ఆటో డ్రైవర్‌కు 38ఎకరాలు..

అమలాపురానికి చెందిన వాసంశెట్టి వెంకటరమణ, వెంకటలక్ష్మి పాతికేళ్ల క్రితం వివాహం చేసుకున్నారు. పొట్ట చేత పట్టుకుని వేపగుంటకు వచ్చేశారు. అద్దె ఇంట్లో నివసిస్తున్నారు. వీరికి కుమార్తె నవ్యశ్రీ, కుమారుడు మణికంఠ ఉన్నారు. కుమార్తె డిగ్రీ, కుమారుడు పదో తరగతి చదువుతున్నాడు.

Updated : 05 Jan 2020 10:27 IST


వేపగుంట రామాలయం వీధిలో అద్దె ఇంటి వద్ద అమ్మఒడి అనర్హత పత్రాలు చూపుతున్న వెంకటలక్ష్మి

 

వేపగుంట, పెదవాల్తేరు: అమలాపురానికి చెందిన వాసంశెట్టి వెంకటరమణ, వెంకటలక్ష్మి పాతికేళ్ల క్రితం వివాహం చేసుకున్నారు. పొట్ట చేత పట్టుకుని వేపగుంటకు వచ్చేశారు. అద్దె ఇంట్లో నివసిస్తున్నారు. వీరికి కుమార్తె నవ్యశ్రీ, కుమారుడు మణికంఠ ఉన్నారు. కుమార్తె డిగ్రీ, కుమారుడు పదో తరగతి చదువుతున్నాడు. వెంకటరమణ ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఇటీవల అమ్మఒడి, ఆరోగ్యశ్రీ, గృహనిర్మాణ పథకాలకు వాలంటీరు ద్వారా దరఖాస్తు చేసుకున్నారు. అర్హుల జాబితా పరిశీలనలో విస్తుపోయే వివరాలు కనిపించాయి. ఆ కుటుంబానికి మెట్ట 37.7 ఎకరాలు, మగాణి 0.49 ఎకరాలు ఉన్నట్టు నమోదై ఉంది.

● ఆరోగ్యశ్రీ, గృహ నిర్మాణాల విషయంలో పరిశీలిస్తే.. 5 ఎకరాల పొలం ఉన్నట్టు కనిపించింది. దీంతో ఆ కుటుంబం విద్యాశాఖ, రెవెన్యూ, ఆరోగ్యశాఖ అధికారుల చుట్టూ నాలుగు రోజులుగా తిరుగుతున్నా స్పందించలేదు. చివరకు వీఆర్వో నిర్మల వెళ్లి తమకు భూమి లేదని ధ్రువీకరణ పత్రం రాసి ఇచ్చారు. ఆ పత్రాన్ని పట్టుకుని కుమారుడు చదువుతున్న పాఠశాలకు వెళ్లి అందజేశారు. ఉపాధ్యాయులు తహసీల్దారు ధ్రువీకరణ పత్రం ఉండాలని చెప్పారు. తీసుకురాలేదని చెప్పడంతో వీఆర్వో ఇచ్చిన ధ్రువీకరణ పత్రాన్ని తీసుకున్నారు. అధికారులు తమకు జరిగిన అన్యాయాన్ని గుర్తించి అర్హులు చేయాలని ఆ కుటుంబం వేడుకుంటోంది.

అంతేకాదు.. రేషన్‌కార్డు సమస్యతో అమ్మఒడికి దూరమైన లబ్ధిదారులంతా శనివారం కలెక్టరేట్‌లో పౌరసరఫరాల శాఖ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. రేషన్‌కార్డులు లేకపోవడం వల్ల పథకానికి దూరమవుతున్నామని, కొత్తరేషన్‌ కార్డులు ఇవ్వాలని డిమాండు చేశారు. కొత్తవి ఇవ్వడానికి ఇపుడు సాధ్యం కాదని అధికారులు చెప్పగా జేసీ శివశంకర్‌ వద్దకు వెళ్లి మొరపెట్టుకున్నారు. సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పథకానికి అర్హులైన వారికి పత్రాలు జారీ చేసి ఇవ్వమని చెప్పడంతో వివాదం సద్దుమణిగింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని