పరీక్ష ఫలితాలకు ‘ఓయూ’ ప్రత్యేక యాప్‌

ఉస్మానియా విశ్వవిద్యాలయం విడుదల చేసే పరీక్షల ఫలితాలు ఇక నుంచి యాప్‌లో చూసుకునే వెసులుబాటును ఓయూ కల్పించనుంది. ‘ఓయూ స్టూడెంట్‌’ అనే యాప్‌ సాయంతో ఫలితాలు తెలుసుకోవచ్చు.

Published : 08 Feb 2020 00:12 IST

హైదరాబాద్‌: ఉస్మానియా విశ్వవిద్యాలయం విడుదల చేసే పరీక్షల ఫలితాలు ఇక నుంచి యాప్‌లో చూసుకునే వెసులుబాటును ఓయూ కల్పించనుంది. ‘ఓయూ స్టూడెంట్‌’ అనే యాప్‌ సాయంతో ఫలితాలు తెలుసుకోవచ్చు. యాప్‌ ద్వారా ఫలితాలు తెలుసుకునే సౌకర్యాన్ని శుక్రవారం విడుదల చేసిన డిగ్రీ సెమిస్టర్‌ ఫలితాల ద్వారా ఓయూ అధికారులు అందుబాటులోకి తీసుకువచ్చారు.

ఉస్మానియా వర్సిటీ పరిధిలో ప్రతి సెమిస్టర్‌లో సుమారు 80 వేల మంది విద్యార్థులు పరీక్షలు రాస్తుంటారు. పరీక్షల ఫలితాలను విశ్వవిద్యాలయం నేరుగా ఉస్మానియా వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతుంది. అనంతరం అరగంట తర్వాత ఇతర వెబ్‌సైట్లలోనూ అందుబాటులోకి తీసుకొస్తుంది. ఫలితాలు వెలువడిన సమయంలో విద్యార్థులు పెద్ద సంఖ్యలో ఒకేసారి ఉస్మానియా వెబ్‌సైట్‌లోకి వెళ్లి చూస్తుండటంతో సాంకేతిక సమస్యలు వస్తున్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని వర్సిటీకి సాంకేతిక సాయం అందిస్తున్న సైబర్‌ హైట్స్‌ అనే సంస్థ ‘ఓయూ స్టూడెంట్‌’ మొబైల్‌ యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. విద్యార్థులు వారి హాల్‌టికెట్, మొబైల్‌ నంబరుతో యాప్‌లో రిజిస్టర్‌ చేసుకుని ఫలితాలు అరచేతిలో చూసుకోవచ్చు. అలాగే మార్కుల మెమోలు కూడా సేవ్‌ చేసుకునే సౌలభ్యం కల్పించారు. గూగుల్‌ ప్లే స్టోర్‌లో ఈ యాప్‌ను ఉచితంగా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. విద్యార్థులు, ఓయూ అనుబంధ కళాశాలలకు ఇబ్బంది ఉండకూడదన్న ఉద్దేశంతోనే యాప్‌లోనూ ఫలితాలు విడుదల చేసేందుకు అనుమతి ఇచ్చినట్లు వర్సిటీ పరీక్షల నియంత్రణాధికారి ప్రొ.శ్రీరాం వెంకటేశ్‌ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని