Telangana News: తెలంగాణలో విద్యుత్‌ ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమల్లోకి

డిస్కమ్‌లు ఐదేళ్ల విద్యుత్‌ టారిఫ్‌ ప్రతిపాదనలు కమిషన్‌ ముందుంచాయని, దీనిపై వినియోగదారుల అభిప్రాయాలను కమిషన్‌ పరిగణనలోకి తీసుకుందని

Updated : 23 Mar 2022 18:42 IST

హైదరాబాద్‌: డిస్కమ్‌లు ఐదేళ్ల విద్యుత్‌ టారిఫ్‌ ప్రతిపాదనలు కమిషన్‌ ముందుంచాయని, దీనిపై వినియోగదారుల అభిప్రాయాలను కమిషన్‌ పరిగణనలోకి తీసుకుందని రాష్ట్ర విద్యుత్‌ నియంత్రణ మండలి(ఈఆర్సీ) ఛైర్మన్‌ టి.శ్రీరంగారావు తెలిపారు. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన  మీడియా సమావేశంలో ఈఆర్సీ ఛైర్మన్‌ వివరాలు వెల్లడించారు. ‘‘2022-23 ఏడాదికి డిస్కమ్‌లు ప్రతిపాదించిన రెవెన్యూ గ్యాప్‌ రూ.16వేల కోట్లు. కానీ, రూ.14,237 కోట్ల రెవెన్యూ గ్యాప్‌ను కమిషన్‌ ఆమోదించింది. రెవెన్యూ అవసరాలు రూ.53వేల కోట్లుగా ఏఆర్‌ఆర్‌ ప్రతిపాదన. ఏఆర్‌ఆర్‌ ప్రతిపాదనలకు కమిషన్‌ రూ.48,708 కోట్లు ఆమోదించింది. గృహ వినియోగదారులకు యూనిట్‌కు 50 పైసలు, పరిశ్రమలకు యూనిట్‌పై రూపాయి పెంపు. పెరిగిన విద్యుత్‌ ఛార్జీలు ఏప్రిల్‌ ఒకటి నుంచి అమల్లోకి రానున్నాయి’’ అని ఈఆర్సీ ఛైర్మన్‌ తెలిపారు. గతంలో కంటే 38.38శాతం అధికంగా ప్రతిపాదన వచ్చిందన్న శ్రీరంగారావు... వ్యవసాయానికి, సెలూన్లకు విద్యుత్‌ టారిఫ్‌ పెంచలేదని స్పష్టం చేశారు. ఈవీ ఛార్జింగ్‌కు టారిఫ్‌ ప్రతిపాదనలు ఆమోదించలేదని, డిస్కమ్‌లు నవంబరు 30లోపు ప్రతిపాదనలు కమిషన్‌ ముందుంచాలని ఆదేశించినట్టు వెల్లడించారు. జీడిమెట్ల స్మార్ట్‌గ్రిడ్‌ పూర్తి స్థాయిలో విస్తరించాలని సూచించామని తెలిపారు.

కేటగిరీల వారీగా విద్యుత్‌ ఛార్జీల పెంపు ఇలా...

* ఎల్‌టీ-1బీ(2)లో 301 నుంచి 400 వరకు రూ.8.50 నుంచి రూ.9కుపెంపు

* ఎల్‌టీ-1బీ(2)లో 401 నుంచి 800 యూనిట్ల వరకు రూ.9 నుంచి రూ.9.50కి పెంపు

* ఎల్‌టీ 1 -బీ(2)లో 800 యూనిట్లకు పైగా రూ.9.50 నుంచి రూ.10కి పెంపు

* ఎల్‌టీ-2లో 500 యూనిట్లకు పైగా రూ.10 నుంచి రూ.11కు పెంపు

* ఎల్‌టీ-2ఏలో 50 యూనిట్ల వరకు రూ.6 నుంచి రూ.7కు పెంపు

* ఎల్‌టీ-2బీలో 100 యూనిట్ల వరకు రూ.7.50 నుంచి రూ.8.50కు పెంపు

* ఎల్‌టీ-2బీలో 101 నుంచి 300 యూనిట్ల వరకు రూ.8.90 నుంచి రూ.9.90కు పెంపు

* ఎల్‌టీ-2 బీలో 301 నుంచి 500యూనిట్ల వరకు రూ.9.40 నుంచి రూ.10.40కు పెంపు

* ఎల్‌టీ-2బీలో 500 యూనిట్లకుపైగా రూ.10 నుంచి రూ.11కు పెంపు

* ఎల్‌టీ-2సీ విభాగంలో యూనిట్‌ ధర రూ.12 నుంచి రూ.13కు పెంపు

* ఎల్‌టీ-1ఏలో 50 యూనిట్ల వరకు రూ.1.40 నుంచి రూ.1.95కు పెంపు

* ఎల్‌టీ-1బీలో 101 నుంచి 200 యూనిట్ల వరకు రూ.4.30 నుంచి రూ.4.80కు పెంపు

* ఎల్‌టీ-1బీ(2)లో 200 యూనిట్ల వరకు రూ.5 నుంచి రూ.5.10కు పెంపు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని