icon icon icon
icon icon icon

Priyanka Gandhi: కంచుకోటలను కాపాడుకుంటారా.. అమేఠీ, రాయ్‌బరేలీలో ప్రచారాన్ని భుజానకెత్తుకున్న ప్రియాంక

అమేఠీ, రాయ్‌బరేలీలో కాంగ్రెస్‌ అగ్రనేత ప్రియాంకా గాంధీ సుడిగాలి పర్యటనలతో దూసుకెళ్తున్నారు.

Published : 08 May 2024 14:37 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: యూపీలో అమేఠీ, రాయ్‌బరేలీ స్థానాలు కాంగ్రెస్‌కు ఎంతో కీలకం. గాంధీ కుటుంబానికి ఎంతో ప్రతిష్ఠాత్మకంగా మారిన ఈ స్థానాల్లో గెలుపు ప్రస్తుతం ఆ పార్టీకి అత్యంత అవసరం. దీంతో అగ్రనేత ప్రియాంక గాంధీ ఈ నియోజకవర్గాల్లో రంగంలోకి దిగారు. పార్టీ ప్రచార బాధ్యతలను భుజానకెత్తుకున్నారు. గత ఎన్నికల్లో కోల్పోయిన అమేఠీని తిరిగి దక్కించుకోవడం.. సోదరుడు పోటీ చేస్తున్న రాయ్‌బరేలీలో మరోసారి విజయమే లక్ష్యంగా పార్టీ శ్రేణులను సిద్ధం చేస్తున్నారు. 24 గంటలూ ఇక్కడే ఉండి.. కార్యకర్తల్లో జోష్‌ నింపుతున్నారు.

అమేఠీ, రాయ్‌బరేలీ స్థానాలకు చివరి నిమిషంలో కాంగ్రెస్‌ అభ్యర్థులను ప్రకటించిన విషయం తెలిసిందే. రాయ్‌బరేలీ నుంచి రాహుల్‌ గాంధీ పోటీ చేస్తుండగా.. అమేఠీ నుంచి పార్టీకి విధేయుడు కిశోరీ లాల్‌ శర్మ బరిలో ఉన్నారు. వీరి తరఫున ప్రచారం నిర్వహించేందుకు ప్రియాంక సోమవారం రాయ్‌బరేలీకి చేరుకున్నారు. 

ప్రియాంక ప్రచారం ఇలా..

  • రాయ్‌బరేలీలో స్థానిక కాంగ్రెస్‌ నేతలతో మారథాన్‌ సమావేశాలు నిర్వహిస్తున్నారు. ప్రచారంలో దూసుకెళ్లేలా కార్యకర్తలకు సూచనలు, సలహాలు ఇస్తున్నారు.
  • సుడిగాలి పర్యటనలకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. బుధవారం ఒక్క రోజే ఆమె తొమ్మిది సభల్లో పాల్గొననున్నారు. మే 18 వరకూ తాను ఇక్కడి నుంచి కదిలేది లేదని పార్టీ నేతలకు స్పష్టం చేశారు.
  • ‘‘ఆమేఠీ, రాయ్‌బరేలీలో మనం గట్టిగా పోరాడాలి. ఇప్పుడు మీ 24 గంటలు నావే. అవసరమైతే మిమ్మల్ని తిడతాను, పరుగెత్తిస్తాను. అయితే.. మీ వెంట బలంగా నిలబడతాను. మా ఇంటి తలుపులు మీ కోసం ఎప్పుడూ తెరిచే ఉంటాయి. ఇవి రాజ్యాంగాన్ని రక్షించే  ఎన్నికలు. భాజపా మన నుంచి రిజర్వేషన్లను లాక్కోవాలని చూస్తోంది’’ అని ఆమె పార్టీ శ్రేణులకు గీతోపదేశం చేశారు.
  • ‘దేశ ప్రయోజనాల కోసం మన పూర్వీకుల రక్తం, చెమటతో తడిసిన నేల ఇది. ఇది మనకు అత్యంత పవిత్రమైన నేల. దేశంలోని ప్రతి పౌరుడి ఆత్మగౌరవం కోసం పోరాడదాం’’ అంటూ ఉద్వేగభరిత ప్రసంగాలతో ఆమె ఆకట్టుకుంటున్నారు.
  • ఆమేఠి, రాయ్‌బరేలీకి ఐదో దశలో భాగంగా మే 20న పోలింగ్‌ జరగనుంది.

రాయ్‌బరేలీ కాంగ్రెస్‌కు కంచుకోట. 1952 తర్వాత హస్తం పార్టీ ఇక్కడ కేవలం మూడు సార్లు మాత్రమే ఓడిపోయింది. ఫిరోజ్‌గాంధీ, ఇందిరా గాంధీ ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించారు. నరేంద్ర మోదీ హవాలోనూ ఇక్కడ సోనియాగాంధీ 2014, 2019 ఎన్నికల్లో విజయం సాధించారు. అనారోగ్య కారణాలతో ఆమె రాజ్యసభకు వెళ్లిపోవడంతో.. ఈ స్థానం నుంచి రాహుల్‌గాంధీ బరిలోకి దిగారు.

ఇక పార్టీకి ఎంతో పట్టున్న అమేఠీలో 2019 ఎన్నికల్లో రాహుల్‌ గాంధీ.. కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ చేతిలో ఓడిపోయిన విషయం తెలిసిందే. అప్పుడు వయనాడ్‌ నుంచి గెలుపొందారు. ఈ సారి ఆ స్థానంతో పాటు రాయ్‌బరేలీ నుంచి కూడా పోటీ చేస్తున్నారు. ఈ రెండు స్థానాల్లో ఒకచోటు నుంచి ప్రియాంకా గాంధీ కూడా పోటీ చేస్తారని ప్రచారం జరిగినప్పటికీ.. చివరికి ఆమెను ప్రచారంలో కీలకంగా ఉపయోగించుకోవాలని పార్టీ అధిష్ఠానం నిర్ణయించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img