Citizens for Democracy: ప్రజలు ఉదాసీనంగా ఉన్నంత కాలం నిబంధనలు అమలు కావు: జస్టిస్‌ చలమేశ్వర్‌

ప్రజలు ఉదాసీనంగా ఉన్నంత కాలం ఎన్ని నిబంధనలు ఉన్నా అమలు కావని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ జాస్తి చలమేశ్వర్‌ అన్నారు. 

Updated : 27 Mar 2024 15:51 IST

విజయవాడ: ప్రజలు ఉదాసీనంగా ఉన్నంత కాలం ఎన్ని నిబంధనలు ఉన్నా అమలు కావని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ జాస్తి చలమేశ్వర్‌ అన్నారు. సిటిజన్స్‌ ఫర్‌ డెమోక్రసీ ఆధ్వర్యంలో విజయవాడలో జరిగిన రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఎమ్మెల్యే, ఎంపీగా ఎన్నిక కావాలంటే రూ.కోట్లు ఖర్చు పెట్టే పరిస్థితి వచ్చిందన్నారు. ప్రజాస్వామ్యం బతకాలంటే ముందు ప్రజల్లో చైతన్యం రావాలన్నారు. సరిదిద్దుకోకపోతే.. మనకు మంచి భవిష్యత్తు ఉండదన్నారు. వ్యక్తిగత స్వలాభం.. వ్యవస్థలకు చేటు తెస్తుందన్నారు. న్యాయం, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాలని.. లేదంటే ఆ దుష్పలితాలను తప్పకుండా ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు.

స్వాతంత్ర్యం తరువాత ప్రజల మంచికోసం రాజ్యాంగం రాశారని, మారుతున్న సమాజంతో పాటు కొన్ని మార్పులు అనివార్యమన్నారు. కానీ, మూల విధానాలు, నిబంధనలు అలాగే ఉంటాయన్నారు. తన అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ మీడియా సమావేశం పెడితే.. సోషల్‌ మీడియాలో తెగ ట్రోల్‌ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.  తనను మెచ్చుకున్నోళ్లు.. తిట్టినోళ్లు ఉన్నారని, విమర్శలు తీసుకున్నోళ్లే ప్రజాస్వామ్య వాది అని పేర్కొన్నారు. 

సిటిజన్స్‌ ఫర్‌ డెమోక్రసీ కార్యదర్శి నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ మాట్లాడుతూ.. స్వేచ్ఛగా ఎన్నికలు జరగడం ఇప్పుడు చాలా ముఖ్యమన్నారు. జస్టిస్‌ చలమేశ్వర్‌ వంటి వారు ఓటు హక్కు, స్వేచ్ఛకు సంబంధించి గతంలో తీర్పులు వెలువరించారని గుర్తు చేశారు. తన  పోరాటం ద్వారా, చలమేశ్వర్ తీర్పు ఆధారంగా మూడేళ్ల తరువాత తనకు ఇక్కడ ఓటు హక్కు వచ్చిందని గుర్తుచేసుకున్నారు.  ప్రభుత్వ అధికారులు నిబద్ధతతో పని చేయకుంటే ఇబ్బందులు పడతారని హెచ్చరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని