Published : 10 Oct 2020 01:52 IST

తినాలనే కోరికను నియంత్రించుకోవడమెలా?

బరువు తగ్గాలి.. ఎలాగైనా తగ్గాలి.. ఏదో ఒకటి చేసి వీలైనంత తొందరగా తగ్గిపోవాలి. ఇలా చాలా మంది అనుకుంటారు. వెంటనే డైట్‌ అంటూ కొన్ని రోజులు ఆహార నియమాలు పాటిస్తారు. కానీ, తినాలనే కోరికను అదుపులో పెట్టుకోలేరు. ఫలితం షరా మామూలే. ఇంకొందరు అప్పుడే తింటారు. అలా బయటకెళ్తున్నప్పుడు పొరపాటున ఏదైనా కనిపిస్తే కొని తినేస్తారు. ఆ తర్వాత మరొకటి.. ఇంకొకటి. ఎంత మానేద్దామనుకున్నా సాధ్యం కావడం లేదని చెబుతుంటారు. ఇంతకూ ఇలా అతిగా తినాలనే కోరికలు ఎందుకొస్తాయి? వాటిని నియంత్రించ వచ్చా? అంటే.. అవుననే చెబుతున్నారు పోషకాహార నిపుణులు. అయితే తొలుత మానసికంగా సిద్ధం కావాలంటున్నారు. అయినప్పటికీ తినాలనే కోరిక కలిగితే చిన్న పాటి చిట్కాలతో అధిగమించొచ్చని చెబుతున్నారు. 

కోరికలకు కూడా తీవ్రత, ప్రాధాన్యత ఉంటాయని ఓ న్యూట్రిషన్‌ సొసైటీ జరిపిన సర్వేలో వెల్లడైంది. వీటిని మెదడులోని స్ట్రియాటమ్‌ నియంత్రిస్తుందని తెలిసింది. సంతోషం, ఆనందం తదితర వ్యక్తీకరణలకు స్ట్రియాటం మూలం. అందువల్ల  అనుకున్నది సాధించినపుడు మనకు తెలియకుండానే ఆనందాన్ని వ్యక్తం చేస్తామని ఆ అధ్యయంలో తేలింది. లెఫిన్‌, గ్రెలిన్‌ తదితర హార్మోన్లలో సమతుల్యత లోపించడం వల్ల కూడా తినాలనే కోరికలు ఎక్కువగా కలుగుతాయని అధ్యయనం చెబుతోంది. గర్భిణీల్లో ఇది స్పష్టంగా కనిపిస్తుంది. ఆ సమయంలో ఎక్కువగా తినాలనిపిస్తుంది. ఇదే అలవాటు తర్వాత కూడా కొనసాగితే అధిక బరువుకు దారి తీస్తుంది. దీనిని బట్టి బరువు తగ్గాలంటే తొలుత మెదడును ఆధీనంలో ఉంచుకోవాలని గ్రహించాలి.

ఒత్తిడిని తగ్గించుకోండి

ఒత్తిడికి గురైతే శరీరం బాగా అలసిపోతుంది. ఫలితంగా ఎక్కువగా తినాలనే కోరిక పుడుతుంది. ఒత్తిడి బారిన పడకుండా ఉండాలంటే ధ్యానం చేయడం అలవాటు చేసుకోవాలి. ఎన్ని పనులున్నా ఒక్కొక్కటిగా ప్రశాంతంగా చక్కదిద్దుకుంటూ ఒత్తిడి దూరం చేసుకోవడం మంచిది. ఇలా చేస్తే హృద్రోగ సమస్యలను కూడా దూరం చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.

ఎక్కువగా నీటిని తాగండి

మన శరీరంలో ఎక్కువ శాతం నీరే ఉంటుంది. నీటి స్థాయులు తగ్గినప్పుడు మనకు వికారంగా ఉండటం, తలనొప్పిగా అనిపించడం జరుగుతుంది. మరోవైపు ఆకలికి, దాహానికి చాలా దగ్గరి పోలికలున్నాయట. మన శరీరంలో జరిగే క్రియలన్నీ మెదడు ఆధీనంలోనే జరుగుతాయని అందరికీ తెలిసిందే. అయితే శరీరంలో నీటి స్థాయిలు తగ్గినప్పుడు కూడా కొన్ని సార్లు మనకు ఆకలిగా అనిపిస్తుంది. అందుకే బాగా ఆకలిగా ఉన్నప్పుడు మంచినీరు తాగితే కాస్త ఉపశమనం లభించినట్లవుతుంది. అందువల్ల వీలైనంత వరకు ఎక్కువగా నీటిని తాగడానికి ప్రయత్నించండి. దీనివల్ల ఒత్తిడి కూడా తగ్గుతుంది.

సరిపడినంత నిద్ర

ఆరోగ్యంగా ఉండాలంటే సరిపడినంత నిద్ర చాలా అవసరం. ఇది వివిధ పరిశోధనల్లోనూ తేలింది. సరిగా నిద్ర పోకపోవడం వల్ల హార్మోన్లలో సమతుల్యత లోపిస్తుంది. వీటిని భర్తీ చేసుకోవడానికి ఎక్కువ ఆహారం తీసుకోవాలని శరీరానికి మెదడు ఆదేశాలిస్తుంది. ఫలితంగా అధికంగా తినడం ద్వారా బరువు పెరిగిపోతుంటారు. అందువల్ల రోజుకు కనీసం 7 నుంచి 8 గంటలు నిద్రపోయేలా చూసుకోండి.

పోషకాహారం తప్పనిసరి

ఈ ఉరుకుల పరుగుల జీవితంలో సరైన పోషకాహారం తీసుకోవడానికి ప్రాధాన్యత ఇవ్వడం లేదు. ఏది దొరికితే అది తింటూ మమ అనిపించుకునేవాళ్లు ఎందరో. మీకు అతిగా తినాలనిపిస్తోందంటే మీ శరీరానికి అవసరమైన ప్రోటీన్లు అందడం లేదని అర్థం. అందువల్ల మీరు తినే ఆహారంలో అవసరమైనన్ని ప్రోటీన్లు ఉండేలా జాగ్రత్త పడండి. మాంసం, చేప, గుడ్లు తీసుకోండి. శాకాహారులైతే తమ ఆహారంలో పన్నీరు, డ్రై ఫ్రూట్స్‌, తృణధాన్యాలు పదార్థాలు ఉండేలా చూసుకోవాలి.

సమయానికి తినండి

పని ఒత్తిడి, ఇతర కారణాల వల్ల కొంతమంది సమయానికి భోజనం చేయరు ఖాళీ కడుపుతో ఉంటారు. అతి ఆకలి కూడా అవసరమైన దానికంటే ఎక్కువగా తినేందుకు ప్రేరేపిస్తుంది. దీనిని నుంచి బయట పడాలంటే సమయానికి భోజనం చేయడం అలవాటు చేసుకోవాలి. దీంతో కనిపించినవన్నీ తినాలనే కోరిక చనిపోతుంది. మీరు తినే ఆహారంలోనే శరీరానికి కావాల్సిన ప్రోటీన్లు, విటమిన్లు ఉండేలా జాగ్రత్తపడండి.

-ఇంటర్నెట్‌ డెస్క్‌

Read latest General News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని