
దుర్గమ్మ సన్నిధిలో.. ఏమి జరుగుతోంది
ముక్కల చీరలతో భక్తులకు టోకరా..!
దుర్గమ్మను దర్శించుకునేందుకు రాష్ట్రంతోపాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తారు. వారిలో ఎక్కువ మంది అమ్మ వారికి చీరలను మొక్కుల రూపంలో అందజేస్తారు. వాటిని వారు అక్కడే కొనుగోలు చేస్తారు. అయితే వ్యాపారులు ముక్కల చీరలను లోపలి పెట్టి అందంగా ప్యాక్ చేసి భక్తులకు టోకరా వేసి సొమ్ము చేసుకుంటున్నారు. మళ్లీ దేవాలయ సిబ్బంది కొందరు ఆ చీరలనే తిరిగి వ్యాపారులకు చేర్చుతూ (రీసైక్లింగ్) వారూ జేబులు నింపుకుంటున్నారు. దీనిపై ప్రత్యేక కథనం.
ఇంద్రకీలాద్రి, న్యూస్‌టుడే
ఇంద్రకీలాద్రిపై కొలువైన జగన్మాత దుర్గమ్మను రాష్ట్రం నలుమూలల నుంచి నిత్యం 40 వేల మంది భక్తులు వచ్చి దర్శనం చేసుకుంటున్నారు. శుక్రవారం, ఆదివారం వారి సంఖ్య 60వేలు ఉంటుంది. వారిలో పేద, మధ్య తరగతి వర్గాలు అమ్మవారికి చీర మొక్కు చెల్లించుకునేందుకు దుర్గాఘాట్‌లోని హాకర్లను, మల్లికార్జున మహామండపంలోని ఐదో అంతస్తులోని దుకాణాలను ఆశ్రయిస్తారు.
అందంగా మాయ చేస్తూ : హాకర్లు,వ్యాపారులు అందమైన ప్యాకింగ్‌లో మూడు గజాల చీరకు బదులు గజం చీర ముక్కను మధ్యలో పేపర్లు పెట్టి అచ్చమైన చీరలా ప్యాకింగ్ చేసి భక్తులకు విక్రయిస్తారు.
ధరలోనూ ధగా: రూ.30ల విలువ కూడా చేయని ఆ చీర ముక్కను భక్తులకు రూ.100ల నుంచి రూ.150లకు విక్రయించి సొమ్ము చేసుకుంటారు.
రీసైక్లింగ్ చేస్తూ: భక్తులు ఇచ్చిన చీరలను దేవాలయంలో ఉంచుతారు.వాటిని దేవస్థానం సిబ్బంది కొందరు వ్యాపారులు, హాకర్ల వద్దకు చేర్చుతున్నారు. వారు తిరిగి వాటిని భక్తులకు అమ్ముతున్నారు. ఇది నిత్యం కొనసాగుతూనే ఉన్నా దానిపై అధికారులు ఏలాంటి చర్యలు తీసుకోకపోవడంతో వారి వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయల్లా సాగిపోతోంది.
పట్టించుకోక ఇలా: గతంలో ఆచీరలను గుండగుత్తగా రూ.22 లక్షలకు గుత్తేదారు పాటపాడుకున్నారు. గత ఏడాది గుత్తేదారు దేవస్థానం అధికారులు పెట్టిన నిబంధనల ప్రకారం ముక్కల చీరను రూ.22.50 చొప్పున విక్రయించేందుకు ధరను నిర్ణయించారు. అందు కోసం రూ.50వేలు డిపాజిట్‌ను కూడా కట్టించారు.
గుత్తేదారునికి: భక్తులు సమర్పించిన ముక్కల చీరలను గోదాములో ఉండే కొందరు సిబ్బంది వ్యాపారులకు దొడ్డి దారిన తక్కువ రేటుకు విక్రయిస్తుండటంతో గుత్తేదారు దగ్గర వాటిని కొనేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. దీనితో గుత్తేదారు వాటిని ఆలయంలోనే ఉంచారు. ఇది సిబ్బందికి వరంలా మారింది. దీని వలన దేవస్థానం ఆదాయానికి భారీగానే గండిపడుతోంది
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.