CBI: నకిలీ మెడికల్‌ సర్టిఫికెట్ల స్కామ్‌.. తెలుగు రాష్ట్రాలు సహా 91 చోట్ల సీబీఐ సోదాలు

నకిలీ మెడికల్‌ సర్టిఫికెట్ల స్కామ్‌కు సంబంధించి ఏపీ, తెలంగాణ సహా దేశంలోని 91 చోట్ల గురువారం సీబీఐ అధికారులు సోదాలు నిర్వహించారు. నకిలీ సర్టిఫికెట్లు పొందిన వారి ఇళ్లతో పాటు మెడికల్‌ కౌన్సిల్‌ కార్యాలయాల్లో సోదాలు జరిపి కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు.

Updated : 29 Dec 2022 17:58 IST

హైదరాబాద్‌: నకిలీ మెడికల్‌ సర్టిఫికెట్లు, రిజిస్ట్రేషన్‌ నంబర్ల వ్యవహారంలో దేశ వ్యాప్తంగా 91 చోట్ల సీబీఐ సోదాలు నిర్వహించింది. విదేశాల్లో ఎంబీబీఎస్‌ చదివి మెడికల్‌ కౌన్సిల్‌ ఆఫ్ ఇండియా నిర్వహించే ఫారెన్‌ మెడికల్‌ గ్రాడ్యుయేట్‌ పరీక్షలో ఫెయిల్‌ అయిన 73 మంది విద్యార్థులు సర్టిఫికెట్లు పొందారు. పలు స్టేట్‌ మెడికల్‌ కౌన్సిల్‌లో నకిలీ రిజిస్ట్రేషన్‌ నంబర్లతో ఈ సర్టిఫికెట్లు పొందినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ గుర్తించింది. 

దీనిపై కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి సునీల్‌ గుప్తా ఫిర్యాదుతో 420, 467, 468, 471 సహా పలు సెక్షన్ల కింద ఈనెల 21న సీబీఐ కేసు నమోదు చేసింది. తెలంగాణకు చెందిన ముగ్గురు, ఏపీకి చెందిన ఇద్దరు ఫారెన్‌ గ్రాడ్యుయేట్లను సైతం ఎఫ్‌ఐఆర్‌లో చేర్చింది. బిహార్‌ మెడికల్‌ కౌన్సిల్‌ నుంచి రిజిస్ట్రేషన్‌ నంబర్‌ సర్టిఫికెట్‌ పొందిన వరంగల్‌ కాజీపేటకు చెందిన గుడిమళ్ళ రాకేష్ కుమార్, తెలంగాణ మెడికల్ కౌన్సిల్ నుంచి రిజిస్ట్రేషన్ నంబర్ పొందిన చేవెళ్ళకు చెందిన సితాలె శ్రీనివాసరావు, రాజస్థాన్ మెడికల్ కౌన్సిల్ నుంచి రిజిస్ట్రేషన్ నంబర్ పొందిన బాగ్‌ లింగంపల్లికి చెందిన బొమ్మిరెడ్డి హరికృష్ణారెడ్డి, బిహార్ మెడికల్ కౌన్సిల్ నుంచి నకిలీ సర్టిఫికెట్ పొందిన విశాఖపట్నంకు చెందిన గొర్ల వెంకట్ రాజా వంశీ, విజయవాడ కొత్త పేటకు చెందిన మారుపిళ్ల శరత్ బాబును ఎఫ్‌ఐఆర్‌లో చేర్చారు. నకిలీ సర్టిఫికెట్లు పొందిన వారి ఇళ్లలో, జారీ చేసిన ఆయా మెడికల్ కౌన్సిల్‌లో సీబీఐ అధికారులు సోదాలు నిర్వహించారు. సోదాలు చేసి పలు కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా మొత్తం దేశ వ్యాప్తంగా 15 మెడికల్ కౌన్సిళ్ల పేర్లను సీబీఐ ఎఫ్‌ఐఆర్‌లో పొందుపరిచింది. అర్హత లేకున్నా నకిలీ మెడికల్ కౌన్సిళ్ల సర్టిఫికెట్లు పొందిన విద్యార్థులు ఇప్పటికే దేశవ్యాప్తంగా పలు ఆస్పత్రుల్లో వైద్య సేవలు అందిస్తున్నట్లు సీబీఐ గుర్తించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని