Andhra News: కోర్టులో చోరీపై సీబీఐ దర్యాప్తును స్వాగతిస్తున్నాం: ఏపీ మంత్రి కాకాణి

నెల్లూరు కోర్టులో చోరీ ఘటనపై కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగిస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేయడాన్ని స్వాగతిస్తున్నామని ఏపీ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి తెలిపారు. ఈమేరకు నెల్లూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

Published : 24 Nov 2022 17:58 IST

నెల్లూరు: నెల్లూరు కోర్టులో చోరీ ఘటనపై కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగిస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేయడాన్ని స్వాగతిస్తున్నామని ఏపీ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి తెలిపారు. గురువారం నెల్లూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... నీతి, నిజాయితీ ఉంది కాబట్టే సీబీఐ విచారణకు అభ్యంతరం లేదని తెలిపామన్నారు. సీబీఐ విచారణతో వాస్తవాలు వెలుగులోకి వస్తాయని, విమర్శించే తెదేపా నేతల నోర్లు మూతపడతాయన్నారు. ప్రజా జీవితంలో ఉన్నవాళ్లు సత్యంగా ఉండాలి, అందుకే సీబీఐ విచారణకు అభ్యంతరం తెలపలేదన్నారు. చంద్రబాబు మాదిరిగా భయపడి పారిపోమని, ఏ తప్పూ చేయలేదు కాబట్టే ధైర్యంగా హైకోర్టు నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామన్నారు. 

వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి నిందితుడిగా ఉన్న కేసు ఆధారాలు నెల్లూరు నాలుగో అదనపు జూనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టులో చోరీకి గురైన విషయం తెలిసిందే.
ఈ చోరీ ఘటనపై కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగిస్తూ హైకోర్టు ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది. నెల్లూరు కోర్టులో చోరీ జరిగిన కేసులో వాస్తవాలు బయటకు రావాలంటే స్వతంత్ర సంస్థతో దర్యాప్తు జరిపించాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి హైకోర్టుకు ఇచ్చిన నివేదికలో కోరారు. దీనిపై ప్రభుత్వ తరఫు న్యాయవాదిని ప్రశ్నించగా.. సీబీఐ విచారణకు ఆదేశిస్తే రాష్ట్ర ప్రభుత్వానికి అభ్యంతరం లేదని తెలిపారు. హైకోర్టు ఆదేశాలతో ఇదే విషయాన్ని అఫిడవిట్‌ రూపంలో ఇవ్వటంతో తీర్పును రిజర్వు చేసి.. ఇవాళ ధర్మాసనం తీర్పు వెల్లడించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని