icon icon icon
icon icon icon

Priyanka Gandhi: ఎన్నికలు భారత్‌లో జరుగుతుంటే.. పాకిస్థాన్‌ ప్రస్తావనెందుకు?: ప్రియాంక గాంధీ

వాస్తవ సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే ఎన్నికల ప్రచారంలో భాజపా మతాలను ప్రస్తావిస్తోందని ప్రియాంక గాంధీ ఆరోపించారు.

Published : 10 May 2024 20:15 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: లోక్‌సభ ఎన్నికలు (Lok Sabha Elections) భారత్‌లో జరుగుతుంటే.. పాకిస్థాన్‌ గురించి ఎందుకు చర్చిస్తోందని భాజపాను ఉద్దేశించి కాంగ్రెస్‌ అగ్రనేత ప్రియాంక గాంధీ (Priyanka Gandhi) ప్రశ్నించారు. సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే ప్రచారంలో మతాలను ప్రస్తావిస్తోందని ఆరోపించారు. కులమతాల ప్రాతిపదికన ఎన్నికలు జరగాలని ప్రజలు కోరుకోవడం లేదని, స్థానిక సమస్యలే ప్రధాన అజెండాగా ఉండాలన్నారు.

పాకిస్థాన్‌ను గౌరవించాలంటూ కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మణిశంకర్‌ అయ్యర్‌ గతంలో చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్‌గా మారిన వ్యవహారంపై స్పందిస్తూ.. పాత ప్రకటనపై ఇప్పుడే ఎందుకు చర్చ జరుగుతోందని ప్రశ్నించారు. ఎన్నికలు భారత్‌లో జరుగుతుంటే.. పాకిస్థాన్‌ గురించి ఎందుకు మాట్లాడుతున్నారన్నారు. నిరుద్యోగం, ధరల పెరుగుదల, రైతు సమస్యలు, కార్మికుల కష్టాలపై కమలదళం ఎందుకు చర్చించడం లేదని ఓ వార్తాసంస్థ ఇంటర్వ్యూలో ఆమె ప్రశ్నించారు.

కంచుకోటలను కాపాడుకుంటారా..! అమేఠీ, రాయ్‌బరేలీలో ప్రచారాన్ని భుజానకెత్తుకున్న ప్రియాంక

పేలవమైన పనితీరు, వాస్తవ సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే భాజపా మతాలను ప్రస్తావిస్తోందని ప్రియాంక ఆరోపించారు. ‘‘ఈ విషయంలో ప్రజలు విసిగిపోయారు. మతం ఆధారంగా భాజపా ఇప్పటికే రెండుసార్లు గెలిచిందని చెబుతున్నారు. కులమతాల ప్రాతిపదికన కాకుండా అసలైన సమస్యలపై పోరాడాలని డిమాండ్‌ చేస్తున్నారు’’ అని చెప్పారు. తమ పనితీరుపై కమలదళం ఓట్లు అడగాలన్నారు.

లోక్‌సభ ఎన్నికల అయిదో దశలో భాగంగా మే 20న యూపీలోని రాయ్‌బరేలీ, అమేఠీలలో పోలింగ్‌ నిర్వహించనున్నారు. రాయ్‌బరేలీలో రాహుల్ గాంధీ బరిలో దిగగా, అమేఠీలో భాజపా అభ్యర్థి, కేంద్రమంత్రి స్మృతి ఇరానీపై కాంగ్రెస్‌ విధేయుడు కిశోరీ లాల్‌ శర్మ పోటీ చేస్తున్నారు. హస్తం పార్టీ కంచుకోటలుగా పేరున్న ఈ స్థానాల్లో ప్రియాంకగాంధీ ప్రచార బాధ్యతలను భుజానకెత్తుకున్నారు. 24 గంటలూ ఇక్కడే ఉండి.. కార్యకర్తల్లో జోష్‌ నింపుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img