e-Garuda: హైదరాబాద్-విజయవాడ మార్గంలో 20 నిమిషాలకో ఎలక్ట్రిక్‌ ఏసీ బస్సు

హైదరాబాద్‌-విజయవాడ మార్గంలో 50 ఎలక్ట్రిక్‌ ఏసీ బస్సులను నడపాలని టీఎస్‌ఆర్టీసీ నిర్ణయించింది. తొలి విడతగా 10 బస్సులను మంగళవారం మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ ప్రారంభించనున్నారు.

Updated : 15 May 2023 16:53 IST

హైదరాబాద్‌: పర్యావరణ హితమైన ఎలక్ట్రిక్‌ ఏసీ బస్సులు ప్రయాణికులకు అందుబాటులోకి రానున్నాయి. హైదరాబాద్- విజయవాడ మార్గంలో 50 ఎలక్ట్రిక్‌ ఏసీ బస్సులను నడపాలని టీఎస్‌ఆర్టీసీ నిర్ణయించింది. వాటిలో 10 బస్సులను మంగళవారం నుంచి అందుబాటులోకి తీసుకురానుంది. మిగతా బస్సులను విడతలవారీగా ఈ ఏడాది చివరినాటికి అందుబాటులోకి తీసుకొస్తారు. అత్యున్నత నాణ్యత ప్రమాణాలు, హైటెక్‌ హంగులతో అందుబాటులోకి తీసుకొస్తున్న ఈ కొత్త ఎలక్ట్రిక్‌ బస్సులకు ఈ-గరుడగా నామకరణం చేసినట్లు టీఎస్‌ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ వెల్లడించారు. మంగళవారం మియాపూర్‌లోని బస్‌పాయింట్‌ వద్ద ఈ- గరుడ బస్సులను మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ ప్రారంభించనున్నారు.

హైదరాబాద్-విజయవాడ మార్గంలో ప్రతి 20 నిమిషాలకో ఎలక్ట్రిక్ ఏసీ బస్సు నడిపేలా ప్రణాళిక రూపొందించినట్లు టీఎస్‌ఆర్టీసీ వెల్లడించింది. రాబోయే రెండేళ్లలో కొత్తగా 1,860 ఎలక్ట్రిక్ బస్సులను కొనుగోలు చేయనున్నట్లు తెలిపింది. వాటిలో 1,300 బస్సులను హైదరాబాద్ సిటీలో, 550 బస్సులను సుదూర ప్రాంతాలకు నడుపుతామని పేర్కొంది. దీంతోపాటు హైదరాబాద్‌లో 10 డబుల్ డెక్కర్ బస్సులను ప్రారంభిస్తామని వివరించింది. 

ఈ-గరుడ బస్సు పొడవు 12 మీటర్లు. ప్రయాణికులకు మెరుగైన, నాణ్యమైన సేవలను అందించే విధంగా అన్ని సౌకర్యాలు కల్పించారు. 41 సీట్ల సామర్థ్యం గల ఈ బస్సుల్లో ప్రతి సీటు వద్ద మొబైల్ ఛార్జింగ్ సౌకర్యంతో పాటు రీడింగ్‌ ల్యాంప్‌లను ఏర్పాటు చేశారు. ప్రయాణికుల భద్రత దృష్ట్యా వెహికిల్‌ ట్రాకింగ్‌ సిస్టంతో పాటు ప్రతి సీటు వద్ద పానిక్‌ బటన్‌ సదుపాయం కల్పించారు. వాటిని టీఎస్‌ఆర్టీసీ కంట్రోల్‌ రూమ్‌కు అనుసంధానం చేశారు. ప్రతి బస్సులోనూ మూడు సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు. వాటికి ఒక నెల రికార్డింగ్‌ బ్యాకప్‌ ఉంటుంది. బస్సులోని ప్రయాణికులను లెక్కించే ఆటోమెటిక్ ప్యాసింజర్ కౌంటర్ (ఏపీసీ) కెమెరాను ఏర్పాటు చేశారు.

బస్సు రివర్స్‌ చేసేందుకు వీలుగా రివర్స్‌ పార్కింగ్‌ అసిస్టెన్స్‌ కెమెరా ఉంటుంది. బస్సుకు ముందు వెనక ఎల్ఈడీ బోర్డులుంటాయి. అందులో గమ్యస్థానాల వివరాలు కనిపిప్తాయి. అగ్నిప్రమాదాలను ముందుగానే గుర్తించి నివారించేందుకు బస్సుల్లో ఫైర్‌ డిటెక్షన్‌ సప్రెషన్‌ సిస్టం (ఎఫ్‌డీఎస్‌ఎస్‌)ను ఏర్పాటు చేశారు. ప్రయాణికులకు సమాచారం చేరవేసేందుకు వీలుగా పబ్లిక్‌ అడ్రస్‌ సిస్టం బస్సుల్లో ఉంటుంది. ఈ బస్సులకు ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 325 కిలోమీటర్ల దూరం వరకు ప్రయాణించవచ్చని అధికారులు తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని