మీడియాపై దాడి ప్రజాస్వామ్యానికి విఘాతం: సిటిజన్స్‌ ఫర్‌ డెమోక్రసీ

రాష్ట్రంలో పాత్రికేయులు, మీడియా సంస్థలపై జరుగుతున్న వరుస దాడుల పట్ల సిటిజన్స్‌ ఫర్‌ డెమోక్రసీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. 

Published : 21 Feb 2024 20:39 IST

విజయవాడ: రాష్ట్రంలో పాత్రికేయులు, మీడియా సంస్థలపై జరుగుతున్న వరుస దాడుల పట్ల సిటిజన్స్‌ ఫర్‌ డెమోక్రసీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. దాడులను తీవ్రంగా ఖండిస్తున్నట్టు పేర్కొంది. ఈ మేరకు సంస్థ ఛైర్మన్, హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ జి.భవానీ ప్రసాద్‌, ఉపాధ్యక్షుడు, మాజీ సీఎస్‌ ఎల్‌వీ సుబ్రహ్మణ్యం, సంస్థ ప్రధాన కార్యదర్శి, పూర్వ ఎన్నికల ప్రధానాధికారి నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు.

‘‘పాత్రికేయులపై ఉద్దేశపూర్వక దాడులు, మీడియా సంస్థల కార్యాలయాల విధ్వంసం వంటి చర్యలు.. ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం. మీడియా స్వేచ్ఛను అణచివేయడానికి జరిగే ప్రయత్నాలు గర్హనీయం. చరిత్రలో ఇలాంటివి ఎన్నడూ విజయవంతం కాలేదు. దాడులకు పాల్పడిన దుండగులు ఏ రాజకీయ పార్టీకి చెందిన వారైనా వెంటనే అరెస్టు చేయాలి. దురాగతాలకు తగిన మూల్యం చెల్లించే విధంగా గట్టి చర్యలు తీసుకోవాలి. నిష్పాక్షిక స్వేచ్ఛాయుత ఎన్నికలకు దేశం సిద్ధమవుతున్న కీలక తరుణంలో.. చట్టబద్ధ పాలనకు భంగం కలిగించే ఎలాంటి చర్యలను అనుమతించకూడదు. మీడియా స్వేచ్ఛకు పౌరసమాజం అండగా నిలవాలి’’ అని విజ్ఞప్తి చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని