచి ఈ నియోజకవర్గంలో ఎస్పీకి గట్టి పట్టు ఉంది. ఎంపీ సలీం ఇక్బాల్‌ ఇక్కడినుంచి నాలుగుసార్లు సమాజ్‌వాదీ పార్టీ టికెట్‌పై గెలుపొందగా.. ఒకసారి కాంగ్రెస్‌ తరఫున విజయం సాధించారు. 2019లో భాజపా నేత సంగమిత్ర మౌర్య ఇక్కడినుంచి గెలుపొందారు. ఈసారి ఆ పార్టీ దుర్విజయ్‌ సింగ్‌ శక్యాను పోటీలోకి దింపింది. ఈ లోక్‌సభ పరిధిలోని బిల్సీ అసెంబ్లీ నియోజకవర్గంలో శక్యా కమ్యూనిటీ ప్రభావం ఎక్కువగా ఉంది. ఇక్కడ భాజపా, ఎస్పీల మధ్య ద్విముఖ పోరు నెలకొనగా.. బీఎస్పీ తరఫున పోటీ చేస్తున్న ముస్లిం ఖాన్‌ ఏమేరకు ప్రభావం చూపిస్తారో చూడాలి.

ఇక ఎస్పీ అధినేత అఖిలేశ్‌ యాదవ్‌ కనౌజ్‌ నుంచి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. నాలుగో దశలో భాగంగా ఇక్కడ మే 13న పోలింగ్‌ జరగనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img