icon icon icon
icon icon icon

EC: ఓటేశారు.. ‘డైమండ్‌ రింగ్‌’ పట్టేశారు..

Lucky Draw for Voters: లోక్‌సభ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్న ఆ ఓటర్లకు బంపరాఫర్‌ తగిలింది. లక్కీ డ్రాలో కొందరు డైమండ్‌ రింగ్‌లను గెల్చుకున్నారు.

Published : 08 May 2024 16:43 IST

భోపాల్‌: లోక్‌సభ ఎన్నికల్లో ఓటింగ్‌ శాతాన్ని పెంచేందుకు మధ్యప్రదేశ్‌ (Madhya Pradesh)లో భోపాల్‌ జిల్లా ఎన్నికల అధికారులు వినూత్న కార్యక్రమం (Voter Awareness Scheme) చేపట్టారు. ఓటర్లకు లక్కీ డ్రా నిర్వహించి ఖరీదైన బహుమతులు అందజేశారు. మంగళవారం జరిగిన పోలింగ్‌లో నలుగురు ఓటర్లు ఏకంగా వజ్రాల ఉంగరాలు గెలుచుకోవడం విశేషం.

మూడో విడత ఎన్నికల్లో భాగంగా భోపాల్‌ (Bhopal) లోక్‌సభ స్థానానికి నిన్న పోలింగ్‌ జరిగింది. ఈ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్న వారికి లక్కీ డ్రా నిర్వహిస్తామని జిల్లా ఎన్నికల అధికారులు ఇటీవల ప్రకటించారు. ఓటర్లు వేలికి సిరా గుర్తు చూపించి తమ పేరు, ఫోన్‌ నంబరు వంటి వివరాలను టోకెన్‌పై రాసి లాటరీ బాక్సులో వేయాలని సూచించారు.

పట్టు కోల్పోతున్న వారసత్వం?.. కుటుంబ నియోజకవర్గాల్లో పోటీకి దూరం

ఇందుకు స్థానికుల నుంచి విశేష స్పందన లభించింది. అనేకమంది ఓటర్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. పోలింగ్‌ రోజున ఉదయం 10, మధ్యాహ్నం 2, సాయంత్రం 6 గంటలకు మూడుసార్లు డ్రా తీశారు. పోలింగ్‌ కేంద్రానికి ముగ్గురు చొప్పున విజేతలుగా ప్రకటించారు. వీరిలో మళ్లీ మెగా డ్రా నిర్వహించి నలుగురు ఓటర్ల (Lucky Voters)కు డైమెండ్‌ ఉంగరాలు అందజేశారు.

మిగతావారికి మిక్సర్లు, వాటర్‌ కూలర్లు వంటి బహుమతులు ఇచ్చారు. కన్సోలేషన్‌ కింద కొందరికి టోపీలు, వాటర్‌ బాటిళ్లు, టీషర్ట్‌ కానుకలిచ్చారు. ఓటరు అవగాహన కార్యక్రమం కింద ప్రైవేటు సంస్థలు ఇచ్చిన విరాళాలతో ఈ లక్కీ    డ్రా బహుమతులను అందజేసినట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img