భౌతిక దూరంతోనే...వైరస్‌ దూరం..!

నూతన మ్యాథమెటికల్‌‌ మోడల్‌ను అనుసరించి గాలిలో వైరస్‌ ప్రసారాన్ని అర్థం చేసుకునే ప్రయత్నంచేశారు. గాలిలో వైరస్‌ ప్రసరించినప్పటికీ.. భౌతిక దూరం ఎక్కువ ఉంటే.. వైరస్‌ ముప్పు తగ్గుతుందనే విషయాన్ని మరోసారి సాంకేతికంగా గుర్తించారు.

Published : 28 Oct 2020 22:37 IST

గాలిలో వైరస్‌ వ్యాప్తి అంచనాకు నూతన పద్ధతి

వాషింగ్టన్‌: ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్‌ కొంతవరకు గాలి ద్వారాను వ్యాపిస్తుందని అంతర్జాతీయ పరిశోధన సంస్థలు వెల్లడించిన విషయం తెలిసిందే. అయితే, గాలిలో వైరస్‌ ఎంతదూరం ప్రయాణిస్తుంది..? దాని ప్రభావమెంత? అనే అంశాలపై ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా అమెరికా శాస్త్రవేత్తలు కూడా నూతన మ్యాథమెటికల్‌‌ మోడల్‌ను అనుసరించి గాలిలో వైరస్‌ ప్రసారాన్ని అర్థం చేసుకునే ప్రయత్నంచేశారు. గాలిలో వైరస్‌ ప్రసరించినప్పటికీ.. భౌతిక దూరం ఎక్కువ ఉంటే.. వైరస్‌ ముప్పు తగ్గుతుందనే విషయాన్ని మరోసారి సాంకేతికంగా గుర్తించారు. అంతేకాకుండా, సాధారణ మాస్కుతోనూ వైరస్‌ బారినపడకుండా నివారించవచ్చని అమెరికా శాస్త్రవేత్తలు మరోసారి స్పష్టంచేశారు. తాజా పరిశోధన ఫిజిక్స్‌ ఆఫ్‌ ఫ్లూయిడ్స్‌ జర్నల్‌లో ప్రచురితమైంది.

‘భౌతిక దూరాన్ని పెంచినట్లయితే.. రక్షణ కూడా పెరుగుతుంది’ అని జాన్స్‌ హాప్కిన్స్‌ యూనివర్సిటీకి చెందిన భారత సంతతి వ్యక్తి రజత్ మిత్తల్‌ పేర్కొన్నారు. విధాన రూపకల్పనలో ఇలాంటి కొలమానం, నియమం ఎంతో దోహదపడుతుందని ఆయన స్పష్టంచేశారు. గాలిలో వైరస్‌ వ్యాప్తిపై పరిశోధనలు జరుపుతోన్న శాస్త్రవేత్తల బృందంలో ఆయన కూడా ఒకరు. అయితే, వైరస్‌ సోకినవారిలో శారీరక శ్రమ వల్ల శ్వాసక్రియ రేటు పెరగడం, తద్వారా వైరస్‌ వ్యాప్తి ఎక్కువయ్యే ప్రమాదాన్ని గుర్తించామని రజత్‌  తెలిపారు. పాఠశాలలు, జిమ్‌లు, మాల్స్‌ వంటి ప్రదేశాలు తిరిగి ప్రారంభిస్తోన్న నేపథ్యంలో వీటిని పరిగణలోకి తీసుకోవాల్సిన ఆవశ్యకతను మరోసారి గుర్తుచేశారు. అయితే, జనసాంద్రత ఎక్కువగా ఉండే ప్రదేశాల్లో ముఖ మాస్కుల ప్రభావం, వైరస్‌ ప్రసారం వంటి అంశాలపై మరింత పరిశోధన జరగాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. ఫ్లూయిడ్‌‌ డైనమిక్స్‌ భావనను అనుసరించి..గాలి ద్వారా వివిధ అంటువ్యాధులు సంక్రమించే పరిధిని శాస్త్రవేత్తలు అంచనా వేశారు. కొవిడ్‌-19తోపాటు ఫ్లూ, క్షయ, మెజిల్స్‌ వంటి శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు కూడా ఇదే తరహాలో వ్యాపిస్తాయని పేర్కొన్నారు. భౌతిక దూరం, మాస్కుల వల్ల వాటిన్నింటినుంచి సాధ్యమైనంత వరకు బయటపడవచ్చని సూచిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని