APNGO: ఇప్పటి వరకు మౌనంగా ఉన్నాం.. ఇక సహించేది లేదు ఖబడ్దార్‌: బండి శ్రీనివాస్‌

ఉద్యోగుల సమస్యలపై కొన్ని సంఘాలు గవర్నర్‌ను కలిసి ఫిర్యాదు చేయడాన్ని ఏపీ ఎన్జీవో అధ్యక్షుడు బండి శ్రీనివాస్‌ తప్పుబట్టారు. ఉద్యోగ సంఘాలు నిబంధనలు పాటించాలని, అలా చేయకపోతే గుర్తింపు రద్దు చేసే అధికారం ప్రభుత్వానికి ఉంటుందన్న సంగతి గుర్తుంచుకోవాలన్నారు.  

Published : 19 Jan 2023 16:32 IST

అమరావతి: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంక్రాంతికి ఇవ్వాల్సిన డీఏను వెంటనే చెల్లించేందుకు చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి జగన్‌ స్పష్టం చేశారని ఏపీఎన్జీవో  అధ్యక్షుడు బండి శ్రీనివాస్‌ తెలిపారు. వరుసగా 3 రోజులు సంక్రాంతి సెలవులు రావడం వల్ల సర్క్యులర్‌ ఇవ్వడంలో జాప్యం జరిగినట్టు సీఎంవో అధికారులు చెప్పారన్నారు.  తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రిని.. నూతనంగా ఎన్నికైన ఏపీ ఎన్జీవో అధ్యక్షుడు, కార్యవర్గ సభ్యులు కలిశారు. కార్యవర్గ సభ్యులను అధ్యక్షుడు బండి శ్రీనివాస్‌ పరిచయం చేశారు. సంక్రాంతి పండుగకు డీఏ ఇస్తామని చెప్పిన హామీని గుర్తు చేయగా.. వెంటనే చెల్లించేలా చర్యలు తీసుకుంటామని సీఎం హామీ ఇచ్చినట్టు తెలిపారు. ఉద్యోగుల సమస్యలపై కొన్ని సంఘాలు గవర్నర్‌ను కలిసి ఫిర్యాదు చేయడాన్ని బండి శ్రీనివాస్‌ తప్పుబట్టారు. 

ఉద్యోగ సంఘాలు నిబంధనలు పాటించాలని, అలా చేయకపోతే గుర్తింపు రద్దు చేసే అధికారం ప్రభుత్వానికి ఉంటుందన్న సంగతి గుర్తుంచుకోవాలన్నారు. ఏపీ ఎన్జీవోలు సీఎం మెప్పుకోసం పనిచేస్తున్నారని ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నేత సూర్యనారాయణ చేసిన ఆరోపణలపై మండిపడ్డారు. తాము ప్రభుత్వ దయాదాక్షిణ్యాలతో పీఆర్సీ తెచ్చుకోలేదని, ఉద్యోగుల తరఫున పోరాటం చేసి సాధించామన్న విషయం తెలుసుకోవాన్నారు. సమస్యలపై పోరాటం చేయలేకే ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నేతలు గవర్నర్‌ను కలిసి ఫిర్యాదు చేశారన్నారు. సూర్యనారాయణ వెనుక ఏ శక్తి ఉండి పనిచేయిస్తుందో ఉద్యోగులు అంతా గమనిస్తున్నారని బండి వ్యాఖ్యానించారు. ఇప్పటి వరకు ఏం చేసినా మౌనంగా ఉన్నామని, ఇలాగే వ్యవహరిస్తే సహించేది లేదని.. ఖబడ్దార్‌ అంటూ హెచ్చరించారు. ప్రభుత్వ ఉద్యోగుల సంఘానికి గుర్తింపును సూర్యనారాయణ దొంగచాటుగా తెచ్చుకున్నారన్న బండి.. డిపార్ట్‌మెంట్‌లో సూర్యనారాయణ చేసిన అక్రమాలు చాలా ఉన్నాయన్నారు. అన్ని సమస్యలను పరిష్కరిస్తామని సీఎం హామీ ఇచ్చారని, ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే ఉద్యమానికి వెళ్లేందుకూ తాము సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు. తమను బఫూన్‌లు అంటున్న వారు పీఆర్సీ పోరాట సమయంలో శ్రీకాకుళం ఎందుకు పారిపోయారని ఏపీ ఎన్జీవో కార్యదర్శి శివారెడ్డి మండిపడ్డారు. ఏపీ ఎన్జీవో సంఘాన్ని హేళన చేసేలా ప్రభుత్వ ఉద్యోగుల సంఘం వ్యవహరించడం సరికాదని హితవు పలికారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని