‘పత్తి కొనుగోళ్లపై ఆంక్షలు ఎత్తివేయండి’

ఆంక్షల పేరుతో పత్తి రైతులను ఇబ్బందులకు గురిచేయవద్దని తెలంగాణ వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి కేంద్రాన్ని కోరారు. ఈ మేరకు కాటన్‌ కార్పొరేషన్‌ ఆఫ్ ఇండియా (సీసీఐ) సీఎండీకి ..

Published : 29 Dec 2020 17:56 IST

సీసీఐ ఎండీకి మంత్రి నిరంజన్‌రెడ్డి లేఖ

హైదరాబాద్‌: ఆంక్షల పేరుతో పత్తి రైతులను ఇబ్బందులకు గురిచేయవద్దని తెలంగాణ వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి కేంద్రాన్ని కోరారు. ఈ మేరకు కాటన్‌ కార్పొరేషన్‌ ఆఫ్ ఇండియా (సీసీఐ) సీఎండీకి ఆయన లేఖ రాశారు. పత్తి కొనుగోలుకు ప్రస్తుతం సీజన్‌ నడుస్తున్నందున రోజువారీ గరిష్ఠ పరిమితి తొలగించి.. మార్కెట్‌కు వస్తున్న మొత్తం పత్తిని కొనుగోలు చేయాలని నిరంజన్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఇప్పుడు కీలక సమయమని.. ఆంక్షలు విధించడం వల్ల రైతులు ఆందోళన చెందుతున్నారని లేఖలో ఆయన పేర్కొన్నారు. వరంగల్‌, మహబూబ్‌నగర్ రీజియన్లలో రోజుకు 15వేల బేళ్లు, ఆదిలాబాద్ రీజియన్‌లో రోజుకు 10వేల బేళ్లు మాత్రమే కొనాలని అధికారులకు సీసీఐ ఆదేశాలిచ్చిందని, దీని వల్ల రైతులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయని మంత్రి సీఎండీ దృష్టికి తీసుకెళ్లారు. నిల్వ సామర్థ్యం లేని కొనుగోలు కేంద్రాలు ఉన్న చోట నుంచి సమీప కేంద్రాలకు రైతులను మళ్లించే విధంగా చర్యలు తీసుకుంటామని.. కొనుగోళ్లు మాత్రం పెంచాలని నిరంజన్‌రెడ్డి కోరారు. ప్రస్తుతం విధించిన ఆంక్షలను ఎత్తివేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని