అంతర్వేదిలో దర్శనాలు నిలిపివేత

తూర్పుగోదావరి జిల్లా సఖినేటిపల్లి మండలంలోని అంతర్వేది శ్రీలక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో దర్శనాలను తాత్కాలికంగా నిలిపివేశారు.

Updated : 14 Sep 2020 16:02 IST

కాకినాడ: తూర్పుగోదావరి జిల్లా సఖినేటిపల్లి మండలంలోని అంతర్వేది శ్రీలక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో దర్శనాలను తాత్కాలికంగా నిలిపివేశారు. నేటి నుంచి 20వ తేదీ వరకు దర్శనాలు నిలిపివేస్తున్నట్లు దేవస్థానం అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. అంతర్వేది, చుట్టు పక్కల గ్రామాల్లో కరోనా వైరస్‌ వ్యాప్తి ఉద్ధృతంగా ఉన్న కారణంగా ఈ చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. స్వామివారికి నిర్వహించే నిత్య కైంకర్యాలు ఏకాంతంగా నిర్వహించనున్నట్టు తెలిపారు. దీనికి భక్తులు సహకరించాలని కోరారు.  

ఇటీవల స్వామివారి ఆలయ రథం దగ్ధమైనప్పటి నుంచి అంతర్వేదిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. నిరసన తెలిపేందుకు వస్తున్న వారిని నియంత్రించే క్రమంలో తనతో పాటు అదనపు ఎస్పీ కరణం కుమార్‌, రాజోలు సీఐ దుర్గాశేఖర్‌రెడ్డి, 10 మంది పోలీసు సిబ్బంది వైరస్‌ బారినపడ్డట్టు జిల్లా ఎస్పీ అద్నాన్‌ నయీం అస్మి ఆదివారం వెల్లడించారు. తామంతా పరీక్షలు చేయించుకోగా కరోనా పాజిటివ్‌గా తేలిందని, చికిత్స పొందుతున్నట్లు చెప్పారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 850 మంది పోలీసులకు వైరస్‌ సోకినట్లు తెలిపారు. మరోవైపు తూర్పుగోదావరి జిల్లాలో కరోనా వైరస్‌ తీవ్రత కొనసాగుతోంది. రోజుకు సగటున వెయ్యి చొప్పున కేసులు నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తోంది.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని